
ప్రజాశక్తి-గరుగుబిల్లి : నిలువ నీడ లేని నిరుపేద కుటుంబాలు నివాసం ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర, ప్రభుత్వం చేపడుతున్న సొంతళ్ల నిర్మాణాలు పేదలకు కలగానే మిగిలింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పేదలందరికీ సొంతిల్లు ఏర్పాటు చేసేందుకు వైసిపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. అర్హులైన నిరుపేదలకు ఇళ్లు, అలాగే స్థలాల మంజూరుకు ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. అంత వరకూ బాగానే ఉంది. పేదలకు పట్టాలైతే ఇచ్చారు కానీ స్థలం ఎక్కడ కేటాయించారన్నదే తెలియక లబ్ధిదారులు అయోమయంలో పడ్డారు. ఇప్పటి వరకూ అధికారులు, పాలకులు తక్షణమే మంజూరైన ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని చెబుతూనే వస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా మండలంలోని పలు గ్రామాల్లో లబ్ధిదారులకు పట్టాలైతే ఇచ్చారు కానీ ఇప్పటి వరకూ స్థలం ఎక్కడన్నది చూపని పరిస్థితి. మాకు పట్టాలివ్వాలని లబ్ధిదారులు పలుమార్లు అధికారులకు వినతులు అందించినా ఫలితం శూన్యం. కులవివక్ష వల్లే పట్టాల మంజూరులో జాప్యం జరుగుతోందన్న ప్రచారం మరోవైపున జరుగుతుంది. ఒకవైపు లక్ష్యాలు జిల్లా ప్రథమ స్థానంలో ఉందని చెప్పుకుంటున్న అధికారులు మరోవైపున ఇప్పటికీ ఇళ్లు నిర్మించుకొనేందుకు కనీసం స్థలం ఎక్కడుందో చూపని పరిస్థితి మండలంలోని ఉల్లిభద్రలో నెలకొంది.
మండలంలోని ఉల్లిభద్ర గ్రామానికి చెందిన 10 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అయితే లబ్ధిదారుల్లో ఐదుగురు బిసి, ఐదుగురు దళిత సామాజికవర్గాలకు చెందిన వారు ఉన్నారు. వీరిలో ఐదుగురు బిసి లబ్ధిదారులకు దళితకాలనీలో స్థలం మంజూరు చేయగా, మిగిలిన ఐదు ఎస్‌సి లబ్దిదారులకు బిసి కాలనీలోని ఖాళీ స్థలాల్లో పట్టాలిచ్చారు. అయితే బిసి కాలనీలో ఎస్‌సి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం పట్ల ఆ గ్రామ బిసి అభ్యంతరం వ్యక్తం చేయడంతో స్థలాల మంజూరు ప్రక్రియ నిలిచిపోయినట్టు ఎస్‌సి లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. అర్హులను గుర్తించి వారికి పట్టాలు మంజూరు చేసినప్పుడు రాని అభ్యంతరం స్థలాల కేటాయింపునకు వచ్చేసరికి అభ్యంతరాలు తెలపడం ఎంత వరకు సమంజసమని పలువురు దళితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు తక్షణమే ఇళ్ల స్థలం మంజూరు చేయాలని కోరుతున్నారు.
ఆశ తీరేది ఎన్నడు....
పట్టాలు వచ్చాయని సంబరపడడం తప్ప, స్థలం ఎక్కడ ఉందో తెలియక అయోమయంలో ఉన్నాం. పేదవారికి పట్టాలు పంపిణీ చేసిన అధికారులు, ప్రజా ప్రతినిధులు స్థలం ఎక్కడుందన్న చూపించకపోవడం ఎంతో బాధాకరమైన విషయం
ముదిదాపు సుమతి, జగనన్న కాలనీ పట్టాదారు
లాటరీ పద్ధతి ద్వారా ఇస్తాం
పేదలందరికీ ఇళ్లకు కేటాయించిన స్థలాల్లోనూ, అలాగే గ్రామకంఠానికి సంబంధించిన స్థలంలో సుమారు ఎనిమిది మంది వరకు గోసాలలకై నిర్మాణాలు చేపట్టడం జరిగింది. మరికొంత స్థలం ఆక్రమణలో ఉన్నట్టు సమాచారం. వీటిని తొలగించి అర్హులైన వారికి కేటాయిస్తాం. గ్రామ సభ పెట్టి లాటరీ పద్ధతిలో అర్హులకు కేటాయించిన ఈ స్థలంలో ఎక్కడ స్థలం వస్తే అక్కడే ఇళ్లు నిర్మించుకోవాలి.
- పిఎస్‌ఎల్‌ఎన్ కుమార్, డిప్యూటీ తహశీల్దార్.