Aug 04,2023 22:02

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి

 ప్రొద్దుటూరు (పుట్టపర్తి సర్కిల్‌ ) : చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాజధాని నిర్మాణం కోసం వేల ఎకరాలు భూమిని రైతులు ఇస్తే నేడు రాజధానిని పూర్తిగా నిలిపేసి ఆర్‌-5 జోన్‌లోని భూమిలో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు సిఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చారని చెప్పుకోవడం సరికాదని మాజీ ఎమ్మెల్యే టిడిపి నేత నంద్యాల వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక నెహ్రూ రోడ్డులోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో అమరావతి రాజధాని అంటే అప్పటి ప్రతిపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా రాజధాని అమరావతిని స్వాగతించారన్నారు. ఇప్పుడు మూడు రాజధానులు అంటూ మాట్లాడటం దుర్మార్గమని చెప్పారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ కౌలు ఇవ్వకుండా ప్రభుత్వం వేధిస్తుందని, భూములు విషయమై సుప్రీంకోర్టులో కూడా కేసు నడుస్తుందోని, లెక్కచేయకుండా ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం న్యాయం కాదని వరదరాజుల రెడ్డి అన్నారు. నేడు రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాలను తుది తీర్పు వచ్చేవరకు వెంటనే నిలిపివేయాలని కోర్టు తీర్పు చెప్పిందని చెప్పారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి, అధికారులలో మార్పు రావాలని ,రాజధాని రైతులకు న్యాయం చేయాలని వరదరాజల రెడ్డి కోరారు. కార్యక్రమంలో మాజీ పట్టణ అధ్యక్షుడు ఘంటసాల వెంకటేశ్వర్లు, నాయకులు పాల్గొన్నారు.