Feb 04,2023 22:56

దశాబ్దాలుగా నిధుల కేటాయింపులో నిరాశే
రూ.2,145 కోట్ల కొవ్వూరు-భద్రాచలం లైన్‌కు రూ.20 కోట్లే
రూ.2,120 కోట్ల కోటిపల్లి-నరసాపురం లైన్‌కు రూ.100 కోట్లు
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు తీరని అన్యాయమే
రాష్ట్ర ప్రభుత్వం, ఎంపీల నిర్లక్ష్యమేనని జనం పెదవివిరుపు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

                         జిల్లాకు చెందిన రైల్వేలైన్లపై మోడీ సర్కార్‌ తీరు అత్యంత దారుణంగా మారింది. దశాబ్దాల క్రితం ప్రతిపాదించిన రైల్వేలైన్లను పూర్తి చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం లేకుండాపోయింది. ఏదో నామకేవాస్తే అన్నట్లు నిధులు కేటాయించి మమ అన్పిస్తోంది. ఈ విధంగా నిధుల కేటాయింపు జరిగితే మరో 20 ఏళ్లు అయినా జిల్లాలోని కొవ్వూరు-భద్రాచలం, కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్లు పూర్తయ్యే పరిస్థితి లేదనే చెప్పాలి. జిల్లాలోని రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి నిధులు తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ ఎంపీలు పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లా అభివృద్ధి చెందేందుకు దోహదపడే అత్యంత ముఖ్యమైన రైల్వేలైన్ల నిర్మాణం ఓ ప్రహాసనంలా మారింది. దశాబ్దాలు గడుస్తున్నా రైల్వేలైన్ల ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్న పరిస్థితి నెలకొంది. 1965 నుంచి ప్రతిపాదనలో ఉన్న కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్‌పై కేంద్రం అనుసరిస్తున్న తీరు అత్యంత దారుణంగా మారింది. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టి ఎనిమిదేళ్లు గడుస్తున్నా ఈ రైల్వేలైన్‌ గురించి పట్టించుకోలేదు. ఈ ఏడాదైనా ఈ లైన్‌కు సంబంధించి నిధుల కేటాయింపు ఉంటుందని అంతా ఆశలు పెట్టుకున్నారు. అయితే 151 కిలోమీటర్ల పొడవు కలిగినా ఈ రైల్వేలైన్‌కు ప్రస్తుత అంచనాల ప్రకారం రూ.2,140 కోట్లు వరకూ ఖర్చవుతుందని లెక్కలుగట్టారు. అయితే 2023-24 బడ్జెట్‌లో మోడీ సర్కార్‌ కేటాయించిన నిధులు కేవలం రూ.20 కోట్లు మాత్రమే. ఈ నిధులు సర్వే పనులకు సైతం చాలవని చెప్పొచ్చు. ఈ విధంగా నిధులు కేటాయిస్తే కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్‌ ఎన్ని దశాబ్దాలు పడుతుందో మోడీ సర్కార్‌ చెప్పాల్సి ఉంది. ఈ రైల్వే లైన్‌ పూర్తయితే ఏజెన్సీ, మెట్టప్రాంతం ఎంతగానో అభివృద్ధి చెందుతోంది. ఈ రైల్వేలైన్‌ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వంగాని, కేంద్ర ప్రభుత్వంగాని పట్టించుకోని పరిస్థితి నెలకొంది.
కోటిపల్లి-నరసాపురం లైన్‌కు రూ.వంద కోట్లు మాత్రమే
కోటిపల్లి-నరసాపురం రైల్వేలైన్‌ను 2000-01లో మంజూరు చేశారు. రూ.2,120 కోట్లతో 57.12 కిలోమీటర్ల మేర ఈ లైన్‌ నిర్మిచాల్సి ఉంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 25 శాతం నిధులు కేటాయించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపులు పక్కన పెడితే కేంద్రం గతేడాది బడ్జెట్‌లో రూ.21.40 కోట్లు ప్రస్తుత బడ్జెట్‌లో రూ.వంద కోట్లు కేటాయించారు. ఈ విధంగా నిధులు కేటాయిస్తే ఈ రైల్వేలైన్‌ పూర్తికావడానికి మరో 20 ఏళ్లు పట్టనుంది. ప్రతియేటా అంచనా వ్యయం పెరుగుతూనే ఉంటుంది. ఈ రైల్వేలైన్‌ నిర్మాణం జరిగితే తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని డెల్టావాసులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అయినా పాలకులు పట్టించుకోని పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో ఈ రెండు రైల్వేలైన్లు దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ పట్టాలెక్కని దుస్థితి నెలకొంది. జిల్లాకు చెందిన ఎంపీలుగాని, రాష్ట్ర ప్రభుత్వంగాని పట్టించుకోకపోవడం వల్లే రైల్వే లైన్ల పరిస్థితి ఈ విధంగా తయారైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రైల్వేబడ్జెట్‌లో జిల్లాకు ఏఒక్కటీ లేదు
రైల్వే బడ్జెట్‌లో జిల్లాకు సంబంధించిన ఏఒక్క అంశమూ లేకుండాపోయింది. నరసాపురం-వారణాసి, నరసాపురం-యశ్వంత్‌పూర్‌కు రైళ్లు ఏర్పాటు చేయాలని జిల్లావాసులు కోరుతున్నా పట్టించుకోలేదు. నరసాపురం, చినమామిడిపల్లి వద్ద వంతెన లేదా అండర్‌ టన్నెల్‌ ఏర్పాటు, నరసాపురం-హైదరాబాద్‌ మధ్య రాత్రివేళ అదనపు రైలు ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను సైతం పట్టించుకోలేదు. విజయవాడ-భీమవరం, నరసాపురం-నిడదవోలు రెండోలైన్‌ నిర్మాణం, విద్యుద్దీకరణ పనులకు సంబంధించి పెండింగ్‌ బకాయిలకు రూ.వంద కోట్లు కేటాయించారు. జిల్లావాసులు రైల్వే లైన్ల కలలు ఇప్పట్లో తీరే పరిస్థితి కనుచూపు మేర కానరావడం లేదు.