May 31,2023 00:01

విస్తరణకు నోచని గుంటూరు ఛానల్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : వైసిపి అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయ్యాయి. 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేశారు. గడిచిన నాలుగేళ్లలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆశించిన అభివృద్ధి జరగలేదు. పలు ప్రాజెక్టులు, పథకాలు కాగితాలకే పరిమితమవడంపై అధికార పార్టీ నేతల నుండే పెదవి విరుపులు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
దీర్ఘకాలిక కలగా 'వరికపూడిశెల'
ప్రస్తుత పల్నాడు జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న వరికిపూడిశెల ప్రాజెక్టుకు అటవీ పర్యావరణ శాఖ నుంచి ఇటీవల అనుమతి లభించింది. కేంద్రంతో వైసిపి ప్రభుత్వం సఖ్యతగా ఉన్నా ఈ అనుమతి పొందడానికి నాలుగేళ్లు పట్టింది. ఈ ప్రాజెక్టు రానున్న ఏడాదిలో పూర్తవుతుందునే గ్యారంటీ లేకుండా పోయింది. వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలాల్లో సాగు, తాగునీటి సరఫరాకు ఉద్ధేశించిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకం నిర్మాణం ప్రస్తుతం భూసేకరణ, డిటైల్డు ప్రాజెక్టు రూపకల్పనలో ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
భూసేకరణ దశలోగుంటూరు ఛానల్‌ పనులు
గుంటూరు ఛానల్‌ పొడిగింపు, విస్తరణ పనులు ఇంత వరకు ప్రారంభం కాలేదు. వట్టిచెరుకూరు మండలం గారపాడు నుంచి పర్చూరు వరకు పొడించాలన్న ప్రతిపాదన మేరకు గుంటూరు జిల్లా కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి చొరవతో భూసేకరణ ప్రక్రియ ప్రారంభమైంది. గుంటూరు, బాపట్ల జిల్లాల పరిధిలో మొత్తం 441 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. 2015 మే 27న టిడిపి ప్రభుత్వం రూ.378.25 కోట్ల అంచనాలతో గుంటూరు ఛానల్‌ ఆధునీకరణ, పొడిగింపునకు పరిపాలన ఆమోదం తెలపగా 8 ఏళ్లుగా అదిగో ఇదిగో అంటూ రెండు ప్రభుత్వాలు కాలయాపన చేస్తూ వచ్చాయి. మూడు నెలలుగా ఈ పనులపై అధికారులు దృష్టిసారించారు.
వాటర్‌ గ్రిడ్‌ ఉన్నట్టా ...లేనట్టా...
9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు చేపట్టిన వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్టుకు పరిపాలన ఆమోదం తెలిపినా ఇంతరకు కార్యరూపం దాల్చలేదు. పల్నాడు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు శాశ్వత ప్రాతిపదికన నిర్మాణాలు చేసేందుకు రూ.2600 కోట్లతో ప్రతిపాదించిన వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుల నిర్మాణం కాగితాలకే పరిమితమైంది. గ్రామాల్లో రహదారులు అధ్వానంగా మారాయి. నిధుల కొరత, కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం వల్ల పనులు జరగడం లేదని చెబుతున్నారు. అసలు ఈ పనులపై ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారుల నుంచి ఎటువంటి సమాచారమూ లేదు.
ముందుకు సాగని వైఎస్సార్‌ పల్నాడు దుర్బిక్ష పథకం
గోదావరి జలాలను సాగర్‌ జలాశయంలోకి ఎత్తిపోసేందుకు రూపొందించిన డాక్టర్‌ వైఎస్సార్‌ పల్నాడు దుర్భిక్ష నివారణ పథకంపై భూ సేకరణ దశలోనే ఉందిపోయింది. వైకుంఠపురం నుంచి నకరికల్లు వరకు ఐదు ఎత్తిపోతల పథకాలను నిర్మించి సాగర్‌ కాల్వలకు గోదావరి జలాలను అనుసంధానం చేసే గోదావరి-పెన్నా అనుసంధాన పథకాన్ని పేరు మార్చిన ప్రభుత్వం గత 4 ఏళ్లుగా ఈ పథకంపై దృష్టి సారించలేదు.
టెండర్ల దశ దాటనిరహదారులు
పల్నాడు ప్రాంతంలో పలు రహదారులు జాతీయ రహదారులుగా మార్పు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియడంలేదు. దాచేపల్లి-మాచర్ల, నాగార్జున సాగర్‌-దేవులపల్లి, పేరేచర్ల-కొండమోడు జాతీయ రహదారులుగా మార్చి అభివృద్ధి చేసేందుకు ఇచ్చిన ఉత్తర్వులు ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఎంతో కాలంగా పెండింగ్‌లో ఉన్న కొండమోడు-పేరేచర్లరహదారి అద్వానంగా మారినా మరమ్మతులకూ నోచుకోవడం లేదు. కొండమోడు -పేరేచర్ల మార్గంలో నాలుగులైన్ల రహదారి నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. రాజధాని అమరావతి నుంచి అనంతపురం వరకు తలపెట్టిన ఎక్స్‌్‌ప్రెస్‌ హైవే పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు.
తిరోగమనంలో పారిశ్రామిక పురోగతి
గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి ఆశించిన స్థాయిలో వేగం పుంజుకోవడం లేదు. కొత్తగా భారీ పరిమ్రలు ఏర్పాటుకు చర్యలేమీ లేవు. సహజ వనరులు, ఎన్నో నిక్షేపాలున్నా వీటిపై అధికారులు దృష్టి సారించడం లేదు. పల్నాడులోని సున్నపురాయి, ముగ్గురాయి, నాపరాయి, గ్రానైట్‌ నిక్షేపాలను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలించే వారు ఎక్కువగా ఉన్నారు. ఈ నిక్షేపాలతో స్థానికంగా పరిశ్రమలు ఏర్పాటుకు ప్రభుత్వం చొరవ చూపించడం లేదు. గుంటూరులో ఉన్న ఏకైక భారీ పరిశ్రమ భజరంగ్‌ జ్యూట్‌మిల్లు మూతపడి ఏడేళ్లు దాటింది. మిల్లు తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని పాదయాత్రలో హామీ ఇచ్చిన జగన్‌మోహన్‌రెడ్డి ఇంత వరకు దీనిపై స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయారు. ప్రస్తుతం రాయితీలు అందక స్పిన్నింగ్‌, జిన్నింగ్‌ మిల్లులు సంక్షోభంలో ఉన్నాయి.
అమరావతి అభివృద్ధి అస్తవ్యస్తం
రాజధాని అమరావతి అభివృద్ధి నిలిచిపోయింది. గత నాలుగేళ్లలో ఒకటి రెండు మినహా మిగతా అభివృద్ధి పనులు ఏమీ జరగలేదు. కరకట్ల విస్తరణ పనులు మాత్రమే చేపట్టారు. రూ.3 వేల కోట్లతో అసంపూర్తిగా ఉన్నపనులు పూర్తి చేస్తామనే పనులు ముందుకు సాగలేదు. మూడు రాజధానులను తెరపైకి తెచ్చి 2019 డిసెంబరు 17 నుంచి ఇప్పటివరకు 1260 రోజులుగా సాగుతున్న ఉద్యమాన్ని కృత్రిమ ఉద్యమంగా అభివర్ణించిన ప్రభుత్వ పెద్దలు అమరావతిని తాము అభివృద్ధి చేయలేమని హైకోర్టులోనే అఫిడవిట్‌ దాఖలు చేశారు. తాజాగా ఆర్‌5 జోన్‌ లో 50,793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.
యుజిడి పనులపై నిర్లక్ష్యం
గుంటూరులో 2017లో ప్రారంభం అయిన భూగర్భ డ్రెయినేజి పనులు నాలుగేళ్లుగా పాలకులు పట్టించుకోవడం లేదు. 2020 జనవరికి పూర్తి కావాల్సిన పనులు 2019 మే నెలలో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా ఆగిపోయాయి. రూ.903 కోట్లతో చేపట్టిన ఈ పనులు 55 శాతం మేరకు జరిగాయి. దాదాపు రూ.505 కోట్లతో పనులు చేసినట్టు చెబుతుండగా మిగతా పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఇటీవల సిఎం జగన్‌ గతేడాది గుంటూరు వచ్చిన సందర్భంలో యూజిడి పనులకు రూ.232 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు.