బ్రిటీష్ కాలం నాటి రాజద్రోహం సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయిస్తూ బిజెపి సాగిస్తున్న ఆగడాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చెంప పెట్టు లాంటి తీర్పును గత గురువారం వెలువరించింది. కోవిడ్‌తో దేశం అతలాకుతలమైపోతున్నా ఏమాత్రమూ పట్టించుకోకుండా అధికార పీఠాల పైనా, కార్పొరేట్ ప్రయోజనాల పైనా దృష్టి నిలిపి వినాశకర చర్యలతో ప్రజలకు పెనుభారంగా తయారైన కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గదీసి నిలదీసే కలాల, గళాల ఆవశ్యకత నేడు అంతా ఇంతా కాదు. బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేట్ అడుగులకు మడుగులొత్తుతూ, మత విద్వేషాలు రాజేస్తూ ప్రజల హక్కులను, రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ దేశాన్ని తిరోగమనంలోకి నెట్టేసింది. ఆర్డినెన్స్‌లతో దొడ్డిదారిన చీకటి చట్టాలను తీసుకొచ్చి వేధిస్తున్నది. ప్రభుత్వ తీరును ప్రతిఘటిస్తుంటే, ప్రశ్నిస్తుంటే దేశద్రోహులుగా ముద్ర వేస్తోంది. విద్యార్థులు, రైతులు, మేధావులు, పాత్రికేయులు, కళాకారులు, కార్టూనిస్టులు, రచయితలు.. ఇలా ఒక్కరేమిటి మోడీ సర్కార్ వినాశకర చర్యలను కాస్త గట్టిగా నిలదీస్తే చాలు కమలనాథుల దృష్టిలో వారంతా దేశద్రోహులే. ప్రముఖ పాత్రికేయుడు వినోద్ దువా వర్సెస్ హిమాచల్ ప్రదేశ్ కేసులో సుప్రీం కోర్టు తాజాగా ఇచ్చిన ఈ తీర్పు దేశ ప్రయోజనాలను కాలరాసే విధానాలను, చర్యలను ప్రశ్నించే గళాలకు, ప్రతిఘటించే జనాలకు కొండంత ఉత్తేజాన్ని ఇస్తుంది. న్యాయ వ్యవస్థ నుంచి దేశ ప్రజానీకం కోరుకుంటున్న 'నీడ్ ఆఫ్ ది అవర్' ఇప్పుడు ఇదే.
ప్రభుత్వ నిర్ణయాలను, వాటిని అమలు చేసే ప్రతినిధులను విమర్శించే హక్కు పౌరులందరికీ ఉంటుంది. ఎటొచ్చీ ఆ విమర్శలు హింసను ప్రేరేపించేలా, ప్రజా జీవితంలో అరాచకం సృష్టించేలా ఉండకూడదు. ఆ పరిధి దాటనంత వరకూ పౌరులపై కానీ, ప్రభుత్వ విమర్శకులపై కానీ రాజద్రోహం నేరం అపాదించడం సాధ్యపడదు. 1962 నాటి కేదార్‌నాథ్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయాన్ని స్పష్టం చేసిందని ధర్మాసనం పేర్కొంది. రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రాల పరిరక్షణ కింద ప్రతి పాత్రికేయుడూ రక్షణకు అర్హుడేనని తేల్చి చెప్పి వినోద్ దువాపై బనాయించిన రాజద్రోహం కేసును కొట్టిపారేస్తూ జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ వినీత్ శరణ్‌తో కూడిన ధర్మాసనం చేసిన వ్యాఖ్యలన్నీ మోడీ సర్కార్‌కు మొట్టికాయలే. కోవిడ్ లాక్‌డౌన్, పరీక్ష కిట్లు అందుబాటులో లేకపోవడం, వలస కార్మికుల వెతలపై వినోద్ దువా చేసిన వ్యాఖ్యల్లో నేరమేదీ లేదని, ఆ సమయంలో పరిస్థితులు భయానకంగా ఉన్నాయి కాబట్టే దువా అలా వ్యాఖ్యానించాల్సి వచ్చిందని సమర్థించింది. వలస కార్మికుల కష్టాల వంటివి స్పష్టంగా తెలియాలంటే దేశంలో కోవిడ్ పరిస్థితులపై ప్రజలకు కచ్చితమైన సమాచారం ఉండేలా కేంద్ర ప్రభుత్వమే ప్రతిరోజూ న్యూస్ బులిటెన్ విడుదల చేయాలని కూడా ధర్మాసనం సూచించింది.
దువా కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఆశాజనకంగానే ఉన్నా పౌరులకు రాజ్యాంగ బద్ధంగా దఖలు పడిన భావ ప్రకటన స్వేచ్ఛ, వాక్ స్వాంతంత్య్రపు హక్కు పరిధిపై పదేపదే సర్వోన్నత న్యాయస్థానమే తీర్పులను పునరుద్ఘాటించాల్సి రావడం పాలనా వ్యవస్థలో నిరంకుశ ధోరణులకు దర్పణం పడుతోంది. ఒక పౌరుడు చేసిన వ్యాఖ్యలు రాజద్రోహం కిందకు వస్తాయా రావా అని నిర్ధారించుకునే అవగాహన కేసు నమోదు సమయంలో పోలీసు అధికారులకు ఉండటం లేదా? అవగాహన ఉండి కూడా కేసులు నమోదు చేస్తున్నారంటే అది చట్టవ్యతిరేకమూ కోర్టు ధిక్కరణా అవుతుంది కదా. జాతీయ నేర రికార్డుల బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) గణాంకాలను చూస్తే ప్రతి యేటా రాజద్రోహం కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారైన ప్రత్యామ్నాయ మీడియాపై కక్ష కట్టి మోడీ సర్కార్ ఎంతటి వేధింపులకు పాల్పడుతోందో నిత్యం చూస్తూనే వున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటీవల మీడియా సంస్థలపై రాజద్రోహం కేసు పెట్టి మోడీ బాటలో పయనిస్తోంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇటు వైసిపి సర్కార్‌కు కూడా కనువిప్పు కలిగించాలి. మొత్తంగా చూసినప్పుడు సుప్రీం తీర్పు ప్రజాతంత్ర శక్తులకు కొత్త ఊపునిచ్చి భావప్రకటనా స్వేచ్ఛ వెల్లివిరిసేందుకు దోహదం చేస్తుందనడంలో సందేహం లేదు.










