కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేసినందుకు జర్నలిస్టులను, మీడియా సంస్థలను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక భయానక వాతావరణంలో... బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల బెదిరింపులు, చట్టపరమైన వేధింపుల మధ్య... స్వతంత్ర మీడియా పని చేస్తోంది. వాస్తవాలను మాట్లాడే, తమ విధానాలను విమర్శించే జర్నలిస్టులను, మీడియా సంస్థలను చట్టపరంగా వేధింపులకు గురి చేస్తూ, మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం వారిపైన పూర్తి అసహనాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ విధానాలను, చర్యలను ప్రశ్నించిన ప్రముఖ సంపాదకులు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా దేశద్రోహ చట్టాన్ని, 'ఉపా' లాంటి అనాగరిక చట్టాలతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌లను ప్రయోగిస్తున్నారు.
నలభై మంది భారతీయ జర్నలిస్టులపై పెగాసస్ స్పైవేర్‌తో పెట్టిన నిఘా బయటపడింది. ఇది స్వతంత్ర మీడియాపై దాడికి అనువుగా ఉన్న విషయాన్ని తెలియజేస్తుంది. ఏడుగురు జర్నలిస్టుల ఫోన్లపై 'ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ల్యాబ్' నిర్వహించిన విశ్లేషణలో, ఐదు ఫోన్లపై పెగాసస్ నిఘా వేసిన ఆనవాళ్ళను రుజువు చేసింది. 'ద వైర్' వ్యవస్థాపక సంపాదకులు సిద్ధార్థ్ వరదరాజన్‌తో సహా మరికొందరు జర్నలిస్టుల పేర్లు ఆ జాబితాలో ఉన్నట్లు కనుగొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జే షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సన్నిహితుడైన వ్యాపారి నిఖిల్ మర్చంట్‌ల వ్యాపార వ్యవహారాలపై కథనాలను పంపిన తరువాత... మోడీ కేబినెట్‌లో ప్రముఖుడైన పియూష్ గోయల్‌తో వ్యాపారవేత్త అజరు పిరమల్‌కు ఉన్న సంబంధాలను విచారిస్తున్న సమయంలో 'వైర్' జర్నలిస్టు రోహిణీ సింగ్ ఫోన్ నెంబర్ ఆ జాబితాలో కనిపించింది.
అణచివేత వాతావరణం
పెగాసస్ స్పైవేర్ చర్యలు బహిర్గతం కావడానికి ముందు కూడా, జర్నలిస్టులు స్వేచ్ఛగా, నిర్భయంగా పని చేసేందుకు భారతదేశం ప్రమాదకరమైన దేశంగా మారుతోంది. 'ఇండియన్ ప్రెస్ ఫ్రీడం రిపోర్ట్ 2020' ప్రకారం, ఢిల్లీ మేథావులకు చెందిన 'రైట్స్ అండ్ రిస్క్స్ ఎనాలిసిస్ గ్రూప్' (ఆర్.ఆర్.ఎ.జి) 2020లో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు...కనీసం 226 మంది జర్నలిస్టులు, రెండు మీడియా సంస్థలే లక్ష్యంగా చర్యలు చేపట్టాయి. 13 మంది హత్యకు గురయ్యారు. 37 మందిని నిర్బంధంలో వుంచారు. వారందరిలో 64 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, 13 మంది జర్నలిస్టులకు, ఒక వార్తాపత్రిక వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి, 101 మంది జర్నలిస్టులపై భౌతిక దాడులు, బెదిరింపులు, ఇళ్ళ మీద దాడులు, కుటుంబ సభ్యులపై దాడులు చేసినట్లు గణాంకాలను విడుదల చేసింది. మోడీ నాయకత్వం లోని బిజెపి రెండోసారి అధికారం చేపట్టిన 2019 ఏప్రిల్ నుండి హిందూ జాతీయవాదులు చెప్పినట్టు చేయాలనే ఒత్తిడి పెరుగుతూ ఉంది.
'గెట్టింగ్ అవే విత్ మర్డర్' పేరుతో అధ్యయనం చేసిన 'ఠాకూర్ ఫ్యామిలీ ఫౌండేషన్' నివేదిక ప్రకారం 2014-2019 మధ్య మోడీ ప్రభుత్వ పాలనలో, జర్నలిస్టుల పైన 200 పైగా దాడులు జరిగాయి. అదే కాలంలో 40 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారు. జర్నలిస్టులకు భారత్ అత్యంత ప్రమాదకరమైన దేశమని, వరల్డ్ ప్రెస్ ఫ్రీడం సూచీలో మొత్తం 180 దేశాల్లో భారత్‌ను 142వ దేశంగా 2020లో 'రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్' గుర్తించింది. చట్టపరమైన వేధింపులు, ఎఫ్‌ఐఆర్‌లు, దాడులు, అరెస్టులు, హత్యలు ఇప్పుడు నిఘాలతో జర్నలిస్టులపై గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులే లక్ష్యంగా రోజువారీ చర్యలు నిత్యకత్యం అయ్యాయి. మే 2021 ఇండో-యూరోపియన్ శిఖరాగ్ర సదస్సులో, 'ద కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్' (సిపిజె) భారతదేశంలో జర్నలిస్టులు పని చేస్తున్న ప్రతికూల పరిస్థితులను తెలుపుతూ తమ విధులను నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోవద్దని కోరాలని విజ్ఞప్తి చేస్తూ ఒక లేఖను అందజేసింది. పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన సమస్యను లేవనెత్తుతూ, ఇప్పటికీ నిర్బంధంలో ఉన్న జర్నలిస్టులు సిద్ధిక్ కప్పన్, ఆసిఫ్ సుల్తాన్, ఆనంద్ తెల్తుందే, గౌతమ్ నవలఖాలను విడుదల చేయాలని సిపిజె పిలుపునిచ్చింది. 'కాశ్మీర్ న్యారేటర్' మ్యాగజైన్‌కు 'రెయిజ్ ఆఫ్ బుర్హాన్' పేరుతో ఒక కథనాన్ని రాశాడని ఆరోపణలు చేస్తూ కాశ్మీరీ జర్నలిస్టు ఆసిఫ్ సుల్తాన్‌ను అక్టోబర్ 2018లో అరెస్ట్ చేశారు. వీరంతా కఠినమైన 'ఉపా' చట్టం కింద నిర్బంధంలో వున్నారు.
ఆర్.ఆర్.ఎ.జి సమాచారం ప్రకారం, గత ఏడాది అరెస్ట్ అయిన జర్నలిస్టులందరిలో 37 మంది ఉత్తరప్రదేశ్, 22 మంది మహారాష్ట్ర, 18 మంది జమ్మూ కాశ్మీర్, 15 మంది ఢిల్లీ, 12 మంది కర్నాటకకు చెందినవారు. వీరిలో భౌతికంగా హింసకు గురై, అన్‌లైన్ వేధింపులు, బెదిరింపులకు గురైన 12 మంది మహిళలు ఉన్నారు. అనేక మంది జర్నలిస్టులు తమ తమ రాష్ట్రాలలో, ఇతర రాష్ట్రాల్లో లెక్కలేనన్ని ఎఫ్‌ఐఆర్ లను ఎదుర్కొన్న వారిలో వినోద్ దువా, ఆకార్ పటేల్, జగత్ బైన్స్, ఓం శర్మ, అశ్వనీ షైనీ ఉన్నారు. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ప్రపంచ మీడియా వాచ్‌డాగ్ లా పని చేస్తున్న ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్సిట్యూట్ (ఐపిఐ) జర్నలిస్టుల పైన 18 దాడులు, 8 అరెస్ట్‌లు, భారతదేశంలో 20 చట్టపరమైన వేధింపుల కేసులను నమోదు చేసింది. భారతదేశంలో జులైలో పర్యటిస్తున్న యునైటెడ్ స్టేట్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్‌కు అందజేసిన లేఖలో ఈ ఘటనలన్నిట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేసినందుకు జర్నలిస్టులను, మీడియా సంస్థలను లక్ష్యంగా పెట్టుకున్నారని ఐపిఐ తెలిపింది. ఒక భయానక వాతావరణంలో బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాల బెదిరింపులు, చట్టపరమైన వేధింపుల మధ్య స్వతంత్ర మీడియా పని చేస్తుందని ఆ లేఖలో ఐపిఐ పేర్కొంది. 'వాస్తవాలను మాట్లాడే, తమ విధానాలను విమర్శించే జర్నలిస్టులను, మీడియా సంస్థలను చట్టపరంగా వేధింపులకు గురి చేస్తూ, మోడీ నాయకత్వం లోని బిజెపి ప్రభుత్వం వారిపైన పూర్తి అసహనాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ విధానాలను, చర్యలను ప్రశ్నించిన ప్రముఖ సంపాదకులు, జర్నలిస్టులకు వ్యతిరేకంగా దేశద్రోహ చట్టాన్ని, 'ఉపా' లాంటి అనాగరిక చట్టాలతో పాటు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ లను ప్రయోగిస్తున్నార'ని ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇతర మార్గాల ద్వారా బెదిరింపులు
కేసులు నమోదు చేయడంతో పాటు, ప్రభుత్వం ఇతర మార్గాల ద్వారా బెదిరింపులకు పాల్పడుతోంది. జులై 2021లో ఆదాయ పన్ను శాఖ అధికారులు పన్నులు ఎగవేశారనే కారణంతో, మన దేశంలోనే అత్యంత ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న హిందీ దిన పత్రిక యజమాని దైనిక్ భాస్కర్ ఇళ్ళ మీద, 30 కార్యాలయాలు, భారత్ సమాచార్ అనే న్యూస్ ఛానల్ మీద ఏక కాలంలో దాడులు చేశారు. కోవిడ్-19 నివారణా చర్యలను ప్రభుత్వం సరిగా నిర్వహించలేదని తమ పత్రిక ఇచ్చిన సమాచారానికి ప్రతీకారంగానే దాడులు జరిగాయని దైనిక్ భాస్కర్ పేర్కొన్నారు. ఫిబ్రవరిలో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై న్యూస్ క్లిక్ డైరెక్టర్ల ఇళ్ళు, కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసింది. అప్పటికే ఒక మనీ ల్యాండరింగ్ కేసు పోలీసుల విచారణలో వుంది. ఢిల్లీ పోలీసులు దానిని ఆగస్ట్ 2020లో ప్రారంభించారు.
'ద వైర్' కు, అక్కడ పని చేస్తున్న రిపోర్టర్లకు వ్యతిరేకంగా అనేక ఎఫ్‌ఐఆర్ లు, సమన్లు నమోదయ్యాయి. ఏప్రిల్ 2020లో ఉత్తరప్రదేశ్ పోలీసులు 'ద వైర్' ఎడిటర్ సిద్ధార్థ్ పైన ఒక నేరం మోపారు. గత నెలలో జమ్మూ కాశ్మీర్ పోలీసులు రెండు కథనాలు రాసినందుకు సిద్ధార్థ్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. జూన్ 2021లో ఉత్తరప్రదేశ్ పోలీసులు న్యూస్ పోర్టల్, జర్నలిస్టులు రాణా ఆయూబ్, మహమ్మద్ జుబెయిర్ పైన... హిందువులు ఘజియాబాద్‌కు చెందిన ముస్లిం వృద్ధుడిని వేధిస్తూ, కొట్టిన ఘటనను వీడియో తీసినందుకు నేరాన్ని మోపారు. అనేకమంది జర్నలిస్టులు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ నమోదును వ్యతిరేకిస్తూ చేసిన నిరసనలను తెలియపరచినందుకు లేక కరోనా మహమ్మారిని నిరోధించడంలో ప్రభుత్వ వైఫల్యాలను బహిర్గతం చేసినందుకు అనేక మంది జర్నలిస్టులను నిర్బంధించారు. ఉదాహరణకు, గత సంవత్సరం ఫిబ్రవరిలో ఉర్దూ దిన పత్రికలో జర్నలిస్ట్‌గా పని చేస్తున్న ముబాషిరుద్దీన్ ఖుర్రంను సిఎఎ/ఎన్‌ఆర్‌సి లను వ్యతిరేకిస్తూ చేసిన నిరసనల వార్తలను అందించినందుకు హైదరాబాద్‌లో అరెస్ట్ చేసి 15 గంటల పాటు నిర్బంధంలో వుంచారు. ఫిబ్రవరి 2020లో ఒక బిజెపి కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా రాజబక్సీ అనే ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ ఎడిటర్‌ను, సిఎఎ/ఎన్‌ఆర్‌సి లకు వ్యతిరేకంగా కర్నాటకలో కొప్పల్ జిల్లా లోని ఓ ఫంక్షన్‌లో ఒక పద్యం పాడిన సిరాజ్ బిసారలీతో పాటు అరెస్ట్ చేశారు.
ఏప్రిల్ 2020లో బీహార్ లోని ముంగర్‌కు చెందిన ఒక కోవిడ్ రోగి మరణం గురించి తప్పుడు సమాచారమిచ్చారన్న ఆరోపణలతో ఆన్‌లైన్ పోర్టల్‌లో జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల పవన్ చౌదరిని అరెస్ట్ చేశారు. అదే నెలలో జమ్మూ కాశ్మీర్‌లో లాక్‌డౌన్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలతో 'ద కాశ్మీర్ అబ్జర్వర్'లో పని చేస్తున్న 34 ఏళ్ల ముష్తఖ్ అహ్మద్ గనైని అరెస్ట్ చేసి రెండు రోజులు నిర్బంధంలో వుంచారు. అతడు తన గుర్తింపు కార్డు, కారుకు సంబంధించిన పత్రాలను చూపించినప్పటికీ పోలీసులు అతని కారును అడ్డగించారు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ అతన్ని పదే పదే చెంప దెబ్బలు కొట్టి, లాఠీతో కొట్టాడు. మే 2020లో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరిగిన కారణంగా వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని గుజరాత్‌లో నాయకత్వ మార్పు జరగబోవచ్చు అన్న కథనాన్ని రాశాడనే ఆరోపణలతో గుజరాత్ వార్తా పత్రిక 'ఫేస్ ఆఫ్ నేషన్' లో ఎడిటర్‌గా పని చేస్తున్న ధావల్ పటేల్‌ను దేశద్రోహ నేరం కింద 15 రోజులు నిర్బంధంలో వుంచారు. ఇక ముందు 'ఎటువంటి నేరాలకు పాల్పడనని' షరతులు లేని క్షమాపణ పత్రం రాసిచ్చిన తరువాత మాత్రమే గుజరాత్ హైకోర్టు దేశద్రోహ నేరం మోపడాన్ని తోసిపుచ్చింది.
సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని ఢిల్లీకి చెందిన స్వతంత్ర జర్నలిస్ట్ ప్రశాంత్ కనోజియా ను, అజమ్‌గఢ్ లోని ఒక పాఠశాలలో విద్యార్థులు నేలను తుడుస్తున్న ఫొటోలు తీశాడని సంతోష్ జైస్వాల్ ను అరెస్ట్ చేశారు. తనపై ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టాడని ఒక బిజెపి ఎంపీ ఫిర్యాదు చేయడంతో లఢక్ లోని ఫేస్‌బుక్ అడ్మినిస్ట్రేటర్, జర్నలిస్ట్ త్సేవంగ్ రిగ్జిన్‌ను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో కొన్ని వ్యాఖ్యలు పోస్ట్ చేశారనే ఆరోపణలతో మణిపూర్‌కు చెందిన కిశోర్ చంద్ర వాంఖ్ ఖెమ్ ను దేశద్రోహ చట్టం కింద అరెస్ట్ చేశారు.
పత్రికా స్వేచ్ఛపై ప్రభుత్వం ప్రత్యక్షంగా చేస్తున్న దాడితో పాటు ప్రభుత్వానికి అనుకూలంగా లేని పత్రికా సంస్థలకు అడ్వర్‌టైజ్‌మెంట్స్ ఇవ్వకుండా నిధులను తిరస్కరిస్తున్నారు. జులై 2020లో కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ పరిధిలో వున్న 'ద ల్యాండ్ అండ్ డెవలప్‌మెంట్' కార్యాలయం వారు, న్యూఢిల్లీ లోని పార్లమెంట్ స్ట్రీట్‌లో పిటిఐ కేంద్ర కార్యాలయం కోసం కేటాయించిన ప్లాట్ విషయంలో కొన్ని నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలు చేస్తూ 84 కోట్ల రూపాయలు జరిమానా చెల్లించాలని పిటిఐ కి నోటీసు పంపారు. జాతీయ కార్యక్రమాలు ప్రసారం చేసే సంస్థ, 'ప్రసార భారతి' జాతి వ్యతిరేక సమాచారాన్ని అందిస్తున్న 'మీ న్యూస్ ఏజెన్సీ' అనుమతిని రద్దు చేస్తామని బెదిరించిన రెండు రోజుల తరువాత ప్రభుత్వం పిటిఐ కి నోటీసులు పంపింది.
/ 'ఫ్రంట్ లైన్' సౌజన్యంతో /
దివ్యా త్రివేది











