ఆకులతో అద్భుతాలు సృష్టించే ఆర్నమెంటల్ మొక్కలు క్రోటన్ మొక్కలు.
దీని శాస్త్రీయ నామం 'కోడియాడియం వేరిగేటమ్'. వీటిలో వందల రకాలున్నాయి. ఇండోర్, ఔట్ డోర్ ప్లాంట్స్ మొక్కలూ ఉన్నాయి.
ఇవి అడుగు ఎత్తు నుంచి పదడుగుల ఎత్తువరకూ పెరుగుతాయి. ఆకులు దళసరిగా విభిన్న ఆకృతుల్లో, రంగుల్లో కొలువుదీరి ముగ్ధమనోహరంగా ఉంటాయి. రకరకాల క్రోటన్ మొక్కల పరిచయం...
- కోడీయమ్ వెరీగెటుమ్:
తళతళలాడే రంగుల మెరుపులతో మొక్క చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఆకులు విభిన్న రంగుల కలబోతతో చూడగానే ఆహా! అనిపిస్తుంది. ఆకులు మందంగా ఉంటాయి. మొక్క కాస్తంత నీడలో, షెమీ షేడ్లో బాగా పెరుగుతాయి. వీటిని కుండీల్లో పెంచి, కార్యాలయాల్ల్లో అలంకరించుకుంటే అందంగా ఉంటాయి. ఈ హైబ్రిడ్ మొక్క కొబ్బరిపొట్టు మిశ్రమంలో బాగా పెరుగుతుంది. కొద్దికొద్దిగా రోజూ నీరు పోస్తూ ఉండాలి.
- మమ్మే క్రోటన్
సన్నని ఆకులు వడి తిప్పినట్లుగా ఉంటాయి. ప్రత్యేకమైన ఆకారంలో ఆకట్టుకునే ఆకులుండే మొక్కలు మమ్మే క్రోటన్ మొక్కలు. మొక్కకు అన్ని వైపులా గుంపుగా ఆకులు కొలువుదీరి మొక్క కనువిందుగా ఉంటుంది. మొక్క భలే నిఘారింపుగా ఉంటుంది. దీనిక్కూడా ప్రతీ రోజూ కొద్దికొద్దిగా నీళ్లు పోయాలి. వీటిని కుండీల్లో పెంచుకోవడం శ్రేయస్కరం.
- క్రోటన్ జూలీ
ఆకులు చాలా సన్నగా, పొడవుగా ఉంటాయి. ఒక్కో ఆకు 10 నుంచి 20 అంగుళాలు పొడవు వరకూ ఉండి రంగులతో అలరిస్తాయి. మొక్క రెండు నుండి ఐదడుగులు ఎత్తు వరకూ పెరుగుతుంది. కుండీల్లోనూ, నేలమీదా ఈ మొక్కలను పెంచుకోవచ్చు. నీటి వనరు ఎక్కువ అవసరం. మొక్కకు కింది ఆకులు పండి వాడిపోతుంటే పైనుంచి చిగుళ్లతో కొత్త ఆకులు వస్తుంటాయి.
- బిళ్ల క్రోటన్
చిన్ని చిన్ని ఆకులు మొక్క నిండా గుంపుగా ఉంటాయి. ఆకుపచ్చని ఆకులమీద పసుపు రంగు చుక్కలు ఎంతో రమణీయంగా ఉంటాయి. ఆకులు కాస్త దళసరిగా ఉంటాయి. మొక్క నాలుగడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. కుండీల్లోనూ, నేలమీదా వీటిని పెంచుకోవచ్చు. ఎక్కువగా బోర్డర్ ప్లాంట్స్‌లా వీటిని పెంచుతుంటారు.
- ఆపిల్ క్రోటన్
ఆకులు ఆపిల్ పండ్లలాగ గుండ్రంగా ఉంటాయి. మొక్క పొట్టిగా, ఆకులు ఒకదానికొకటి అతుక్కుని ఉండి అందంగా ఉంటాయి. ఈ మొక్క చాలా నెమ్మదిగా పెరుగుతుంది. కొబ్బరిపొట్టు మిశ్రమంలో ఆకులు నిఘారింపుగా పెరుగుతాయి. కుండీల్లో ఆరుబయట వీటిని అలంకరించుకోవచ్చు.
నీటివనరు సమానంగా అవసరం.
- ఫింగర్ క్రోటన్
ఈ మొక్క ఆకు మూడు వేళ్ళు చాచినట్టుగా ఉంటుంది. అందుకే దీన్ని ఫింగర్ క్రోటన్ అని పిలుస్తారు. ఇందులో పసుపు రంగుతో బాటు చాలా రంగులు ఉంటాయి. ఇది హైబ్రిడ్ వెరైటీ. ఇవి కుండీల్లో పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. నీటి వనరు సమానంగా అవసరం.
- ఉల్టాసీదా క్రోటన్
ఆకు పై భాగంలో పచ్చగా, అడుగుభాగాన ఎరుపు రంగు డిజైన్లు ఉండే మొక్క ఉల్టాసీదా క్రోటన్. తొలుత ఆకు పచ్చగానే ఉంటుంది. ముదిరే కొలదీ కింద వైపు ముదురు ఎరుపుగా మారుతుంది. ఇది పూర్తిగా డెకరేటివ్ ప్లాంట్. మెరిసే పింగాణీ జాడీల్లో పెంచితే ఈ మొక్కలు మరింత అందాన్ని ఇస్తాయి.
- దేశవాళీ క్రోటన్
ఇది 15 అడుగులు ఎత్తు వరకూ పెరుగుతుంది. పార్కుల్లో ఎక్కువగా వీటినే పెంచుతారు. దుమ్ము లోపలకి రాకుండా ఇంటి ముంగిట వీటిని పెంచుతుంటారు. ఈ మొక్కలు 25 ఏళ్ల వరకూ పెరుగుతాయి. వేసవి కాలంలో చిగురించి, మిగతా కాలాలలో ఆ ఆకులు పెరుగుతూ ఉంటాయి. రంగు రంగుల కలబోతతో ఆకులు అందంగా ఉంటాయి.
- చిలుకూరి శ్రీనివాసరావు, 89859 45506