Oct 21,2021 06:14

'నన్ను ప్రధానిని చేస్తే విదేశాల్లో దాచుకున్న నల్లధనం ఇండియాకు రప్పించి ప్రతి వ్యక్తి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తా'నని 2014 ఎన్నికల ప్రచారంలో మోడీ హామీ ఇచ్చారు. అయితే ఒక్క పైసా కూడా ప్రజల ఖాతాలో జమ చేయలేదు. పెద్ద నోట్ల రద్దు చేస్తూ కూడా నల్ల ధనం వెనక్కు రప్పిస్తానని ప్రధాని మోడీ ప్రకటించారు. చివరి ఏమైంది? పనామా, ప్యారడైజ్‌, పండోరా పత్రాలలో వందలాది మంది వివరాలను వెల్లడించినా ప్రయోజనం లేకుండా పోయింది.'

అంతర్జాతీయ జర్నలిస్టుల బృందం సంవత్సరం పాటు పరిశోధన చేసి విదేశాల్లో దాచుకున్న నల్లధనుల చిట్టాలను బయట పెట్టింది. ఇందులో ఇండియా నుండి 380 మంది పేర్లను బహిర్గతం చేసింది. ఆ మరుసటి రోజు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు స్పందించి దీనిపై లోతుగా విచారణ జరిపి నల్లధనాన్ని బయటకు రాబడతామని ప్రకటించడంతో భారత దేశంలో ఆ సమస్య ముగిసిపోయింది! ఇది జరిగే పనేనా, నిజంగా బయటకు వస్తోందా?
ఒక దేశంలో వ్యాపారం చేసి, ఆ దేశంలో చట్టపరంగా చెల్లించాల్సినంత పన్నులు చెల్లించకుండా ఎగనామం పెట్టి దాచుకునే డబ్బే నల్లధనం. బ్యాంకుల దగ్గర రుణం తీసుకొని, అవి చెల్లించకుండా నష్టాల పేరుతో ఎగ్గొట్టిన ధనం. వీటికి అదనంగా డ్రగ్స్‌, అక్రమ ఆయుధాలు, మహిళల రవాణా, వ్యభిచార ముఠాలు నడపడం వంటి సంఘ విద్రోహ కార్యకలాపాల ద్వారా పోగేసుకునే అక్రమ సంపద కూడా నల్లధనమే. ఇలా ప్రపంచ వ్యాప్తంగా సంవత్సరానికి 600 కోట్ల బిలియన్‌ డాలర్లు బ్లాక్‌ మనీ పన్నులు చెల్లించకుండా విదేశాలకు తరలిపోతున్నదని ఐఎంఎఫ్‌ ప్రకటించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో లేనివి ఉన్నట్లు, అవాస్తవాలను వాస్తవాలుగా మార్చి కాగితాల మీద కంపెనీలను (డొల్ల) సృష్టించడం, ట్రస్టుల పేరుతో పన్నులు తక్కువగా ఉన్న దేశాలకు తరలిస్తున్నారు. ఇలా డబ్బును ఒక దేశం నుండి ఇంకో దేశానికి అక్రమంగా తరలించేందుకు కొన్ని అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు పని చేస్తున్నాయి. వాటి వివరాలను బయటకు తీసేవే పనామా, ప్యారడైజ్‌, పండోరా పత్రాలు.
పత్రాలు ఏం చెబుతున్నాయి?
అంతర్జాతీయ మీడియా సంస్థలు 'ఇంటర్నేషనల్‌ కన్సార్టియం ఆఫ్‌ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్ట్స్‌' (ఐసిఐజె)గా ఏర్పడి పరిశోధనలు చేస్తున్నాయి. ఈ కృషి ఫలితంగా 2016లో పనామా పేపర్లలో 'మొసాక్‌ ఫోన్సెకా' అనే కార్పొరేట్‌ కంపెనీ 2 లక్షల 14 వేల డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి, వాటి ద్వారా ప్రపంచ నల్లధనుల డబ్బు దాచిందని బయట పెట్టింది. ఇండియా నుండి 500 మంది పేర్లను ఇందులో బయటపెట్టింది. 2017లో ప్యారడైజ్‌ పేపర్లలో ఇలాంటి డొల్ల కంపెనీలను నడిపే మూడు కార్పొరేట్‌ సంస్థల బాగోతాన్ని బయటపెట్టింది. ఇందులో 714 మంది భారత నల్లధనుల చిట్టాను బయటపెట్టింది. ఇప్పుడు పండోరా పేపర్లలో డొల్ల కంపెనీలతో పాటు, డొల్ల ట్రస్టులను కూడా కలిపి నడిపే 14 కార్పొరేట్‌ సంస్థల నుండి 29 వేల డొల్ల కంపెనీల వివరాలను బయటపెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల తాజా, మాజీ నేతలను, మరో 300 మంది రాజకీయ నేతలు, న్యాయమూర్తులు, కార్పొరేట్‌ యజమానులు, మరో 100 మంది ప్రముఖల వివరాలను వెలికితీసింది. ఇందులో 380 మంది భారత ప్రముఖుల పేర్లు ఉన్నాయి. ఈ పత్రాలలో బయట పడిన నల్లధనులు పన్నులు చెల్లించకపోవడం వలన ప్రపంచ దేశాలు 42,700 కోట్ల డాలర్లు పన్నులు కోల్పోతున్నాయని హెచ్చరించింది.
కొండను తవ్వి ఎలుకను పట్టిన మోడీ ప్రభుత్వం
'నన్ను ప్రధానిని చేస్తే విదేశాల్లో దాచుకున్న నల్లధనం ఇండియాకు రప్పించి ప్రతి వ్యక్తి ఖాతాలో రూ.15 లక్షలు జమ చేస్తా'నని 2014 ఎన్నికల ప్రచారంలో మోడీ హామీ ఇచ్చారు. అయితే ఒక్క పైసా కూడా ప్రజల ఖాతాలో జమ చేయలేదు. పెద్ద నోట్ల రద్దు చేస్తూ కూడా నల్ల ధనం వెనక్కు రప్పిస్తానని ప్రధాని మోడీ ప్రకటించారు. చివరి ఏమైంది? పనామా, ప్యారడైజ్‌, పండోరా పత్రాలలో వందలాది మంది వివరాలను వెల్లడించినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రపంచ దేశాలతో సమాచార మార్పిడిలో భాగంగా...ఆటోమేటిక్‌ ఎక్స్ఛెేంజ్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ (ఎఇఏఐ) ద్వారా స్విస్‌ బ్యాంకుకు చెందిన ఫెడరల్‌ టాక్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌టిఏ) 96 దేశాలతో 33 లక్షల వివరాలను ఈ ఏడాది పంచుకుంది. పండోరా పేపర్ల తర్వాత సైతం స్విట్జర్లాండ్‌ నుండి ఒక లిస్టు ఇండియాకు చేరింది. గత ఏడేళ్ల నుండి సుప్రీం కోర్టులో కేసులు నడుస్తూనే ఉన్నాయి. ఏడు జాబితాలు అందించారు. బ్రిటన్‌, బహమాస్‌, జెర్సీ, మారిషస్‌, పనామా, హాంకాంగ్‌, యుఏఇ, సింగపూర్‌ వంటి దేశాల నుండి ఇప్పటి వరకు మూడు దఫాలు సమాచారం అందిందని 2017 లోనే ఆర్థిక సహాయమంత్రి ప్రకటించారు. పైన ప్రస్తావించుకున్న అన్ని రకాల సమాచారాలను అందుకున్న కేంద్ర ప్రభుత్వం 2016 నుండి 2020 వరకు మనీ లాండరింగ్‌ యాక్టు కింద నల్లధనులపై 16,991 కేసులు నమోదు చేసింది. అందులో కేవలం 235 మాత్రమే నిర్థారణ అయ్యాయి. మొత్తం కేసుల్లో 1.38 శాతం మాత్రమే నేరం రుజువు అయ్యాయి. మిగిలిన 98.62 శాతం కేసులు ఫాల్స్‌గా మారాయంటేనే మన ఇన్వెస్టిగేటివ్‌ సంస్థలు ఎంత బాగా పని చేస్తున్నాయో, చేయిస్తున్నారో తేలిపోయింది. 2015 నల్లధనం యాక్టు కింద 11,010 కోట్ల నల్లధనాన్ని, పనామా పేపర్లలో 20,078 కోట్లు, ప్యారడైజ్‌ పేపర్ల ద్వారా 246 కోట్ల నల్లధనాన్ని ఈ కేసుల ద్వారా గుర్తించామని 2021 మార్చిలో పార్లమెంటుకు ఇచ్చిన సమాచారంలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. ఎంత ధనం బయటకు తీశారో మాత్రం వెల్లడించలేదు.
ప్రభుత్వ సాయం లేకుండా నల్లధనం ఎగిరిపోతుందా?
బిజెపి మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే తనయుడు, ప్రస్తుత బిజెపి ఎం.పి దుష్యంత్‌ సింగ్‌ తన భార్య పేరుతో పెట్టిన డొల్ల కంపెనీలు బయటపడ్డాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకుకు రూ.14 వేల కోట్లు ఎగనామం పెట్టి పారిపోయిన నీరవ్‌ మోడీ తన సోదరి పేరుతో నెల రోజులు ముందు రూ.1800 కోట్లు విలువ చేసే డొల్ల కంపెనీలు పెట్టి విదేశాల్లో దాచుకున్న విషయం వెల్లడైంది. ఐపిఎల్‌ కుంభకోణం చేసి పారిపోయిన లలిత్‌ మోడీ, విదేశాల్లో దాచిన డబ్బుతో మరలా పంజాబ్‌, రాజస్థాన్‌ ఐపిఎల్‌ టీమ్‌ లను తన బంధువుల పేరుతో కొని నడుపుతున్నాడు. అనిల్‌ అంబానీ మూడు చైనా బ్యాంకులకు రుణం చెల్లించడానికి డబ్బు లేదని లండన్‌ కోర్టులో అంగీకరించి 18 డొల్ల కంపెనీలు స్థాపించాడు. రెండు లక్షల కోట్లు రుణాలు చెల్లించాల్సి వుండగా...తన దగ్గర రూ.35 కోట్లు మాత్రమే ఉన్నాయని చెప్పిన స్టీల్‌ దిగ్గజం లక్ష్మి మిట్టల్‌... లక్షల కోట్లు దాచిన డొల్ల కంపెనీలు ఈ రోజు బయటపడ్డాయి. మోడీకి అత్యంత సన్నిహితులైన సచిన్‌, బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌, కిరణ్‌ మంజుందార్‌ షా వంటి అత్యధికులు బయటపడ్డారు. 2014 నుండి 2018 మధ్యలో మన దేశం నుండి 23 వేల మంది మిలియనీర్లు విదేశాలకు పారిపోయారని మోర్గాన్‌ స్టాన్లీ నివేదిక పేర్కొంది. 2020లో కూడా 5000 మంది పారిపోయారని గ్లోబల్‌ వెల్త్‌ మైగ్రేషన్‌ రివ్యూ నివేదిక పేర్కొంది. బ్యాంకుల పారుబకాయిలు మోడీ కి ముందు 5 శాతం ఉంటే, 2017-18లో 15 శాతం, 2020 నాటికి 23 శాతానికి పెరిగాయని రిజర్వుబ్యాంకు పేర్కొంది. ఇలా విదేశాలు పారిపోయిన వారి వలన ఇండియా సంవత్సరానికి 427 బిలియన్‌ డాలర్లు పన్నులు నష్టపోతున్నదని ఆక్ఫ్‌ఫాం ఇండియా తెలిపింది. ఇలా ప్రతి ఏడాది రుణాలు, పన్నులు ఎగ్గొట్టి పారిపోతున్న వారి సంఖ్య పెరిగిపోవడం, దొరికిన వారి నుండి తిరిగి ఆ డబ్బు రాబట్టలేకపోవడం వలనే పనామా పత్రాల్లో బయటపడిన చాలా మంది పేర్లు పండారా పేపర్లలో సైతం బయటపడ్డాయి. కేంద్ర ప్రత్యక్ష పన్నులు విభాగం, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, ఫైనాన్షియల్‌ ఇంటిలిజెన్స్‌, రిజర్వుబ్యాంకు విభాగాలన్నీ...కేంద్ర ప్రభుత్వానికి లంగని సోనూ సూద్‌, తమిళ హీరో విజరు వంటి వారి మీద లేదా రాజకీయ ప్రత్యర్థి నేతల మీద పని చేసినంత త్వరగా నల్ల దొంగల మీద పని చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమే తప్ప నిఘా సంస్థల వైఫల్యం కాదు. వారి నుండి రాబట్టకపోగా బిజెపి ప్రభుత్వం తిరిగి వారికి రుణాలు మాఫీ, పన్నులు మాఫీ, పెట్టుబడులలో రాయితీలు ఇచ్చి మనం కట్టిన పన్నులను దోచిపెట్టింది. ఆ డబ్బును పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌, నూనె ధరలు పెంచి మన నుండి వసూలు చేస్తోంది. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను కారుచౌకగా అమ్మి ప్రజానీకానికి నష్టం చేకూర్చుతున్నది. చట్టాలు, సంస్థలు నల్లధనులను అడ్డుకోకపోగా కాపు కాస్తున్నాయని తేలిపోయింది. ఇక ఏం చేయాలో తేల్చుకోవాల్సింది ప్రజలే.

ఎం. సూర్యారావు

/ వ్యాసకర్త - డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి /