Sep 20,2021 07:49

గాలికి ఆకులు చిరిగినట్లు, కీటకాలు కొరికేసి రంధ్రాలు చేసినట్లు, రంగులు పులిమినట్లు చిత్ర, విచిత్ర ఆకృతుల్లో, విభిన్న పరిమాణాల్లో కొలువుదీరే కళా శోభితాలు 'పినానోనా' మొక్కలు. 'మాన్‌స్టెరా డెలిసేయొసా' అనే శాస్త్రీయ నామంతో పిలిచే వీటి ఆకులు చాలా దళసరిగా ఉంటాయి. తీగ జాతికి చెందిన ఈ మొక్క 30 అడుగుల ఎత్తు వరకూ పెరగగలదు. ఇవి పొడవాటి చెట్లకు అల్లుకుంటూ పైకి పాకుతుంది. వీటి తీగలు బలాన్ని పుంజుకుని, ఒక్కోసారి అల్లుకున్న చెట్లనే చంపేస్తాయి. ఇది మొండిజాతి మొక్క. ఈ మొక్కల గురించి మరెన్నో విశేషాలు..

స్విస్‌ చీజ్‌ ప్లాంట్‌:

స్విస్‌ చీజ్‌ ప్లాంట్‌:
ఇది మాన్‌స్టెరాలో ఆడాన్సోనీ ష్కాట్‌ రకం. చిన్ని చిన్ని ఆకుల మధ్యలో రంధ్రాలు చేసినట్లు, కీటకాలు కొరికేసినట్లు వింతగా ఉంటాయి. కుండీల్లో పెంచుకునే ఈ మొక్క పూర్తిగా ఇండోర్‌. ఇంట్లో ఏ మూల ఉంచినా అందరి దృష్టీ తనవైపు మరల్చుకోగల ఆకర్షణ ఈ మొక్కది. కొబ్బరిపొట్టు మిశ్రమంలో బాగా పెరుగుతుంది.

దక్షిణ మెక్సికో అడవుల్లో పనామాకి చెందిన పుష్పించే మొక్క ఇది. కాలక్రమేణా ప్రపంచమంతా ఎగబాకింది. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ జాతిలోనూ వందలాది రకాలు సరికొత్త హైబ్రీడ్‌ మొక్కలు పుట్టుకొచ్చేశాయి. సహజంగా ఇవి బయటి వాతావరణంలో పెరుగుతాయి. వీటిని 'సింహ పంజా' అని కూడా పిలుస్తారు.

వైల్డ్‌ వెరైటీ:

వైల్డ్‌ వెరైటీ:
మాన్‌స్టెరా డెలిసేయొ, సామాన్‌స్టెరా డెలిసేయొసాలో వైల్డ్‌ వెరైటీ ఈ జాతి మొక్కలకు మూలము. దాదాపు అడుగు, అడుగున్నర పొడవున్న పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి. ఆకుపచ్చ రంగులో ఉండే పత్రాలు రెండువైపులా క్రమబద్ధంగా కత్తిరించినట్లుగా ఉంటాయి. ఇవి చాలా పొడవు పెరుగుతాయి. ప్రహారీ గోడలు, డాబా అంచులు, చలువ పందిరుల మీదనూ ఈ మొక్కలు చక్కగా ఎగబాకి, హరిత కాంతులు విరజిమ్ముతాయి.
ఫ్లవర్‌ అండ్‌ ఫ్రూట్‌:
ఈ మొక్క ఏళ్ల తరబడి పెరిగిన తరువాత అరుదుగా పువ్వులు, పండ్లు కాస్తుంది. అరచేతి పరిమాణంలో తెల్లటి పడగలాంటి పువ్వు ఒకటి విచ్చుకుంటుంది. దానికి మధ్యలో అందమైన దూట మరింత శోభని అద్దుతుంది. ఈ పువ్వు దాదాపు నెల రోజులు తాజాగా ఉంటుంది. అలాగే పొడవాటి అరటికాయలు వంటి కాయలూ కాస్తాయి. కాసిన పిందె పెరిగి, పెద్దదై పండడానికి ఏడాది సమయం పడుతుంది..
 

హాఫ్‌ వైట్‌ ఇండోర్‌:

హాఫ్‌ వైట్‌ ఇండోర్‌:
ఒక అరుదైన ఇండోర్‌ మొక్క హాఫ్‌ వైట్‌ ఇండోర్‌. ఇది వెరిగేటా జాతి. ఆకులు శీర్షభాగం నుంచి ఒకవైపు తెలుపు, మరోవైపు ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఉంటాయి. వీటిని ఇంటి లోపల ఎక్కడైనా అలంకరించుకోవచ్చు. నీటి వనరు కూడా పెద్దగా అవసరం లేదు. అయితే కాస్త పెద్ద కుండీల్లో పెంచాలి.
 

వైట్‌ మిక్సర్‌ లీఫ్స్‌ ప్లాంట్‌:

వైట్‌ మిక్సర్‌ లీఫ్స్‌ ప్లాంట్‌:
ఈ మొక్క ఆకులు తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. కాకపోతే ఆకుపచ్చని పత్రాల మీద పాల తెలుపులు చిలకరించినట్లుగా ఉంటాయి. చీకట్లో కూడా మిరమిట్లు గొలిపే ఈ మొక్క ధరలోనూ ఘనమే. దీన్ని ఒక కర్ర సాయంతో కుండీల్లో పెంచవచ్చు. నెమ్మదిగా పెరిగే దీనికి నీటి వనరు తక్కువగా ఉన్నా తట్టుకుంటుంది.
 

మాన్‌స్టెరా డెలిసేయొసా :

మాన్‌స్టెరా డెలిసేయొసా :
ఇది ఔట్‌డోర్‌ మొక్క. కానీ పొట్టిజాతికి చెందినది. ఆకుపచ్చని ఆకులు కుండీల్లో చుట్టూ విరబూసినట్లు గుజ్జుగా పెరుగుతాయి. ఒక్కో ఆకు నెలల తరబడి నిగారింపుగా ఉంటుంది. నేలమీద నాటితే వేరులు భూమికి చాలా లోతుగా వెళ్లి, కావలసిన నీటిని అదే సంపాదించుకుంటుంది. కత్తిరించిన ఆకులు అలంకరణకు ఉపయోగిస్తారు. తెల్లకుండీల్లో ఈ మొక్క మరింత అందంగా కనిపిస్తుంది.
 

డబుల్‌ కలర్‌ వెరిగేటా:

డబుల్‌ కలర్‌ వెరిగేటా:
ఒకే మొక్కకు కొన్ని ఆకులు ఆకుపచ్చగాను, మరికొన్ని తెల్లగాను, ఇంకొన్ని సగం తెలుపు, సగం ఆకుపచ్చగాను, ఇంకా రెండు రంగుల కలబోతతో ఉంటాయి. ఇది థారులాండ్‌ రకం మొక్క. కుండీల్లో ఇంటి లోపల బాగా పెరుగుతుంది. ఆకులకు రోజూ మూడుసార్లు నీళ్లు స్ప్రే చేస్తే చాలు.
 

పెయింట్‌ లీఫ్‌:

పెయింట్‌ లీఫ్‌:
మాన్‌స్టెరా డెలిసేయొసాలో మరో అపురూపం పెయింట్‌ లీఫ్‌. ఆకుపచ్చని ఆకుల మీద మరో రంగు అచ్చంగా పెయింట్‌ వేసినట్లుగా ఉంటాయి. మొక్క ఏ రెండాకులు ఒకే రంగు, రీతిలో ఉండవు. ఆకులు దళసరిగా, మొక్క పొట్టిగా పెరుగుతుంది. ఇది సెమీషేడ్‌ మొక్క. ఇవి ఎండ తగలని ప్రదేశాలలో బాగా పెరుగుతాయి.
 

ఎల్లో షేడ్‌ డబల్‌ కలర్‌:

ఎల్లో షేడ్‌ డబల్‌ కలర్‌:
ఈ మొక్క ఆకుపచ్చని ఆకుల మీద పసుపురంగు ఛాయ ఉంటుంది. ఎంతో అందంగా ఉండే ఈ జాతి మొక్కల్లో రెండు రకాలున్నాయి. ఒకటి పొట్టి రకం. ఇది కుండీల్లో ఇంటి లోపల పెంచుకునే వినూత్న మొక్క. మరొకటి పెద్ద రకం. ఆకులు 12 నుంచి 20 అంగుళాలు వరకూ పెరుగుతాయి. మొక్క తీగల్లాగా 60 అడుగుల ఎత్తు వరకూ అల్లుకుపోతుంది. కొబ్బరి, తాటి, ఫాక్స్‌ టైల్‌, ఫిష్‌ టైల్‌, పోక వంటి పొడవుగా ఎదిగే ఫామ్‌ మొక్కల కాండాలకు ఈ పాదును పాకిస్తారు.
 

చిలుకూరి శ్రీనివాసరావు
89859 45506