సంతాప సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం
ప్రజాశక్తి - గణపవరం
గణపవరం, కేశవరం ప్రాంతాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి 40 సంవత్సరాల పాటు అవిశ్రాంత పోరాటం చేసిన పట్నాల శ్రీనివాసరావు ధన్యజీవి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. ఆదివారం సరిపల్లిలోని ఎంపిడిఒ కార్యాలయ ఆవరణలో జరిగిన శ్రీనివాసరావు సంతాప సభకు ఆ పార్టీ మండల కార్యదర్శి పి.నరసింహమూర్తి అధ్యక్షత వహించారు. సభలో తొలుత శ్రీనివాసరావు చిత్రపటానికి మంతెన సీతారాం పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సీతారాం మాట్లాడుతూ శ్రీనివాసరావు తన చేతి వృత్తి చేసుకుంటూ ప్రజాఉద్యమాల్లో అగ్రభాగాన నిలిచాడన్నారు. కేశవరం, పిప్పర ప్రాంతాల్లో పార్టీ, ప్రజాసంఘాల నిర్మాణంలో స్థానిక పెత్తందార్లను ఎదిరించి ముందుకు సాగాడని కొనియాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం శ్రీనివాస్ తపించేవారని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని అన్నారు.
జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు చింతకాయల బాబూరావు మాట్లాడుతూ గణపవరం ప్రాంతంలో కార్మికోద్యమం నిర్మాణంలో శ్రీనివాస్ పాత్ర చిరస్మరణీయమన్నారు. సభలో సిపిఎం ఏలూరు జిల్లా నాయకులు గుడిపాటి నరసింహారావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కె.సోమరాజు, ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు షేక్ వలీ, సిపిఎం నేత పి.గోవింద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎం.పెంటారావు, ఎస్.సంజీవరావు, గుత్తుల శ్రీను, చిన్న నాగేశ్వరరావు పాల్గొన్నారు.










