Jun 12,2023 22:19

వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-గుంటూరు : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యాల మేరకు సక్రమంగా అమలు చేయాలని వైద్యారోగ్య శాఖాధికారులను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడి ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ, విద్యాశాఖ, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై మండల స్థాయి అధికారులతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సోమవారం తన క్యాపు కార్యాలయం నుండి సమీక్షించారు. ఫ్యామిటీ డాక్టర్‌ విధానం క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు చేయాలని, నిర్దేశించిన విధంగా ఫాలోఅప్‌ ట్రీట్మెంట్‌లు అందించాలని చెప్పారు. సీడీ, ఎన్‌సీడీ సర్వే వెంటనే పూర్తి చేయాలన్నారు. అన్ని పాఠశాలల్లో జగనన్న విద్యా దీవెన కిట్ల పంపిణీని వెంటనే ప్రారంభించాలని, కిట్ల పంపిణీపై వివరాలను ప్రతిరోజూ మండలాల వారీగా నివేదిక అందించాలని ఆదేశించారు. పాఠశాలలో జగనన్న గోరుముద్ద పథకం రాగి జావా, మధ్యాహ్న భోజనం నిర్దేశిత సమయానికి కచ్చితంగా అందించేలా విద్యాశాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. పాఠశాలలో పెండింగ్‌లో ఉన్న నాడు-నేడు పనులు తక్షణమే పూర్తయ్యేలా ఎంఇవోలు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బరువు తక్కువు, బలహీనంగా ఉన్న పిల్లలు ప్రతిరోజు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ఆహారం తీసుకునేలా సూపర్‌వైజర్లు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో మోహనరావు, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ శ్రావణబాబు, జిల్లా విద్యాశాఖ అధికారి పి.శైలజ, ఐసీడీఎస్‌ పీడీ బి.మనోరంజని పాల్గొన్నారు.