Jan 20,2023 23:52

కెనాల్‌ బయట వైపు రివిట్‌ మెంట్‌ పనులు జరుగుతున్న దృశ్యం

ప్రజాశక్తి -సీలేరు
డొంకరాయి పవర్‌ కెనాల్‌కు భవిషత్తులో ముప్పు వాటిల్లకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని ఏపీ జెన్కో ఎస్‌ఇ సివిల్‌ కెకెవి.ప్రశాంత్‌ కుమార్‌ వెల్లడించారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలోని డొంకరాయి పవర్‌ కెనాల్‌ 3/6 రీచ్‌ వద్ద గత నెల 14న అర్ధ రాత్రి గండి పడిన విషయాన్ని ప్రస్తావిస్తూ దానికి సంబంధించి కెనాల్‌ లోపల భాగం పనులు ఇంతకుముందే పూర్తి చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం బయట వైపు పనులు దాదాపు పూర్తికా వస్తున్నాయన్నారు. మరో వారం పది రోజుల్లో పవర్‌ కెనాల్‌ మరమ్మతు పనులు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుందని చెప్పారు. డొంకరాయి పవర్‌ కెనాల్‌ బయట వైపు రివిట్‌ మెంట్‌ (రాయసోలింగ్‌) పనులు శరవేగంగా జరుగుతున్నాయని, పవర్‌ కెనాల్‌ అంతర్భాగం, బయటి వైపు నుంచి వచ్చే ఊటనీరు పోయేందుకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. బలిమెల, జోలాపుట్‌, సీలేరు, డొంకరాయి జలాశయాల్లో మన వాటా 41 టీఎంసీలు నీటి నిల్వలు ఉన్నాయన్నారు. ఈ నీటితో సీలేరు కాంప్లెక్స్‌ పరిధిలో విద్యుత్‌ కేంద్రాల నుంచి విద్యుత్‌ ఉత్పత్తికి, గోదావరి డెల్టా నీటి అవసరాలు బట్టి నీటిని విడుదల చేస్తూ, పొదుపుగా నీటిని వినియోగించుకోవడం జరుగుతుందని చెప్పారు. సీలేరు కాంప్లెక్స్‌లో గ్రిడ్‌ ఆదేశాలకు అనుగుణంగా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తున్నామని, ప్రస్తుతం పవర్‌ కెనాల్‌ ద్వారా నీటి విడుదల కొనసాగుతుందని తెలిపారు.