ప్రజాశక్తి పాడేరు:పటిష్టమైన ఓటర్ల జాబితాల తయారీతోనే నిజమైన ప్రజాస్వామ్యానికి ఆస్కారం లభిస్తుందని, అర్హులైన ఓటర్లు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎలక్టోరల్ అబ్జర్వర్‌గా నియమితులైన రాష్ట్ర డైరీ అభివృద్ధి ఫెడరేషన్ కోపరేటివ్ లిమిటెడ్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ప్రత్యేకాధికారి అహమ్మద్ బాబు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల విధులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పని చేయాల్సిందేనని లేకుంటే క్రమశిక్షణా చర్యలకు పాత్రులు అవుతారని స్పష్టం చేసారు. ప్రతి బూత్ స్థాయి కార్యాలయంలో వివరాలు ప్రచురించాలని ఆదేశించారు. యువ ఓటర్ల గుర్తింపు పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అవసరమైతే ఇతర జిల్లాలలో చదువుతున్న యువతను గుర్తించడానికి ఆయా కళాశాలలకు వెళ్లి ఓటరుగా నమోదు చేయాల్సిన భాద్యత బిఎల్‌ఓలు చేపట్టాలన్నారు. అన్ని బూత్ లెవల్ కార్యాలయాలలో ఓటర్ల జాబితా అందుబాటులో ఉండాలన్నారు. ఓటర్ల తొలగించడంలో తప్పనిసరిగా నిబందనలు పాటించాలని సూచించారు. ఓటర్ల నమోదు, తొలగింపులు, తిరస్కరణలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలన్నారు. ఎక్కువ జనాభా ఉన్న గ్రామాలకు ఏఈఆర్‌వోలు కూడా వెళ్ళాలన్నారు. ఆన్‌లైన్, ఆప్‌లైన్‌లో కూడా సమస్యలు తెలియజేయవచ్చని, అవసరమైతే నేరుగా తన నంబర్ 9441412121కు కాల్ చేయవచ్చని సూచించారు.
జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించారు. జిల్లాలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 661 మంది ఓటర్లు ఉన్నారని, 283 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారని తెలిపారు. జిల్లలో 22 మండలాలకు 22 మంది ఏఈఆర్‌వోలు, ఏడుగురు అదనపు ఏఈఆర్‌వోలు ఉన్నారని, 1008 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు.
శాసన సభ్యులు కే.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, కొన్ని గ్రామాలలో కనీసం 10 కిలోమీటర్లు కాలి నడకన వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. అబ్జర్వర్ స్పందిస్తూ అటువంటి ఓటర్లను దగ్గరగా ఉన్న బూత్ కు మార్చాలని అధికారులను ఆదేశించారు.
అరకు శాసన సభ్యులు చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ, ముంచింగిపుట్టు మండలం బుంగపుట్టు పంచాయతిలో బూత్ దూరంగా ఉన్నందున గత ఎన్నికలలో ఓటింగ్ బారు కట్ చేసారని తెలిపారు.
మాజీ శాసనసభ్యులు గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, బూత్ లెవల్ ఏజంట్లకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలిపారు. అనంతరం సిపిఎం నేత వి.ఉమామహేశ్వరరావు, బిజెపి నేత కృష్ణారావు, రాజారావు తదితరులు మాట్లాడారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ జే. శివశ్రీనివాసు, ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాల కృష్ణ, పాడేరు, రంపచోడవరం సబ్ కలెక్టర్లు వి. అభిషేక్, శుభం బన్సాల్, శిక్షణ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్‌ఓ దయానిధి, తదితరులు పాల్గొన్నారు.










