Nov 09,2022 23:33

  • రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌ కుమార్‌

ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : పటిష్టమైన ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటర్ల పాత్ర కీలకమని, అర్హత కలిగిన యువత ఓటరుగా నమోదు కావాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా అన్నారు. నగరంలోని మొగల్రాజపురం పిబి సిద్దార్థ ఆర్ట్స్‌ అండ్‌సైన్స్‌ కళాశాల ఆడిటోరియంలో బుధవారం స్వీప్‌ (సిస్టమేటిక్‌ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్ట్రోల్‌ పార్టిసిపేషన్‌)లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ప్రతి సంవత్సరం ఎన్నికల సంఘం నవంబర్‌లో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తోందన్నారు. దీనిలో భాగంగా ఈ ఏడాది కొత్తగా నమోదైన ఓటర్లు, తొలగించిన, మార్పులు చేర్పులు అనంతరం రాష్ట్రవ్యాప్తంగా డ్రాప్ట్‌ రోల్‌ ప్రకటిస్తామన్నారు. జనాభాలోని స్త్రీ, పురుష నిష్పత్తి ఆధారంగా ఓటర్ల నమోదు, జనాభాలో 18 నుండి 19 సంవత్సరాల వయసు గల యువత ప్రతి ఒక్కరూ ఓటర్లగా ఉండాలనే నిష్పత్తిని పాటించాలని అన్నారు. జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో డ్రాప్ట్‌ పబ్లికేషన్‌ ప్రకటించామని ఆయా పొలింగ్‌ కేంద్రాల్లో ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలన్నారు. బూత్‌ స్థాయి అధికారులు కూడా అందుబాటులో ఉంటారన్నారు. జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు మాట్లాడుతూ అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో డ్రాప్ట్‌ పబ్లికేషన్‌, బిఎల్వోలు అందుబాటులో ఉంటారని ఓటర్‌గా నమోదు కాని వారు అన్‌లైన్‌, ఆప్లైన్‌ విధానంలో నమోదు చేసుకోవాలన్నారు. ఎన్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన ఫారం-8 ద్వారా ఓటును నియోజవర్గం నుండి మరో నియోజకవర్గానికి మార్పు చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. కార్యక్రమంలో ఓటుహక్కు కలిగి ఉండటం ఓటర్‌ డేటాకు ఆధార్‌ అనుసంధానంతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించే నాటికను ప్రదర్శించారు. అనంతరం ఓటు హక్కుపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. తొలిత ఓటు హక్కు నమోదు పై అవగాహనా ర్యాలీని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం వద్ద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా, జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు జెండా ఊపి ప్రారంభించారు. అవగాహన ర్యాలీ స్టేడియం నుండి ప్రారంభమై మొగల్రాజపురం పి.బి. సిద్ధార్థ ఆర్డ్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల ఆడిటోరియానికి చేరుకుంది. ఈకార్యక్రమంలో స్వీిప్‌ నోడల్‌ ఆఫీసర్‌, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజరు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, నగర పాలక సంస్థ అడిషనల్‌ కమీషనర్‌ శ్యామల, పిఓయుసిడి శకుంతల, సిటీ ప్లానర్‌ జివిజి ఎస్‌ వి ప్రసాద్‌, కళాశాల ప్రిన్సిపల్‌ ఎం రమేష్‌ పాల్గొన్నారు.