ప్రజాశక్తి-రేపల్లె: పశుపెంపకందారులు పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను తప్పకుండా వేయించాలని మండల పశు వైద్య అధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. రేపల్లె మండలం రజుకాల్వ గ్రామంలో చేపట్టిన ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు రాకుండా రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని సూచించారు. పాడి రైతులు పశువులు, జీవాలకు చెవి కమ్మలు తప్పక వేయించాలని పేర్కొన్నారు. 112 గేదెలు, దూడలు, 6 తెల్ల పశువులకు గాలికుంటు టీకాలు వేసినట్టు తెలిపారు. 59 గేదెలను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో చీరాల రాజబాబు, సచివాలయం కన్వీనర్ మల్ల మహేష్, మాజీ నీటి సంఘం ప్రెసిడెంట్ తలశిల సీతారామయ్య, పశుపోషకులు పాల్గొన్నారు.










