ప్రజాశక్తి -హుకుంపేట: పాడి, పశువుల పెంపకందారులుగా వాటి ఆరోగ్యం, వాటికి వచ్చే వివిధ రకాల వ్యాధులు, నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ ఇతర అంశాలపై రైతులకు అవగాహన అవసరమనిజిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డాక్టర్ స్వామినాయుడు అన్నారు. గురువారం మండలంలోని కొట్నాపల్లి పంచాయతీ మత్య్సపురం తదితరగ్రామాల్లో నాలుగునెలలు పైబడిన పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేసే కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా పశువిజ్ఞానబడి నిర్వహించి, గిరిజన రైతులకు అవగాహన కల్పించారు. పశువులు అస్వస్థతకు గురైనా, ఎటువంటి వ్యాధి సోకినా వెంటనే దగ్గరలోని పశువైద్యాలయానికి వెళ్లి వైద్యులు, సిబ్బందిని సంప్రదించి, తగు చికిత్స చేయించాలని సూచించారు. పశువులకు ఏయే సీజన్‌లో ఎటువంటి వ్యాధులు వస్తాయో అవగాహన ఉంటుందని, అయితే వాటికి అందుబాటులో ఉండే టీకాలపైనా వెటర్నరీ వైద్యులు, సిబ్బందిని సంప్రదించి, ఎప్పటికప్పుడు వాటిని పశువులకు వేయించాలన్నారు. పశువుల వ్యాధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ప్రాణనష్టం వస్తుందని, తద్వారా పెంపకందారులు ఆర్థికంగా నష్టపోతారని సూచించారు. పశువుల పెంపకం ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటి పేడ ద్వారా వచ్చే గత్తంతో సేంద్రీయ వ్యవసాయం చేసి, పంటలను పండిస్తే మన ఆరోగ్యానికి మేలు జరుగుతుందన్నారు. పంటల సస్యరక్షణకు పశువుల పేడ, మూత్రంతోనూ జీవ రసాయనాలను తయారుచేసి తెగుళ్లు, చీడపీడలను నుంచి పంటలను రక్షించుకోవచ్చన్నారు.కార్యక్రమంలో హుకుంపేట వెటర్నరీ డాక్టర్ కె.చరణ్, సచివాలయ వెటర్నరీ అసిసెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు.










