Sep 22,2023 19:32

దాణాను పంపిణీ చేస్తున్న జూటూరు మారయ్య, సర్పంచి గోవిందరాజులు

ప్రజాశక్తి - చిప్పగిరి
పశువులకు ఉపయోగపడే దాణాను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని వైసిపి మండల యువ నాయకులు జూటూరు మారయ్య, సర్పంచి దాసరి గోవిందరాజులు సూచించారు. శుక్రవారం చిప్పగిరిలోని పశు వైద్యశాలలో పశు వైద్యులు ప్రసన్న బారు, మహేష్‌ ఆధ్వర్యంలో టిఎంఆర్‌ పథకం కింద మంజూరయిన దాణా సంచులను రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రభుత్వం పశుసంపద కోసం దాణాను రాయితీ కింద ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. ఒక రైతుకు 1800 కిలోల వరకు తీసుకోవచ్చన్నారు. 200 కిలోలకు అసలు ధర రూ.3160 ఉంటుందని, దీనిలో 60 శాతం రాయతీ పోను రైతులకు కేవలం రూ.1300కు అందజేస్తోందని చెప్పారు. మండలంలో పశుసంపద ఉన్న రైతులందరూ ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకొని, పశుసంపదకు, పాలు ఎక్కువగా రాబట్టేందుకు ఉపయోగించుకోవాలని రైతులను కోరారు. ఎంపిడిఒ కొండయ్య, పంచాయతీ కార్యదర్శి బాలన్న, పశు వైద్యశాల సిబ్బంది నీలకంఠ, నారాయణ, డీలర్‌ రామయ్య, నాని, రైతులు పాల్గొన్నారు.