May 02,2023 01:08

పసుపు కళ్లాన్ని పరిశీలిస్తున్న రైతుసంఘం నాయకులు

ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్‌ : అకాల వర్షాలకు పంటలు తడిసి నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని రైతుసంఘం జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకరరావు కోరారు. ఈ మేరకు ఎంటిఎంసి పరిధిలోని కుంచనపల్లిలో తడిసిన పసుపు కళ్లాలను రైతు సంఘం నాయకులు సోమవారం పరిశీలించారు. శివశంకరరావు మాట్లాడుతూ గత డిసెంబర్‌లో అకాల వర్షాలకు వివిధ పంటలతో పాటు పసుపు పంట కూడా దెబ్బతిందని గుర్తు చేశారు. సరైన ధరల్లేక పసుపు రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారని చెప్పారు. మార్చిలో, గత మూడ్రోజులుగానూ కురుస్తున్న వర్షాలకు వండి, ఆరబోసిన పసుపు తడిసిందని చెప్పారు. దీంతో ఇప్పటికే ఉన్న ధరకు రూ.వెయ్యి తగ్గించి అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొందని అన్నారు. క్వింటాళ్‌కు రూ.6,800 మద్దతు ధరను ప్రకటించిన ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని, దీంతో ప్రస్తుతం రూ.4,800-5200 మాత్రమే మార్కెట్‌లో దక్కుతోందని తెలిపారు. ఇప్పుడు వర్షంతో రంగుమారిందనే నెపంతో వ్యాపారులు రూ.వెయ్యి దగ్గిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని, క్వింటాళ్‌ రూ.10 వేలకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. జొన్న, మొక్కజొన్న పంటలకు కూడా సరైన ధరల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం సత్వరమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. పరిశీలనలో రైతుసంఘం మండల అధ్యక్షులు ఎం.శ్రీనివాసరెడ్డి, నాయకులు డి.వెంకటరెడ్డి, కె.శివన్నారాయణ, రైతులు డి.శ్రీనివాసరెడ్డి, ఎం.శ్రావణ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.