May 04,2023 00:09

సదస్సులో మాట్లాడుతున్న కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: రాష్ట్రంలో పసుపు పంటకు మద్దతు ధర లభించక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం క్వింటాళ్‌ రూ.10 వేలకు కొనుగోలు చేయాలని కౌలురైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు డిమాండ్‌ చేశారు. రైతు సంఘం, కౌలురైతు సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రమైన దుగ్గిరాలలో పసుపు రైతుల రాష్ట్ర సదస్సు బుధవారం నిర్వహించారు. సదస్సుకు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జొన్నా శివశంకర్‌ అధ్యక్షత వహించారు. హరిబాబు మాట్లాడుతూ పసుపు సాగు వల్ల కేంద్ర ప్రభుత్వానికి రూ.1700 కోట్ల విదేశీ మారకద్రవ్యం వస్తుండగా రైతుల సంక్షేమానికి మాత్రం 1700 పైసలు కూడా అందడం లేదన్నారు. రాష్ట్రప్రభుత్వం రైతుభరోసా కింద రూ.13,500 ఇచ్చి చేతులు దులుపుకొంటోందని, రైతులకు ఏ సమస్య వచ్చినా పట్టించుకోవడం లేదని విమర్శించారు. పసుపు రైతులకు ఎకరాకు రూ.2 లక్షలు ఖర్చయితే ఆదాయం రూ.లక్ష కూడా రావడం లేదన్నారు. విత్తనం సరఫరా నుంచి పంట కొనుగోలు వరకు అన్ని ఆర్‌బికేలే చూస్తాయన్న ప్రభుత్వం ఎన్ని ఆర్‌బికేల్లో పసుపు కొనుగోలు చేసిందో చెప్పాలన్నారు. కేరళలో అన్నిరకాల పంటలకు కేంద్రం మద్దతు ధరకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కొంత బోనస్‌ ఇచ్చి కొనుగోలు చేస్తోందని తెలిపారు. మద్దతు ధరలు, సౌకర్యాల కోసం రైతులు సంఘటితంగా పోరాడాలన్నారు. రైతులను నిర్వీర్యం చేసి సాగుపై విసుగుపుట్టించి కార్పొరేట్లకు భూములు కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఇదే రీతిలో కృష్ణా జిల్లా నందివాడ మండలంలో ఐదువేల ఎకరాలను జెవిఎస్‌కంపెనీ తీసుకుని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిందన్నారు. రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.సూర్యనారాయణ మాట్లాడుతూ పంటల కొనుగోలుకు ప్రభుత్వరంగ సంస్థలను కేంద్రప్రభుత్వం క్రమంగా దూరం చేస్తుందన్నారు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌ వ్యవస్థలను నిర్వీర్యం చేయడం ద్వారా రైతులకు సాగుపై విసుగు పుట్టించేలా పాలకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. సహకార రంగంలో కూడా 50 శాతం ప్రైవేటుపెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా ప్రభుత్వ రంగంలో కూడా సహకార సంఘాన్ని దెబ్బతీస్తున్నారని వివరించారు. తమ హక్కులకోసం ప్రభుత్వ ఉద్యోగులు, స్కీమ్‌ వర్కర్లు, ఇతర తరగతుల వారు ఎలా పోరాడుతున్నారో రైతులు కూడా సంఘటితంగా పోరాటడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఇందుకు ఢిల్లీ సరిహద్దులో 13 నెలలపాటు జరిగిన రైతాంగ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. సదస్సులో వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, రైతు నాయకులు డి.వెంకటరెడ్డి, వి.వెంకటరామయ్య, వి.సాంబశివరావు, జె.బాలరాజు, నాగమల్లేశ్వరరావు, వై.బ్రహ్మేశ్వరరావు, బి.అమ్మిరెడ్డి, సిహెచ్‌ పోతురాజు పాల్గొన్నారు.