ప్రజాశక్తి - తాడేపల్లి రూరల్ : పసుపు పంటను మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పసుపు రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకరరావు డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఎంటిఎంసి పరిధిలోని ప్రాతూరు, చిర్రావూరు, కుంచనపల్లి, వడ్డేశ్వరం గ్రామాల్లో సోమవారం వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా శివశంకరరావు మాట్లాడుతూ గతేడాది డిసెంబర్‌లో అకాల వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గిందని, ఈ ఏడాది మార్చి, మే నెలల్లో అకాల వర్షాలకు పంట కళ్లాల్లోనే తడిసిందని చెప్పారు. దీంతో పంట పూర్తిగా రంగు మారి ఎర్రబారడం వల్ల వ్యాపారులు క్వింటాళ్‌కు రూ.3200 - 4000కు మించి కొనడం లేదని, నాణ్యమైన పంటకు మరో రూ.వెయ్యికి మించి ధర ఇవ్వడం లేదని తెలిపారు. ఒకవైపున కౌలు, పెట్టుబడి ఖర్చులు భారీగా పెరిగి ఎకరా సాగుకు రూ.1.70 లక్షలు ఖర్చవుతుంటే దిగుబడి 20-25 క్వింటాళ్లకు మించడం లేదని, ఎకరాకు రూ.75 వేల చొప్పున రైతులు నష్టపోతున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి క్వింటాళ్ రూ.6850 మద్దతు ధరకు కొనాలని, మద్దతు ధరను రూ.10 వేలకు పెంచాలని కోరారు. వినతిపత్రాలు ఇచ్చిన వారిలో డి.వెంకటరెడ్డి, బి.సంసోను, డి.రాజేంద్రబాబు, డి.సురేష్, ఎస్.వెంకటేశ్వరరావు, కె.వెంకటేశ్వరరావు, ఎ.రంగారావు, కె.పాలు, బి.సుదర్శనరావు, కె.ఆనందరావు, బి.గోపాలరావు, ని,సుబ్బారావు, పి.శివనాగేశ్వరరావు, బి.మోహనరావు, జి.వెంకటేశ్వరరావు, ఎం.శ్రీనివాసరెడ్డి, కె.ఈశ్వర్‌రెడ్డి, ప్రసాద్, వి.పున్నయ్య ఉన్నారు.










