ప్రజాశక్తి-భట్టిప్రోలు: పసుపు సాగు చేసిన రైతులు కనీస గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారని, ప్రభుత్వం ప్రకటించిన విధంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని ఎపి రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి జొన్నా శివ శంకరరావు డిమాండ్ చేశారు. శనివారం కొల్లూరు, భట్టిప్రోలు మండలాల్లోని పోతార్లంక, తిప్పాలకట్ట, జువ్వలపాలెం తదితర లంక గ్రామాలలో ఆయన పర్యటించారు. ఇప్పటికే కురిసిన వర్షాలకు పసుపు తడిసి రంగు మారి రైతన్న ఆందోళన చెందుతుండగా పసుపు క్వింటా 4,800 నుంచి 5,200 మించి కొనకపోవటం వలన తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 2021లో ప్రభుత్వం పసుపుకు 6,850 మద్దతు ధరను ప్రకటించిందని, దానికనుగుణంగా పసుపు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి గాను మే నెల 3వ తేదీన దుగ్గిరాల పసుపు యార్డ్ సమీపంలోని పసుపు వర్తక సంఘం భవనం, బోస్ సెంటర్లో పసుపుకు 10 వేలు డిమాండ్‌తో జరిగే రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కోరారు. రైతు సంఘం గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు ములకా సాంబిరెడ్డి మాట్లాడారు. రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామ య్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు బి సుబ్బారావు, కౌలు రైతు సంఘం జిల్లా నాయకులు టి సురేష్, సిఐటియు భట్టిప్రోలు కార్యదర్శి జి సుధాకర్, నాయకులు బిఎల్‌కె ప్రసాద్ తదితరులు ఉన్నారు.










