Apr 24,2023 23:13

సబ్‌కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చి సమస్యను వివరిస్తున్న రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి - తెనాలి : పసుపు, జొన్న, మొక్కజొన్న పంటలను ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములక శివసాంబిరెడ్డి కోరారు. ఈ మేరకు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మకు రైతు సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సాంబిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించినా ఆ మేరకు పంట కొనుగోలు చేయడం లేదని అన్నారు. 2021లో పసుపు క్వింటాళ్‌కు రూ.6850 మద్దతు ధరగా ప్రభుత్వం ప్రకటించినా రైతుల నుంచి దళాలరులు కేవలం రూ.4000-4,500కు మించి కొనడం లేదన్నారు. జొన్న, మొక్కజొన్న విక్రయాల్లోనూ రైతులు ఇదేవిధంగా నష్టపోతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో పంటలను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తెనాలి-రేపల్లె రైలుమార్గంలో చినరావూరు-జంపని మధ్యగల లెవెల్‌ క్రాసింగ్‌ మూసివేతతో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఆ గేటును తక్షణమే తెరిపించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో రైతు సంఘం నాయకులు ఎం.సాంబశివరావు,టి.వెంకటేశ్వర్లు, షేక్‌ హుస్సేన్‌ వలి, పి.జోనేష్‌ పాల్గొన్నారు.