Aug 01,2023 21:18

పసుపు ధరలకు రెక్కలు

పసుపు ధరకు రెక్కలొచ్చాయి. ధర రోజు రోజుకు పెరుగుతుండడంతో రైతులు, వ్యాపారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. మూడు సంవత్సరాలుగా మార్కెట్‌లో పసుపుకు ధర లేదు. ప్రస్తుతం మంచి ధర లభిస్తోంది. పసుపు కొనుగోలు ప్రారంభంలో రూ.4600లు వుండేది. శుక్రవారం నుంచి బహిరంగ మార్కెట్‌లో క్వింటా ఫింగర్‌ పసుపు ధర రూ.10,025లు పలికింది.. ముందుగా తక్కువ ధరలతో విక్రయించుకున్న తర్వాత ప్రస్తుతం ధరలు పెరిగాయని రైతులు, రైతు సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ప్రజాశక్తి-కడప ప్రతినిధి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2022-23 ఏడాదిలో పోరుమామిళ్ల, సిద్దవటం, ఖాజీపేట, మైదుకూరు, పెండ్లిమర్రి, జమ్మలమడుగు, దువ్వూరు, ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరు, రైల్వేకోడూరు, ఓబులవారిపల్లెతో పాటు పలు మండలాల పరిధిలో 4,122 మంది రైతులు 4783.500 ఎకరాల్లో పసుపు సాగు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం పసుపుకు రూ.6,850లు మద్దతు ధర కల్పించింది. రైతులు పండించిన పసుపును మార్కెఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసేందుకు జిల్లాలో ఆరు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జూన్‌ 2వ తేదీ నుండి పసుపు కొనుళ్లను ప్రారంభించింది. పసుపు కొనుగోలు ప్రారంభంలో పసుపు క్వింటాలు రూ.4వేల నుంచి రూ.4,600లు ఉండేది. అనంతరం ధర రాను రాను పెరుగుతూ వచ్చింది. చాలా మంది రైతులు విక్రయించుకోగా, మరి కొంత మంది ఇళ్లల్లో స్టాక్‌ ఉంచుకున్నారు. ప్రారంభంలో పసుపు ధరలు తక్కువగా వుండడంతో ప్రభుత్వం రూ.6,850లు ప్రకటించడంతో రైతులు వ్యాపారులకు పసుపును అమ్మేందుకు ఆసక్తి చూపలేదు. వ్యాపారులు కూడా రేటు పెంచాల్సి పరిస్థితి నెలకొంది.
క్వింటా రూ.1025
ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బుధవారం క్వింటాలు ఫింగర్‌ పసుపు ధర రూ.10,025లు కాగా, బల్బ్‌ పసుపు (ఉంట కొమ్ము) రూ.10 వేలులు పలికింది. బహిరంగ మార్కెట్‌లో పసుపు తక్కువగా వస్తుండడంతో పసుపు రేటుకు డిమాండ్‌ పెరిగింది. ఈ నెల 12వ తేదీ నుండి పసుపు ధరలుపెరుగుతూ వచ్చాయి. ఈ నెల 12వ తేదీన క్వింటా ఫింగర్‌ పసుపు ధర రూ.7వేలు పలి కింది. పసుపు రేట్లు ఈ నెల 12 నుండి పెరుగుతూ వచ్చి ప్రస్తుతం ఫింగర్‌ పసుపు క్వింటాలు రూ.10,025లుకు చేరుకొంది. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మార్కెటింగ్‌ మాయే
రైతులు పసుపు పంటను విక్రయించుకున్న తర్వాత రేట్లు పెరగడం మార్కెటింగ్‌ మాయే. పసుపు కొనుగోలు మొదట్లో క్వింటాలు రూ.4,600 ఉండేది. పంటను విక్రయించుకున్న తర్వాత రేట్లు పెరగడం వల్ల రైతులకు ప్రయోజనం ఉండదు. స్టాక్‌ ఉంచుకుని విక్రయించు కుంటున్న రైతులకు లాభదాయకం.
- దస్తగిరిరెడ్డి, జిల్లా కార్యదర్శి, ఎపి రైతు సంఘం. కడప.