Apr 28,2023 00:32

మాట్లాడుతున్న జేసీ శ్రీధర్‌

పజాశక్తి - బాపట్ల జిల్లా : పశుపోషకుల ఆర్థికాభివద్ధికి తోడ్పాటునందించే బాధ్యత పశు వైద్యాధికారులపై ఉందని జిల్లా సంయుక్త కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ చెప్పారు. స్థానిక జిల్లా పశువైద్యశాఖ కార్యాలయంలో ప్రపంచ పశువైద్య దినోత్సవం గురువారం నిర్వహించారు. తొలుత జ్యోతి వెలిగించి ప్రపంచ పశువైద్య దినోత్సవాన్ని ప్రారంభించారు. అనంతరం పశువైద్య అధికారులు, సిబ్బంది రెడ్‌ క్రాస్‌ సహకారంతో రక్తదానం చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు, పంపిణీ చేస్తున్న పరికరాలు, యంత్రాలు, వైద్యసేవలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ప్రదర్శనను జేసీ ప్రారంభించారు. దీర్ఘకాలం పశువైద్యశాఖలో సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన విశ్రాంత పశు సంవర్థక శాఖ అధికారులు డాక్టర్‌ వెంకట పున్నయ్య, వెంకటేశ్వర్లు, డాక్టర్‌ ఠాగూర్‌కు శాలువలు కప్పి పుష్పమాలలు, జ్ఞాపికలతో సత్కరించారు. వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన వివిధ క్రీడల్లో గెలుపొందిన వైద్య అధికారులు, సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు బహుమతులు అందజేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశువైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిందన్నారు. సంచార శాలలతో పశు పోషకులు ఇంటివద్దకు వెళ్లి వైద్యసేవలు అందించడం అభినందనీయమన్నారు. బాపట్ల జిల్లాలో పశువైద్య సేవలందించడంలో నూరు శాతం లక్ష్యాన్ని 200 శాతానికి చేరుకోవడం సంతోషదాయకమన్నారు. పశు సంపద అభివద్ధికి నూతన శాస్త్ర సాంకేతిక విధానాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టిందని జిల్లా పశుసంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్‌ ఎమ్‌. హనుమంతరావు తెలిపారు. పశుదాణ భద్రతా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా డీడీ రమేష్‌ బాబు, తెనాలి డీడీ కేదారేశ్వరరావు, ఇఒడిఎల్‌డిఒ కాలేషా, పశువైద్య శాఖ ఏడీలు, అసిస్టెంట్‌ సివిల్‌ సర్జన్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.