
కాళ్లలో అపరిశుభ్రత, జువ్వలపాలెంలో పోస్టు ఖాళీ
ఇబ్బందుల్లో పశు పోషకులు
ప్రజాశక్తి - కాళ్ల
వ్యవసాయం గిట్టుబాటు కాని రైతులు దాని అనుబంధ రంగమైన పాడి పరిశ్రమను నమ్ముకొని పశుపోషకులు జీవిస్తున్నారు. పశువులు వ్యాధుల బారిన పడినప్పుడు పశువైద్యశాలల్లో పశువైద్యాధికారి, సిబ్బంది అందుబాటులో లేక పశుపోషకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాళ్ల, జువ్వలపాలెం పశువైద్య కేంద్రాల్లో పశువులకు వైద్య సేవలు అందడం లేదు. పశువైద్యాధికారి, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా సేవలను అందించలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
కాళ్ల పశువైద్య కేంద్రం ఆవరణలో అపరిశుభ్రత నెలకొంది. జువ్వలపాలెం పశువైద్య కేంద్రంలో ప్రతిరోజు వైద్య సేవలు నిర్వహించడం లేదు. ఈ నెల ఏడో తేదీన కేంద్రం మూసివేసి ఉంది. జువ్వలపాలెం గ్రామంలో గ్రామీణ పశువైద్యశాల ఉంది. జువ్వలపాలెం, ఏలూరుపాడు గ్రామాల్లోని పశుపోషకులు పశు వైద్యం కోసం ఈ వైద్యశాలనే ఆశ్రయిస్తుంటారు. కరోనా సమయంలో పశువైద్యాధికారి అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి ఇన్‌ఛార్జి పశు వైద్యాధికారితో కొనసాగిస్తుఆ్నరు. పూర్తి స్థాయి పశువైద్యాధికారిని నియమించకపోవడంతో వైద్యశాలను నిత్యం తెరవడం లేదు. పేరుకు మాత్రం డాక్టర్ పోస్టు ఉన్నప్పటికీ కాళ్ల డాక్టర్‌ను డిప్యూటేషన్‌గా నియమించారు.
అపరిశుభ్రత
కాళ్ల పశువైద్య కేంద్రం ఆవరణలో అపరిశుభ్రత నెలకొంది. ఈ పశువైద్య కేంద్రంలో పశువులకు వైద్య సేవలు సత్వరమే అందకపోవడంతో విలువైన పశువులు వ్యాధుల నుంచి కోలుకోవడం లేదు. ఇప్పటికైనా పాలకులు స్పందించి జువ్వలపాలెంలో పూర్తిస్థాయి పశువైద్యాధికారిని నియమించి మూగ జీవాలకు రక్షణతో పాటు తమ సంక్షేమానికి పాటుపడాలని పశు పోషకులు కోరుతున్నారు.
పశు పోషకుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలి
సరైన పశువైద్య సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో విలువైన మూగ జీవాలకు వైద్యం అందడంలేదు. దీంతో అవి మృత్యువాత పడుతున్నాయి. పశు పోషకులకు ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ప్రభుత్వం సత్వరమే మృతి చెందిన జీవాలకు నష్టపరిహారం అందించి పశు పోషకుల సంక్షేమానికి కృషి చేయాలి.
రెగ్యులర్ డాక్టర్‌ను నియమించాలి
జువ్వలపాలెం గ్రామంలో ఉన్న పశువైద్యశాలకు పూర్తిస్థాయి డాక్టర్‌ను నియమించాలి. డాక్టర్ లేక పోషకులు ఇబ్బంది పడు తున్నారు. పశువులకు వ్యాధులు వస్తే ఆకివీడు వైద్యశాలకు వ్యయప్రయాసలకోర్చి తీసుకెళ్లాల్సి వస్తుంది. డాక్టర్ పోస్టును భర్తీ చేసి పశువైద్యశాలల్లో పశువులకు నిత్యం వైద్యం అందించాలని రైతులు కోరుతున్నారు.
సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను
భార్గవి, కాళ్ల పశువైద్య ఇన్‌ఛార్జి అధికారి
కాళ్ల, జువ్వలపాలెం గ్రామాల్లో ఉన్న పశువైద్య కేంద్రాల్లో ఇన్‌ఛార్జి పశువైద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నాను. సిద్దాపురం పశువైద్య కేంద్రంలో రెగ్యులర్, ఐ భీమవరం ఇన్‌ఛార్జి డాక్టర్‌గా పని చేస్తున్నాను. ఈ నెల నాలుగో తేదీ నుంచి తొమ్మిదో తేదీ వరకు కాళ్ల డాక్టర్ చంద్రబాబు సెలవు పెట్టడంతో ఇన్‌ఛార్జి బాధ్యతలు నిర్వహించాను. వైద్య సిబ్బంది విధులకు హాజరు రాలేదు. కాళ్ల పశు వైద్య కేంద్రంలో అపరిశుభ్ర పరిస్థితిని, జువ్వలపాలెం పశువైద్యకేంద్రాన్ని తెరవని పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను.