Jun 03,2023 00:06
జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి బేబిరాణికి వినతి అందిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఒంగోలు కలెక్టరేట్‌: పశు బీమా పథకంలో ఇన్సూరెన్స్‌ కంపెనీ కాకుండా ప్రభుత్వమే పరిహా రం చెల్లించే బాధ్యత తీసుకోవాలని ఎపి గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి కిలారి పెద్దబ్బాయి డిమాండ్‌ చేశారు. స్థానిక ఎల్‌బిజి భవన్‌లో ఎపి గొర్రెలు, మేకల పెంపకందార్ల సంఘం జిల్లా కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కిలారి పెద్దబ్బాయి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చి నాలుగేళ్ళు అవుతున్నా గొర్రెల కాపర్లకు చేసిందేమీ లేదని అన్నారు. ఉన్న పథకాలను ఎత్తివేసి గొర్రెల కాపర్ల ను తీవ్రంగా నష్టపరుస్తుందని దుయ్యబట్టారు. వైఎస్‌ఆర్‌ పశు నష్ట పరిహార పథకం రద్దు చేయటం, దాని స్థానంలో పశు బీమా పథకాన్ని తేవటం ద్వారా ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకొని న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీకి అప్పగించటం సరైంది కాదని అన్నారు. గతంలో ఈ కంపెనీ అనేక సాంకేతిక కారణాలతో క్లెయిమ్స్‌ పరిష్కరించక రైతులను ఇబ్బందులకు గురి చేసిందన్నారు. ఈ పథకం నుంచి న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీని తప్పించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా కార్యదర్శి తోట తిరుమలరావు మాట్లాడుతూ బీమా పథకంలో గొర్రె ఖరీదు 6 వేలుగా నిర్ణయించారని, రూ.10 వేలకు పెంచాలన్నారు. నట్టల నివారణ మందులు పంపిణీ వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత సంవత్సరానికి ఒక్కసారే ఇస్తున్నారని, 3 సార్లు ఇవ్వాలని అన్నారు. పశు నష్టపరిహారం పెండింగ్‌ నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. అనంతరం సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వినతిపత్రాన్ని జిల్లా పశు సంవర్ధక అధికారి బేబీరాణికి అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కె జయరాం, కిలారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.