ప్రజాశక్తి-చిన్నగంజాం: పాడి రైతులకు పశుబీమా పథకం భరోసా కల్పిస్తున్నదని, పశుపోషకులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి ముద్దు హనుమంతరావు అన్నారు. మండలంలోని చింతగుంపల్లిలో గురువారం పశు సంవర్థక శాఖ, రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 110 పశువులకు సాధారణ చికిత్సలు, గర్భకోశ వ్యాధులు, నట్టల నివారణకు సంబంధించిన వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి హనుమంతరావు పశుగ్రాస విత్తనాలు, మేలైన పశుయాజమాన్యం, దూడల పెంపకం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్స్ సజ్జ చిట్టిబాబు, టి శివారెడ్డి, బి కిరణ్ కుమార్, రిలయన్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ పి రత్నకుమార్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










