May 13,2022 06:51

'ఒక విద్యార్థికి విమర్శనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడమే విద్య యొక్క ముఖ్యమైన అంశం. గీతను బోధించడం వలన అది గ్రంథం లోని పద్యాలను కంఠస్థం చేయడానికి మాత్రమే పరిమితం చేస్తుంది. ఆ విధంగా వల్లెవేసి నేర్చుకునే పద్ధతి చర్చను నిరుత్సాహ పరచడమేకాక, హేతువాద దృక్పథాన్ని పక్కదారి పట్టిస్తుంది'.

  రవ తరగతి నుండి పదవ తరగతి వరకు భగవద్గీతను తప్పనిసరి బోధనాంశంగా స్టేట్‌ బోర్డు పాఠశాలల్లో ప్రవేశ పెట్టేందుకు గుజరాత్‌ లోని బిజెపి ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. తమ రాష్ట్రంలో కూడా భాగవతంలోని 700 పద్యాలను పాఠ్యాంశంగా ప్రవేశపెట్టే విషయాన్ని పరిశీలిస్తామని కర్ణాటక లోని బిజెపి ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి మొదటి వారంలో తమ ప్రాథమిక పాఠశాలల్లోనూ భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా ప్రవేశ పెడతామని మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఢిల్లీ ప్రకటించింది.
     ఈ ధోరణి పట్ల లౌకికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తూ... ఈ చర్య వెనుక ఎజెండా కుట్ర పూరితమైనదిగా ప్రమాదకరమైనదిగా అభివర్ణించారు. గుజరాత్‌లో చేసిన నిర్ణయాన్ని కాంగ్రెస్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆమోదించినట్లు తెలిసి వారు మరింత ఆందోళనకు గురయ్యారు. గుజరాత్‌ విద్యాశాఖ మంత్రి జితు వాఘాని ఈ చర్యను సమర్థిస్తూ, భగవద్గీత విలువలను, సూత్రాలను దాని ప్రాధాన్యతలను అన్ని మతాల వారు అంగీకరించారని తెలిపారు. విద్యార్థులలో ఆసక్తిని పెంచే విధంగా గీతను ఆరవ తరగతిలో ప్రవేశ పెడతామనీ, పిల్లలకు భగవద్గీత ప్రాముఖ్యతను, ప్రాథమిక దశలో బోధించి, వారి ఆసక్తిని సజీవంగా ఉంచడానికి శ్లోకాల రూపంలో కథలను ప్రవేశ పెట్టాలని, శ్లోకాలతోపాటు, పాటలు, వ్యాసాలు, నాటికలు, క్విజ్‌ లాంటి కార్యక్రమాలు రూపొందిస్తామని... అదే విధంగా తొమ్మిదవ తరగతి నుండి ఈ గ్రంథాన్ని అధునాతన స్థాయిలో బోధిస్తామని అసెంబ్లీకి తెలియజేశారు.
     జులై 2020లో విడుదల చేయబడిన నూతన విద్యా విధాన లక్ష్యాల ప్రకారమే ఈ ప్రణాళికను రూపొందించామని కూడా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి తెలిపారు. ఈ విధానం ద్వారా గర్వించదగ్గ సాంప్రదాయాలను చిన్నారులకు నేర్పే ఉద్దేశ్యంతోనే నూతన విద్యా సంవత్సరంలో (జూన్‌ 2022) ఈ గ్రంథాన్ని ప్రవేశపెట్టే ప్రణాళికను రూపొందించామని గుజరాత్‌ ప్రభుత్వం అధికారిక సర్క్యులర్‌ తెలియజేస్తున్నది.
    భగవద్గీతను నేరుగా అనువదించిన ప్రకారం 'దేవుని గీత'మని అర్థం. ఇది హిందూ గ్రంథాలలో పవిత్రమైనదిగా భావించబడుతూ భాగవతంలోని ఆరవ భాగంలో 23-40 అధ్యాయాలలో వివరించబడింది. ఈ వర్ణన ముఖ్యంగా యుద్ధవీరుడైన అర్జునుని చుట్టూ పరిభ్రమిస్తుంది. యుద్ధ భూమిలో ఎదురుగా కనిపిస్తున్న తన సోదరులను (దాయాదులను) చూసి అతను పడిన సంఘర్షణను గురించి వర్ణిస్తుంది. ఈ నేపథ్యంలో తెర వెనుక శ్రీకృష్ణుని దేవతల అవతారంగా లోక నీతిని అర్జునునికి తెలియజేయడానికి ఉపయోగించుకున్నారు. శ్రీకృష్ణునికి, అర్జునికి మధ్య జరిగిన సంభాషణ, జీవిత గమనాన్ని గూర్చి ప్రభోదిస్తుంది.
మొహాలీలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ మరియు రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఇఆర్‌) సంస్థలలో మానవీయ శాస్త్రాలను, సామాజిక శాస్త్రాలను బోధించిన విశ్రాంత తత్వశాస్త్ర ప్రొఫెసర్‌ యస్‌.కె అరుణ్‌ మూర్తి పాఠశాల సిలబసులో గీతను ప్రవేశ పెట్టాలనే ఆలోచన గురించి విస్తృతంగా రాశారు. 'ఒక విద్యార్థికి విమర్శనాత్మక, విశ్లేషణాత్మక ఆలోచనలను అభివృద్ధి చేయడమే విద్య యొక్క ముఖ్యమైన అంశం. గీతను బోధించడం వలన అది గ్రంథం లోని పద్యాలను కంఠస్థం చేయడానికి మాత్రమే పరిమితం చేస్తుంది. ఆ విధంగా వల్లెవేసి నేర్చుకునే పద్ధతి చర్చను నిరుత్సాహ పరచడమేకాక, హేతువాద దృక్పథాన్ని పక్కదారి పట్టిస్తుంది' అంటారు. దీనిపై ప్రొఫెసర్‌ అరుణ్‌ మూర్తి మరింత లోతుగా వివరించారు. కృష్ణునికి, అర్జునునికి మధ్య జరిగిన సంభాషణ క్రమంలో గీత అనేకమైన పిడివాద సిద్ధాంతాలను చెప్తుంది. (భగవంతుని చేత చెప్పబడినదిగా) అది ఒక పిడివాద సిద్ధాంతాన్ని, మరొక పిడివాద సిద్ధాంతం ద్వారా సమర్థిస్తుంది. అందుకే బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ ఉద్దేశపూర్వకంగానే వాటిలో మూడు అంశాలపై వివరణ ఇస్తాడు. దానిలో మొదటిది యుద్ధాన్ని సమర్థించడం, రెండవది చాతుర్వర్ణమని చెప్పబడే నాలుగంచెల కుల వ్యవస్థను సమర్థించడం, మూడవది కర్మ లేదా క్రియ. ఇదే ప్రముఖంగా కర్మయోగాగా ప్రసిద్ధి చెందింది.
ఫ్రొఫెసర్‌ అరుణ్‌ మూర్తి ఉద్దేశంలో ఈ పిడివాదాలన్నీ పద్య రూపంలో ప్రవేశ పెట్టబడతాయి. అనేక మంది వీటిని విశదీకరిస్తూ అతిశయోక్తులతో, కపటంతో కూడిన పాండిత్యంతో, ఉపన్యాస ధోరణులతో, గీత వ్యాఖ్యానంగా, వివరణలతో, వ్యాఖ్యానాలతో హింసను, కులాన్ని సమర్థిస్తారని చెప్పారు.
కర్మ సిద్ధాంతాన్ని ఉపయోగించి కుల వ్యవస్థను సమర్థిస్తారు. ఉదాహరణకు, అర్జునునికి ఆయుధాలు చేపట్టమని, క్షత్రియునిగా అది అతని కర్తవ్యమని ఉద్బోధించారు. ఒక వ్యక్తి సహజసిద్ధమైన స్వభావాన్ని, గుణాలను, అతని చర్యలను బట్టి కుల భావనను, భిన్న రీతులలో మెలితిప్పి సమర్థించారు. భగవంతుని వాక్యమని చెప్పబడే ఈ గ్రంథాన్ని చర్చ లేకుండా తప్పుగా అర్థం చేసుకున్నట్లయితే అది భవిష్యత్తులో హింసను, కుల వ్యవస్థను శాశ్వతంగా నిలిపి ఉంచడానికి దోహదం చేస్తుంది.
    విద్యకు సంబంధించిన అంశంపై ప్రొఫెసర్‌ మూర్తి మాట్లాడుతూ... హిందూ సంప్రదాయంలో గీత లాంటి గ్రంథాలు జ్ఞానానికి మూలాలుగా పరిగణింపబడతాయి. అవి ప్రశ్నించడానికి వీలు లేని విధంగా ఉంటాయి. అందువల్ల అవసరమైన కనీస చర్చకు గానీ, విశ్లేషణకుగానీ తావుండదు. గీత మత గ్రంథం కాదని, సార్వజనీన స్థాయిగల గ్రంథమని కొందరు వాదించవచ్చు. కానీ, గీత భగవంతుని గూర్చి, ప్రపంచాన్ని గూర్చి, వ్యక్తిగతమైన సంబంధాలకు అతీతమైన విషయాలను గురించి స్పష్టంగా చెపుతూ ఒక మత గ్రంథంగా నిర్దిష్ట అధికారాన్ని చలాయిస్తుంది. అది ఒక చట్టబద్ధమైన మత గ్రంథంగా రూపొందుతుందని చెప్తారు.
     కాబట్టి, లౌకిక విద్యను కోరుకుంటున్న వాడిగా... అదీగాక దేవుడు వంటి భావనతో, వ్యక్తిగత, ప్రపంచాన్ని గూర్చి విమర్శనాత్మక భాగస్వామ్యంతో, హేతుబద్ధమైన చర్చకుగానీ, విశ్లేషించడానికి గానీ వీలులేనప్పుడు మతపరమైన గ్రంథాన్ని నేనెందుకు చదవాలని ప్రొఫెసర్‌ మూర్తి ప్రశ్నిస్తారు.
     అహమ్మదాబాదులో విద్యా బోధన చేస్తున్న జసూట్‌ మానవ హక్కుల కార్యకర్త ఫాదర్‌ సెడ్రిక్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ...మత గ్రంథాల నుండి పాఠాలు నేర్చుకునే అభిలాష వున్నట్టయితే, ప్రభుత్వం గీత దగ్గరే ఆగిపోకూడదు. అది ప్రపంచ మతానికి సంబంధించిన కోర్సును ప్రవేశ పెట్టాల్సి ఉంటుంది. అన్ని మత విశ్వాసాలలో ఉన్న మంచిని గురించి బోధించాలని అభిప్రాయపడ్డారు. బైబిల్‌, ఖురాన్‌, గురు గ్రంథ్‌ సాహిబ్‌, అవెష్టా (జురాష్ట్రియన్ల పవిత్ర గ్రంథం) నుండి కూడా బోధించాలన్నారు. భారత దేశ బహుళత్వానికి దేశ లౌకికతత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలన్నారు. ఒకవేళ వారు సమగ్రమైన విద్యను సమకూర్చాలని భావిస్తే నైతిక విలువలతో కూడిన విద్యను, రాజ్యాంగానికి సంబంధించిన విద్యను సమకూర్చవచ్చని చెప్పారు.
     ఏ ఫాసిస్టు అయినా మొదట చేసే పని విద్యా విధానంలోకి చొరబడడమేనని...2002 నుండి గుజరాత్‌లో మతపరమైన ఘర్షణలను, విభజన రాజకీయాలను గమనిస్తున్న సెడ్రిక్‌ ప్రకాష్‌ చెప్తారు. హిందూ నమ్మకాలకు తాము ప్రాముఖ్యతనిస్తున్నామని హిందువులకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే వారు భగవద్గీతను ప్రత్యేకంగా ఎంచుకున్నారు. ప్రజలను విభజించే క్రమాన్ని, కేంద్రీకరణను కొనసాగించడానికి మోసపూరితమైన ఉపాయంతో కూడిన ఆలోచనగా దీనిని గమనించాలి అంటారాయన! ఫాదర్‌ సెడ్రిక్‌ ప్రకాష్‌ అభిప్రాయాలకు...అహ్మదాబాదులో పనిచేస్తున్న ప్రముఖ ఆర్థికవేత్త ఇందిరా హిర్వే మద్దతునిచ్చారు. భారతదేశం తనను తాను లౌకిక రాజ్యంగా నిర్వచించుకున్నట్లయితే, పవిత్ర గ్రంథాలన్నిట్లో ఉన్న సూత్రాలను బోధించాలని అభిప్రాయపడ్డారు. మతపరమైన విభజన ప్రస్తుతం సమస్యగా వుంది. హిందువులు ఈ ప్రయత్నాలను సమర్థిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. విద్యావంతుల నుండి కూడా వ్యతిరేకత లేకపోవడం మరింత విషాదకరం. ఇది ఒక తప్పుడు ధోరణి. వాస్తవానికి గీతను అనుసరించే, గీతను గౌరవించే తాను ఓ విషయమై భయపడుతున్నానంటున్నారు. వారు బోధించేటప్పుడు హిందూయిజమే ఉన్నతమైన మతమని బోధించినట్లయితే, ప్రస్తుత విభజిత వాతావరణంలో ప్రమాదకరమైనదిగా మారి హాని చేస్తుందని ఆందోళన చెందుతున్నారు. స్పష్టంగా చెప్పాలంటే... వారి ఉద్దేశ్యంలో హిందూ రాష్ట్రాన్ని నిర్మించడమే. ఈ విషయంలో అత్యున్నత విద్యావంతులు కూడా ఆ వైపు మొగ్గు చూపుతున్నారు.
     ఈ ప్రభుత్వాలు భగవద్గీత లోని నీతిని, విలువలను బోధించడం లేదని, సమాజానికి, రాజకీయ సందేశం పంపించడం పైనే అవి ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని ముంబాయిలో పని చేస్తున్న ఇఫ్రాన్‌ ఇంజనీర్‌ అంటున్నారు. ఇది హిందూ సమాజమనే సందేశం ఇస్తారన్నారు. గీతలో కొన్ని విలువైన పాఠ్యాంశాలను తప్పని సరిగా బోధించాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి మైనారిటీ సంస్థలు కూడా ప్రపంచ మతాలను గురించి చెప్పాలని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనా హిందూ ఎజెండా అతి వేగంగా వ్యాపిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఉదాహరణకు, స్కూలు పాఠ్య ప్రణాళికలో ఇంతకు ముందు నుండే హిందువులు ఒక ఆధిపత్య సమాజంగా పేర్కొంటూ ఉపవాచకాలలో నెమ్మదిగా పరోక్షంగా జొప్పించారన్నారు.
     భగవత్గీత, భారతీయ తత్వశాస్త్రంలో ప్రసిద్ధిగాంచిన ఉపాధ్యాయిని నీమా ముజుందార్‌, హేతువాదుల వాదనలను పూర్వపక్షం చేస్తూ, 'ఏ సంస్కృతిలోనైనా మానవాళికి అందించగల మంచి ఉంటుంది. మతపరమైన అంశాన్ని పక్కన పెడితే గీత ప్రపంచానికి ఇవ్వగలిగింది చాలా ఉంది. కాకపోతే దానిని బోధించేవారెవరైనా సక్రమంగా బోధించాలనే దానితో నేను అంగీకరిస్తాన'ని తెలిపారు.
గీతా బోధనలను నేర్చుకునే విషయంలో గ్రంథాన్ని సవ్యంగా బోధించకపోయినా లేదా తప్పుడు ఆలోచనలతో బోధించినా దాని వల్ల మంచి కంటే ఎక్కువ నష్టం జరుగుతుందనేది అధికార యంత్రాంగ సమిష్టి అభిప్రాయంగా కూడా ఉన్నది. ఈ గ్రంథాన్ని పాఠ్యాంశంగా ప్రవేశపెట్టే విషయంలో సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
 

( 'ఫ్రంట్‌లైన్‌' సౌజన్యంతో )