Jan 18,2023 23:13

గ్రామస్తులతో మాట్లాడుతున్న జెడ్‌పిటిసి గంగరాజు

ప్రజాశక్తి -అనంతగిరి:అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి పొర్న పొదుర గ్రామంలో ఐదుగురు పసికందులు మృతి చెందడంతో వైద్య అధికారుల పనితీరు పై సిపిఎం జెడ్‌పిటిసి సభ్యులు గంగరాజు ఆగ్రహ వ్యక్తం చేశారు. సకాలంలో సరైన వైద్య సేవలు అందక పసికందులు ఒకరి తర్వాత ఒకరు మృత్యువాత పడ్డారని, తక్షణమే వీటిని అరికట్టాలని డిమాండ్‌ చేశారు. వరుసగా మృత్యువాత గురవుతున్న ఘటనను తెలుసుకున్న ఆయన బుధవారం పొర్లొపొదర్‌ను సందర్శించారు. మృతి చెందిన పసికందుల తల్లితండ్రులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, పుట్టిన పిల్లలు మూడు నెలలకె మృతి చెందారని, ఉబ్బసం, పాలు తాగకపోవడం, దగ్గు, జలుబులతో నెల రోజులకే ఒకరి తర్వాత ఒకరు ఐదుగురు మృతి చెందారన్నారు. వైద్య అధికారులు పట్టించుకోలేదన్నారు. జడ్పిటిసి గంగరాజు ఈ విషయంపై ఐటీడీఏ పీవో రోణంకి .గోపాలకృష్ణ, జిల్లా వైద్య అధికారులకు అక్కడ నుండే ఫోన్లో జరిగిన ఘటనను వివరించారు. వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న రెండవ వైద్య అధికారిణిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈనెల 17న పొట్టంగి. సుమీల కు జన్మించిన మూడు నెలల పాప, ఈనెల 2న పొట్టంగి. సుబ్బమ్మ జన్మించిన 3 నెలల బాబు మతి చెందారన్నారు. గత గత సంవత్సరం 11వ నెల 23న నిమ్మక భారతికు జన్మించిన 3. నెలల పాప, 10వ నెలలో 18న పొట్టంగి. శాంతి కు జన్మించిన బాబు, 10వ నెల 10న సోమల కళ్యాణకు జన్మించిన 3 నెలల బాబు మృతి చెందారన్నారు.అనంతగిరి పంచాయతీ లక్ష్మీపురం గ్రామానికి చెందిన నందుల నవీన్‌కు చెందిన 8. నెలల బాబు ఈనెల 9న, అనంతగిరి బొడ్డచెట్టు గ్రామానికి చెందిన దీసరి. సింహాద్రికి చెందిన 9. నెలల పాప డిసెంబర్‌ నెల 30న మృతి చెందారన్నారు. పిన్నకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి పెద్దకోట గ్రామానికి చెందిన కోనేపు. సుశీల బాలింత ఈనెల 17న మృతి చెందగా గత నెల 15 రోజుల క్రితం అనేకమంది బాలింతలు, పసిపిల్లలు మృతి చెందిన ఘటనలు మరి ఎన్నో ఉన్నాయన్నారు.గర్భిణీలకు, బాలింతలకు సకాలంలో పౌష్టికాహారం అందక పోవడంతోనే మృత్యువాతకు గురవుతున్నారని, ప్రభుత్వం నిర్లక్ష్య కారణమని, తక్షణమే దీనిపై ఐటిడిఏ, జిల్లా ఉన్నత అధికారులు ఈ మరణాలపై విచారణ చేపట్టాలన్నారు. అధ్యయన బృందాలు ఏర్పాటు చేసి ఎందుకు మృతి చెందారో అనే దానిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్య అధికారులు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం టోకూరు సర్పంచ్‌ కిల్లో. మోసియా, వార్డు మెంబర్‌ పాంగి .లక్ష్మణరావు, పాంగి రవిచంద్ర, గ్రామస్తులు నగేష్‌, కుమార్‌, ఆశ కార్యకర,్త గ్రామస్తులు పాల్గొన్నారు.