May 16,2021 07:01

ఇజ్రాయిల్‌ను కట్టడి చేయగల శక్తి ఇతర ఏ దేశం కన్నా అమెరికాకే ఎక్కువగా ఉంది. పరిస్థితి దిగజారకుండా చూడడంలో అది నిర్మాణాత్మక పాత్ర పోషించవచ్చు. అయితే ఆ చిత్తశుద్ధే బైడెన్‌ ప్రభుత్వానికి కొరవడింది. దాడులు రోజు రోజుకీ ఉధృతమవుతున్న దృష్ట్యా అమెరికా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తెచ్చి వీటిని ఆపేలా చేయొచ్చు. కానీ, బైడెన్‌ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం లేదు. దాని దృష్టి అంతా ఇరాన్‌ అణు ఒప్పందంపైనే ఉంది.
   యూదు దురహంకార ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై దురాక్రమణకు తెగబడడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. గత అయిదు రోజులుగా గాజాపై ఇజ్రాయిల్‌ దళాలు కొనసాగిస్తున్న వైమానిక దాడులు, శుక్రవారం నుంచి చేపట్టిన భూతల దాడుల్లో మొత్తం 132మంది పాలస్తీనా పౌరులు చనిపోయారు. వీరిలో 31 మంది పిల్లలు, 19 మంది మహిళలు ఉన్నారు. మరో 830 మంది వరకు గాయపడ్డారు. విచక్షణా రహితంగా సాగిస్తున్న దాడుల్లో అపార ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇజ్రాయిలీ దళాలు కురిపించిన బాంబుల వర్షానికి బహుళ అంతస్తుల భవనాలు, ఆసుపత్రులు, స్కూళ్లు ధ్వంసమయ్యాయి. నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినిపోయింది. రంజాన్‌ రోజున పాలస్తీనాలో ఇజ్రాయిల్‌ రక్తపాతం సృష్టించింది. గాజాను వశపరచుకోవడం ఇజ్రాయిల్‌కు అంత తేలికేమీ కాదు. హమాస్‌ సాయుధ పోరాటవాదుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతున్నది. ఏడేేళ్లలో క్రితం అంటే 2014 ఆగస్టులో మూడు వారాలపాటు ఇజ్రాయిల్‌ సాగించిన దారుణ మారణ కాండలో 2,140 మంది పాలస్తీనీయులు చనిపోయారు. ఇజ్రాయిల్‌ దురాక్రమణకు వ్యతిరేకంగా పాలస్తీనీయులు 2000 సంవత్సరంలో రెండో ఇంతిఫాదా (తిరుగుబాటు) ప్రారంభించిన తరువాత జరిగిన రెండో అతి పెద్ద దాడి. మొదటి ఇంతిఫాదా 1987లో ప్రారంభమై 1993 వరకు సాగింది. ఈ మధ్యలో 2009, 2012, 2014, 2017లలో కూడా ఇజ్రాయిల్‌ నేరపూరిత దాడులకు పాల్పడుతూ పలువురు పాలస్తీనా పౌరులను అమానుషంగా పొట్టనబెట్టుకుంది. 1967లో ఆరు రోజుల పాటు సాగిన ఇజ్రాయిల్‌-అరబ్‌ యుద్ధం తరువాత జోర్డాన్‌ అధీనంలో ఉన్న గాజాను ఇజ్రాయిల్‌ ఆక్రమించుకుంది.
   పాలస్తీనా భూ భాగాన్ని ఇప్పటికే 60 శాతం వరకు కబళించిన ఇజ్రాయిల్‌ మిగతా ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకోవాలని చూస్తున్నది. ఇజ్రాయిల్‌కు సన్నిహిత మిత్ర దేశమైన అమెరికా ఈ దాడులను మరింత ఎగదోస్తున్నది. గత అయిదున్నర దశాబ్దాలుగా రావణ కాష్టంలా రగులుతున్న ఈ సంక్షోభానికి కారణం అమెరికానే. చమురు నిక్షేపాలు అపారంగా ఉన్న అరబ్‌ ప్రాంతంపై పట్టు బిగించేందుకు ఇజ్రాయిల్‌ కేంద్రంగా అది పావులు కదుపుతున్నది. అగ్ర రాజ్యం అండ చూసుకుని నెతన్యాహు ప్రభుత్వం ఇష్టానుసారంగా చెలరేగిపోతున్నది.
   ఉగ్రరాజ్యం ఇజ్రాయిల్‌ విధానాలకు మునుపటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ బాహాటంగా మద్దతు ఇచ్చారు. దశాబ్దాలుగా అమెరికా అధికారికంగా అనుసరిస్తూ వస్తున్న విధానానికి భిన్నంగా 2017లో జెరూసలెంను ఇజ్రాయిల్‌ రాజధానిగా అమెరికా గుర్తిస్తున్నదని ప్రకటించారు. 2018లో అమెరికా దౌత్య కార్యాలయాన్ని టెల్‌ అవీవ్‌ నుంచి జెరూసలెంకు తరలించారు. ట్రంప్‌ చర్య 'ఇజ్రాయిల్‌- స్వతంత్ర పాలస్తీనా' అన్న రెండు దేశాల ఏర్పాటుకు సంబంధించిన ఒప్పందానికి నిలువునా తూట్లు పొడిచింది. ట్రంప్‌ చర్య పాలస్తీనీయులను తీవ్ర నిస్పృహకు గురిచేసింది.
  ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు యుద్ధోన్మాద పోకడలను ఇజ్రాయిలీయుల్లో అత్యధికులు వ్యతిరేకిస్తున్నారు. నెతన్యాహు పట్ల ఇజ్రాయిలీయుల్లో వ్యతిరేకత ఏ మోతాదులో ఉందో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో స్పష్టంగా బయటపడింది. మొత్తం 120 స్థానాలు ఉన్న పార్లమెంటులో మెజార్టీకి 61 స్థానాలు అవసరం కాగా నెతన్యాహు నేతృత్వంలోని మితవాద లీకుడ్‌ పార్టీకి కేవలం 30 సీట్లు మాత్రమే వచ్చాయి. పోలైన ఓట్లలో 24 శాతం మాత్రమే దక్కాయి. మే 4 గడువులోగా కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నెతన్యాహు విఫలమయ్యారు. దీంతో ఆయన భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. పాలస్తీనీయులపై దాడులకు దిగడం ద్వారా ఇజ్రాయిలీయుల్లో జాతీయ ఉన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు. జెరూసలెంలోని షేక్‌ జారాలో యూదు సెట్లర్ల కోసం పాలస్తీనా కుటుంబాలను దౌర్జన్యంగా ఖాళీ చేయించడం దగ్గర నుంచి అల్‌ అక్సా మసీదుపై దాడి, 'ఇజ్రాయిల్‌ డే' పేరుతో యూదు మూకల ప్రదర్శనలు, గాజాపై వైమానిక, భూతల దాడుల వరకు అన్నీ పథకం ప్రకారమే జరుగుతున్నాయి.
   గత అనుభవాలను బట్టి ఇజ్రాయిల్‌, పాలస్తీనా మధ్య ఘర్షణలు కొంత కాలం పాటు కొనసాగుతాయి. తరువాత అంతర్జాతీయ సమాజం లేదా కొన్ని దేశాలు మధ్యవర్తిత్వం నెరపి ఉద్రిక్తతలను చల్లార్చడం జరుగుతుంది. ఈ సారి కూడా దాడులు ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. ఉద్రిక్తతలు సమసిపోయినా ఈ ఘర్షణలకు మూలమైన సమస్య అలానే ఉంటుంది. ఇజ్రాయిల్‌- పాలస్తీనా సమస్య పరిష్కారానికి అంతర్జాతీయ సమాజం సరిగా వ్యవహరించాలి. ఇజ్రాయిల్‌కు కొమ్ముకాయడం వల్ల సమస్యను పరిష్కరించలేమనే విషయాన్ని గ్రహించాలి.
   బ్రిటిష్‌ విశ్లేషకుడు టామ్‌ ఫౌడీ ఇటీవల రష్యా టుడేలో ఒక వ్యాసం రాస్తూ జెరూసలెం, గాజాల్లో రక్తపాతానికి అమెరికాయే కారణం. ఇజ్రాయిల్‌- పాలస్తీనా ఘర్షణ అమెరికాతో ముడిపడి ఉన్నది. ట్రంప్‌ హయాంలో పాలస్తీనీయుల ప్రయోజనాలను పణంగా పెట్టి ఇజ్రాయిల్‌కి మేలు చేకూర్చేలా అమెరికా వ్యవహరించింది. 2020 మేలో అధ్యక్ష ఎన్నికల ప్రచార సందర్భంగా జో బైడెన్‌ మాట్లాడుతూ ఇజ్రాయిల్‌- పాలస్తీనా మధ్య శాంతి కోసం పాలస్తీనీయులతో చర్చలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారానికి విఘాతం కలిగించే ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఇజ్రాయిల్‌ను నిలువరిస్తామని అన్నారు. దీంతో బైడెన్‌ వస్తే పరిస్థితి కొంత ఆశాజనకంగా ఉంటుందని పాలస్తీనీయులు భావించారు. బైడెన్‌ అధికారంలోకి వచ్చి నాలుగు మాసాలు గడిచాయి. ఇంతవరకు దీనిపై దృష్టి పెట్టింది లేదు. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై బుధవారం వైట్‌ హౌస్‌లో మీడియాతో బైడెన్‌ మాట్లాడుతూ, ఇజ్రాయిల్‌కు తనను తాను రక్షించుకునే హక్కు ఉన్నదని అన్నారు. బైడెన్‌ వ్యాఖ్యలు పాలస్తీనీయులను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఇజ్రాయిల్‌ను కట్టడి చేయగల శక్తి ఇతర ఏ దేశం కన్నా అమెరికాకే ఎక్కువగా ఉంది. పరిస్థితి దిగజారకుండా చూడడంలో అది నిర్మాణాత్మక పాత్ర పోషించవచ్చు. అయితే ఆ చిత్తశుద్ధే బైడెన్‌ ప్రభుత్వానికి కొరవడింది. దాడులు రోజు రోజుకీ ఉధృతమవుతున్న దృష్ట్యా అమెరికా ఇజ్రాయిల్‌పై ఒత్తిడి తెచ్చి వీటిని ఆపేలా చేయొచ్చు. కానీ, బైడెన్‌ ప్రభుత్వం దీని గురించి పట్టించుకోవడం లేదు. దాని దృష్టి అంతా ఇరాన్‌ అణు ఒప్పందంపైనే ఉంది.
   భారత్‌లో మోడీ ప్రభుత్వం యూదు దురహంకార నెతన్యాహు ప్రభుత్వానికి కొమ్ముకాయడం దుర్మార్గం. ఇజ్రాయిల్‌ వైమానిక దాడుల్లో పాలస్తీనా పౌరులు, పిల్లలు పెద్ద సంఖ్యలో చనిపోతుంటే వాటి గురించి ప్రస్తావించకుండా, ఇజ్రాయిల్‌పై రాకెట్‌ దాడులు తమకు ఎక్కువ ఆందోళనకు గురిచేస్తున్నాయని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇజ్రాయిల్‌ నుంచి ఐరన్‌ డోమ్‌ టెక్నాలజీని, ఆయుధాలను దిగుమతి చేసుకోవడం ద్వారా పాలస్తీనీయులకు తర తరాలుగా సంఘీభావం తెలుపుతున్న మన విదేశాంగ విధానాన్ని తుంగలో తొక్కింది.
   ఐక్యరాజ్యసమితి, ఇరుగుపొరుగు అరబ్‌ దేశాలు దీనిపై మధ్యవర్తిత్వం వహించేందుకు సంసిద్ధత తెలిపినా, అమెరికా మాత్రం ముందుకు రావడం లేదు. జర్మనీతో కలసి ఇజ్రాయిల్‌లో యూదు దురహంకార ప్రభుత్వాన్ని అది బాహాటంగా వెనకేసుకొస్తున్నది. ఈ స్థితిలో ఇజ్రాయిల్‌-పాలస్తీనా మధ్య ఉద్రిక్తతలను తొలగించేందుకు ఐరాస తో సహా వివిధ వేదికల ద్వారా చైనా, రష్యా కృషి చేస్తున్నాయి. ఇజ్రాయిల్‌-పాలస్తీనా రెండూ సంయమనం పాటించాలని చైనా, రష్యా విదేశాంగ మంత్రులు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇజ్రాయిల్‌- పాలస్తీనా సమస్యకు పరిష్కారం చూపకుండా ఈ ప్రాంతంలో శాంతి, సుస్ధిరతలను నెలొల్పలేము. ఐరాస ఫ్రేమ్‌ వర్కు పరిధిలో అంతర్జాతీయ యంత్రాంగం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు కృషి జరగాలి. అంతే తప్ప అమెరికా నిర్ణయానికి దీనిని వదిలిపెట్టడం ఎంతమాత్రం సరికాదు.