ప్రజాశక్తి -గోపాలపట్నం : విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. గోపాలపట్నంలోని కుమారి కల్యాణ మండపంలో కార్యకర్తలతో పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. బెహరా భాస్కరరావు నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో ఆనంద్‌కుమార్ మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గానికీ ప్రభుత్వం రూ.2 కోట్లు అభివృద్ధి నిధులు మంజూరు చేసిందని, ప్రతి సచివాలయ పరిధిలో పనులకు రూ.20 లక్షలు మంజూరయ్యయని తెలిపారు. పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తామన్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరతగతిన పూర్తయ్యేటట్లు చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఎన్‌ఎడి కొత్త రోడ్ పరిధిలో వైసిపి క్యాంపు కార్యాలయాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ప్రజల నుంచి వచ్చే సమస్యలను తెలుసుకొని పరిష్కరించే దిశగా పనిచేస్తామని చెప్పారు. త్వరలోనే గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన తనకు కార్యకర్తలు, ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు గొర్ల అప్పలస్వామి నాయుడు, గేదెలు మురళీకృష్ణ, గునిశెట్టి శ్రీనివాసరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.










