కరోనా మహమ్మారి ప్రబలడంతో వరుసగా విధించిన లాక్‌డౌన్‌ల నేపథ్యంలో... పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ప్రాణ నష్టం, జీవనోపాధి కోల్పోవడం వంటి సమస్యలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని బయట పెట్టాయి. కరోనా కారణంగా తమ స్వస్థలాలకు వెళ్ళిపోయిన వలస కార్మికులు మూకుమ్మడిగా తిరిగి రావడం, అధికారుల సాయాన్ని, మద్దతును కోరడం ఇటీవల కాలంలో చేదు వాస్తవాలుగా మారిపోయాయి. రాష్ట్రంలో దశాబ్ద కాలంగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న పాలనా తీరు... పని పరిస్థితులను దిగజార్చడమే కాకుండా, రాష్ట్రంలో పనికి గల అవకాశాలను కూడా దెబ్బతీసింది.
ఈ సంక్షోభ తీవ్రతను అర్ధం చేసుకోవాలంటే, మనం 2011-12 ఎన్‌ఎస్‌ఎస్‌ఓ చేపట్టిన ఉపాధి, నిరుద్యోగ సర్వే, 2018-19 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేల నుండి ఉపాధి, నిరుద్యోగం డేటా వివరాలను పోల్చి చూడాల్సి వుంది. అంతకన్నా ముఖ్యమైన అంశమేమంటే, రాష్ట్ర ప్రభుత్వ నిష్క్రియాపరత్వం, దానితో పాటు కార్మిక శక్తిని ఒక పద్ధతి ప్రకారం అసంఘటితం చేయడం వల్ల ఈ ఉపాధి సంక్షోభం మరింత అధ్వాన్న స్థితికి చేరుకుందని విమర్శనాత్మక సమీక్ష పేర్కొంటోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉపాధి రంగంలో మూడంచెల సంక్షోభం నెలకొంది. మొదటిది, అన్ని రంగాల్లో కూడా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. అయితే, చదువుకున్న వారిలో ఈ నిరుద్యోగ రేటు ఇంకా ఎక్కువగా వుంది. రెండవది, ప్రభుత్వ రంగ ఉపాధి ముఖ్యంగా వేతన జీవుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మూడవది, సమిష్టిగా చేపట్టే ఏ కార్యాచరణపైనైనా ఎడతెగని దాడులకు పూనుకోవడం (ముఖ్యంగా ప్రభుత్వం జరిపే దాడులు, హింస పెరగడం). ఈ కారణాలన్నింటి రీత్యా కార్మికుల అన్ని రకాల ఉపాధి భద్రతలను నీరుగార్చే ప్రయత్నం జరిగింది. గత దశాబ్ద కాలంలో రాష్ట్రంలో పని చేసే వయస్సులో వున్నవారి జనాభా దాదాపు 5 శాతం పెరిగినా కొత్త ఉద్యోగాల సృష్టి అనేది లేకుండా పోవడం ప్రధాన ఆందోళనగా వుంది.
నిరుద్యోగ రేటు పెరుగుదల
15 నుండి 59 ఏళ్ళ మధ్య వయస్సు కార్మికులలో నిరుద్యోగం రేటు 3 శాతం పాయింట్లు పెరిగింది. గణాంకాల్లో చెప్పాలంటే, గ్రామీణ ప్రాంతాల్లో 8.3 లక్షల మంది, పట్టణ ప్రాంతాల్లో 6.5 లక్షల మంది ప్రస్తుతం పని కోసం వెతుక్కుంటున్నారు. 2018-19లో ఈ వర్గానికి ఒక్క నెల రోజులు కూడా పని దొరకకపోవడం దురదృష్టకరం. రాష్ట్రంలో విద్యావంతుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే నిరుద్యోగం రేటు మరింత దిగ్భ్రాంతిని కలిగించేలా వుంది. గ్రామీణ ప్రాంతాల్లో, ప్రతి వంద మందిలో 12 మంది పని చేసే వయస్సులోనే వున్నారు. వారు కనీసంగా ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేసినా నిరుద్యోగులుగానే వున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఈ నిష్పత్తి కొంచెం తక్కువగా వుంది. ఇక్కడ చదువుకుని, పని చేసే వయస్సు గల వారిలో 10 శాతం మంది నిరుద్యోగులుగా వున్నారు. 2011-12 నుండి 2018-19కి వచ్చేసరికి యువతలో (18-30 సం||) నిరుద్యోగం రేటు 10 నుండి 13 శాతానికి పెరిగింది. ఇక మహిళల విషయానికొస్తే మరీ అధ్వాన్నంగా వుంది. గ్రామీణ పశ్చిమ బెంగాల్ లోని దాదాపు 9.3 లక్షల మంది మహిళలు గత దశాబ్ద కాలంలో తమ ఉపాధిని కోల్పోయారు. పని చేసే వయస్సులో వుండి చదువుకుంటున్న జనాభా నిష్పత్తి 2011 నుండి 22 శాతంగానే వుండిపోయిందన్న వాస్తవాన్ని గమనంలోకి తీసుకుంటే ఉపాధిలో ఈ తగ్గుదల రాష్ట్రంలో ఉపాధి అవకాశాల తీవ్ర కొరతను ప్రతిబింబిస్తోంది.
ప్రభుత్వ రంగ ఉపాధిలో వ్యవస్థాగత క్షీణత
రాష్ట్ర ఉపాధి రంగానికి సంబంధించి గత దశాబ్ద కాలంలో గుర్తించదగ్గ మరో అంశమేమంటే...పని చేసే వయస్సులో వున్నవారికి సంబంధించి మొత్తం రెగ్యులర్ ఉద్యోగాల్లో ప్రభుత్వ రంగ ఉద్యోగాల వాటా గణనీయంగా క్షీణించింది. 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లోని వేతన జీవుల్లో 37 శాతం మంది ప్రభుత్వ సంస్థల్లో వున్నారు. అదే పట్టణ ప్రాంతానికి వచ్చేసరికి ఆ సంఖ్య 31 శాతంగా వుంది. కానీ, 2018-19 వచ్చేసరికి, ప్రభుత్వ రంగంలో ఉపాధి బాగా క్షీణించింది. 2018-19లో గ్రామీణ ప్రాంత ఉద్యోగుల్లో 30 శాతం మంది, పట్టణ ప్రాంతాల్లో కేవలం 23 శాతం మంది మాత్రమే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారు. ఇందులో ఇంకా నిర్దిష్టంగా చెప్పుకోవాల్సిన విషయమేమంటే, రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే స్కూల్ సర్వీస్ కమిషన్ పరీక్షల ద్వారా రెగ్యులర్ ఉపాధి కల్పనను నిలిపివేసింది. దీనితో పాటు, రిక్రూట్‌మెంట్‌లో అవకతవకలు, అవినీతి బాగా పెరిగిపోయాయి. కోల్‌కతా లోనూ రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లోనూ సాగుతున్న నిరసనల వెల్లువ...న్యాయమైన, సక్రమమైన ఉపాధి కోసం కార్మికులు చేస్తున్న డిమాండ్‌ను ప్రతిబింబిస్తోంది. ఒకవైపు ఉపాధి అవకాశాలు కొరవడడం, మరో వైపు మరింత మెరుగైన ప్రభుత్వ రంగ ఉపాధిలో వాటా క్షీణించడం ఈ రెండూ గత దశాబ్ద కాలంలో రాష్ట్ర ప్రభుత్వ పాలనా తీరును కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి.
రెగ్యులర్ ఉపాధిలో ఉద్యోగ భద్రతా సంక్షోభం
భారత్‌లో ఉపాధి రంగంలో పెరుగుతున్న సంక్షోభ ధోరణుల్లో ప్రధానంగా రెండు కారణాలు కనిపిస్తున్నాయి. అవి రెండూ ఒకదాన్ని మరొకటి బలపరుస్తున్నాయి. ఉపాధి అవకాశాల్లో పూర్తి స్థాయి క్షీణత నెలకొంది. దీంతో ఉపాధి రంగంలో మరింత అసంఘటీకరణ పెరగడానికి దారితీస్తోంది. లాక్‌డౌన్ సమయంలో, పలు బిజెపి పాలిత రాష్ట్రాలు కార్మిక చట్టాలను ధ్వంసం చేశాయి. ఫలితంగా పని ప్రదేశాల్లో రక్షణ కల్పించే, పైగా వీరోచిత పోరాటాల ద్వారా కార్మికులు సాధించుకున్న కొద్ది హక్కులను కూడా కాలరాసే పరిస్థితి ఏర్పడింది. పశ్చిమ బెంగాల్‌లో, పటిష్టమైన కార్మిక సంఘ ఉద్యమాన్ని హింస ద్వారా, నిరంతరంగా ప్రభుత్వ బెదిరింపుల ద్వారా నీరుగార్చడంతో వేతన జీవుల్లో కూడా ఉద్యోగ భద్రతా సంక్షోభానికి దారి తీసింది. అసంఘటిత రంగ సంస్థల జాతీయ కమిషన్ (ఎన్‌సిఇయుఎస్) మూడు ప్రామాణికాల ద్వారా సంఘటిత లేదా సాధారణ పని (ఫార్మల్ వర్క్) ని గుర్తించింది. ఆ ప్రామాణికాలు ఏమిటంటే, రాతపూర్వకంగా ఉద్యోగ కాంట్రాక్ట్ వుండడం, వేతనంతో కూడిన సెలవు, రెగ్యులర్ పద్ధతిలో చెల్లింపులు వుండడం, కనీసం ఒక సామాజిక భద్రత (ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యూటీ తదితరాలు) నిబంధన అమలు కావడం. ఈ ప్రామాణికాలను బట్టి చూసినట్లైతే, పశ్చిమ బెంగాల్‌లో రెగ్యులర్ శాలరీ అందే ఉద్యోగాల్లో పట్టణ ప్రాంతంలోని మూడింట రెండు వంతులకు పైగా ఉద్యోగాలు, గ్రామీణ రంగంలో నాలుగింట మూడు వంతుల ఉద్యోగాలు స్వభావరీత్యా అసంఘటిత రంగాన్ని పోలి వున్నాయి. ఇక ప్రస్తుత కరోనా కష్ట కాలంలో ఆర్థిక కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతినడం వల్ల చాలా భద్రత కలిగివున్న ఉద్యోగాలు సైతం ముప్పులో పడ్డాయి. ఇక క్యాజువల్ ఉద్యోగుల పరిస్థితి మరీ అధ్వాన్నంగా వుంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ప్రేక్షకురాలిగా చూస్తూ, ఈ అసంఘటిత రంగ క్రమానికి సాయపడుతూ, ప్రోత్సహిస్తోంది.
రాష్ట్ర ప్రజలకు ఏ మాత్రమూ ప్రయోజనం లేని చిన్న చిన్న విషయాలకు సంబంధించి బిజెపి, టిఎంసిల మధ్య నెలకొన్న ఘర్షణలపై పెయిడ్ మీడియా ప్రధానంగా దృష్టి పెడుతోంది. పెరుగుతున్న నిరుద్యోగ సమస్యపై ఇరు పార్టీలు మౌనం పాటించడం వారి ప్రజా వ్యతిరేక రాజకీయాలను ప్రతిబింబిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ వ్యవహార శైలి చూస్తుంటే ఆర్థిక విధానాలకు సంబంధించి టిఎంసికి, కేంద్రంలోని మోడీ సర్కార్‌కు మధ్య ఎలాంటి తేడా లేదన్న వాస్తవం స్పష్టమవుతోంది. సురక్షితమైన, భద్రత కలిగిన జీవనోపాధి హక్కులను ఇలా నిరాకరించడం...మమతా బెనర్జీ పదే పదే ముఖ్యంగా కరోనా సంక్షోభ కాలంలో కూడా చెప్పుకుంటూ వస్తున్న సంక్షేమవాదం లోని బూటకాన్ని బహిర్గతం చేస్తోంది.
సోహమ్ భట్టాచార్య
మణికంఠ నటరాజ్










