
న్యూఢిల్లీ : 2014 నుండి 2019 వరకు దేశంలోని 38 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం రూ.5,814 కోట్ల నిధులు విడుదల చేసిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ప్రామాణిక నిబంధనల ప్రకారం లోక్‌సభ ఎన్నికల పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర అసెంబ్లీలకు స్వతంత్రంగా జరిగే ఎన్నికల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వాలు సమకూరుస్తున్నాయి. ఒకవేళ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఏకకాలంలో జరిగితే మాత్రం ఆయా రాష్ట్రాల్లో అయ్యే ఎన్నికల వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50% చొప్పున పంచుకుంటున్నాయి. ఇందులో భాగంగా గత ఆరేళ్లలో కేంద్రం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.5,814 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశంతో అన్ని ఎన్నికలనూ ఏకకాలంలో నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫార్సు చేసినట్లు ఆయన చెప్పారు. బుధవారం లోక్‌సభలో ప్రదీప్‌కుమార్ సింగ్ అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కిరణ్‌రిజిజు ఈ సమాధానమిచ్చారు. ఎన్నికలు తరచూ జరగడం వల్ల సాధారణ ప్రజాజీవితం ఇబ్బందులకు గురవడంతో పాటు వారికి అందే అత్యవసర సేవలపైనా ప్రభావం పడుతోందని, అన్ని ఎన్నికలూ ఏకకాలంలో జరిపినట్లైతే వాటి నిర్వహణ వ్యయ భారం తగ్గిపోతుందని న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం తన 79వ నివేదికలో పేర్కొందని అన్నారు. ఎన్నికల సంఘంతో పాటు పలు సంస్థలతో చర్చించి తగు సిఫార్సులు చేసిందని, ఆ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించి జమిలి ఎన్నికలపై ఆచరణాత్మక మార్గసూచిక, నిబంధనలు రూపొందించాలని సూచిస్తూ లా కమిషన్‌కు పంపామని చెప్పారు. విభిన్న వర్గాలతో సంప్రదించిన అనంతరం ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ 244, 255 నివేదికల్లో సిఫార్సులు చేసిందని, వాటిని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని కిరణ్ రిజిజు తెలిపారు.
కేంద్రం విడుదల చేసిన ఎన్నికల నిధులు
సంవత్సరం ఖర్చు (రూ.కోట్లలో)
2014-15 510.00
2015-16 1,490.16
2016-17 356.14
2017-18 1,199.85
2018-19 886.11
2019-20 1,372.03