May 28,2021 07:34

కార్మికుల విముక్తి కోసం పారిస్‌ కమ్యూన్‌ అనేక చర్యలు తీసుకుంది. వాటిలో కొన్ని: 1. యజమానులు వదిలేసినందున మూతపడిన పరిశ్రమలను కార్మికులకు అప్పగించింది. నిరుద్యోగులను ఆ పరిశ్రమల్లో నియమించింది 2. పరిశ్రమల్లో కనీస వేతనాలను నిర్ణయించింది 3. వడ్దీ వ్యాపారుల వద్ద తాకట్టు పెట్టబడిన కార్మికుల వస్తువులను తిరిగి వారికి అప్పగించింది. ఇంటి అద్దెల చెల్లింపును నిలిపివేసింది. 4. చర్చినీ, రాజ్యాన్ని వేరుగా ఉంచుతూ లౌకక రాజ్యాంగాన్ని అమలుపరిచింది. 5. వయోజనులందరికీ విద్య ఉచితం, నిర్భంధం చేసింది. కొత్త పాఠశాలలు నెలకొల్పింది. కమ్యూన్‌ ఆధ్వర్యంలో నర్సరీలు, క్రెచ్‌లు ఏర్పాటు చేసింది. కమ్యూన్‌ తీసుకున్న చర్యలకు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు.

   మానవ జాతి చరిత్రలో ఈ మొట్టమొదటి కార్మికవర్గ రాజ్యం- 'పారిస్‌ కమ్యూన్‌' ఏర్పడి ఈ ఏడాదికి 150 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1871 మార్చి 18న ఏర్పడిన 'పారిస్‌ కమ్యూన్‌' 72 రోజులు కొనసాగింది. బూర్జువా వర్గ విప్లవ-ప్రతీఘాత అంతర్యుద్ధంలో ఓటమిపాలు కావడంతో 1871 మే 28వ తేదీన పారిస్‌ కమ్యూన్‌ పతనం అయింది. కారల్‌ మార్క్స్‌ సూచించిన విధంగా పారిస్‌ కమ్యూన్‌ ఏర్పడిన రోజున కాకుండా అది పతనమైన రోజున ఆ మహత్తర ప్రయోగం అందించిన అనుభవాలనూ, గుణపాఠాలనూ నెమరువేసుకోవడం జరుగుతోంది.
 

                              కార్మికవర్గ విముక్తి పోరాటంలో ముఖ్యమైన మైలురాయి

   1789 ఫ్రెంచ్‌ విప్లవం తరువాత పెట్టుబడిదారీ వ్యవస్థ బ్రహ్మాండమైన అభివృద్ధి సాధించింది. కానీ ఆ అభివృద్ధి అంతా కార్మికుల, ఇతర శ్రామిక ప్రజల రక్తమాంసాలను హరించడం ద్వారా, వారి శరీరాలను పీల్చి పిప్పిచేయడం ద్వారానే జరిగింది. అన్ని దేశాల్లోనూ బూర్జువా వర్గం కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని కలుపుకుని ఫ్యూడల్‌ పాలక వర్గాలపై పోరాడి విజయం సాధించింది. కానీ అధికారం చేపట్టిన తరువాత రాజ్యాంగ యంత్రాన్ని గుప్పెట్లో పెట్టుకుని శ్రామిక వర్గాలను ఘోరంగా దోచుకోవడం ప్రారంభించింది. ఈ దోపిడీ పీడనల నుండి విముక్తి కోసం కార్మికవర్గం చేసిన, చేస్తున్న పోరాటాలు, ఆ పోరాటాలను అణచివేయడానికి పాలక వర్గాలు సాగిస్తున్న దమనకాండే ఈ కాలపు చరిత్ర అంతా.
    ఫ్రెంచ్‌ విప్లవం తరువాత 1830లో పారిస్‌ కార్మిక వర్గం జరిపిన విప్లవ పోరాటాన్ని బూర్జువా వర్గం హైజాక్‌ చేసింది. ఆ విప్లవంలో కార్మికులు వీరోచితంగా పాల్గొన్నప్పటికీ దానికి బూర్జువా వర్గం నాయకత్వం వహించడం వల్ల అది పోరాట ఫలితాన్ని తన ఖాతాలో వేసుకుంది. 1831లో ఫ్రాన్స్‌ లోని లియోన్‌ నగర కార్మికవర్గం తనపై జరుతున్న దోపిడీకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి 10 రోజులపాటు నగరాన్ని స్వాధీనం చేసుకుంది. కానీ తరువాత ఏం చేయాలో దానికి తెలియక తెల్ల మొహం వేసింది. వ్యవస్థాగత నిర్మాణం లేని కార్మికులను రక్తపుటేరుల్లో ముంచి బూర్జువా సైన్యం తిరిగి నగరాన్ని స్వాధీనంలోకి తెచ్చుకుంది. 1834లో మళ్లీ లియోన్‌ నగర కార్మికవర్గం తిరుగుబాటు చేసింది. వారం రోజుల పాటు సైన్యంతో వీరోచితంగా వీధిపోరాటం చేసిన అనంతరం వారు ఓడిపోయారు. పై రెండు పోరాటాల్లో కార్మికవర్గం స్వంతంత్ర శక్తిగా ఆవిర్భవించింది. 1848లో ఫ్రాన్స్‌లో జరిగిన విప్లవంలో బూర్జువా వర్గంతో కార్మిక వర్గం రాజ్యాధికారం కోసం మొట్టమొదటిసారి తలపడింది. సంఘటిత శక్తిగా ఉన్న బూర్జువా వర్గం కుట్రపూరిత విన్యాసాలతో గెలుపొందినప్పటికీ భవిష్యత్‌ నిర్ణాయక శక్తిగా కార్మిక వర్గం ముందుకు వచ్చింది. దానికి కొనసాగింపే 1871 పారిస్‌ కమ్యూన్‌. ఈసారి కార్మికవర్గం బూర్జువా వర్గంపై విజయం సాధించడమే కాదు రెండున్నర మాసాలు అధికారం చేపట్టింది. కొద్ది కాలంలోనే అయినా కార్మికవర్గ రాజ్యం ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపించింది. భవిష్యత్‌ కార్మికవర్గ రాజ్యానికి - సోషలిజానికి - దిక్సూచిగా నిలిచింది.
 

                                                పారిస్‌ కమ్యూన్‌ పూర్వరంగం

   1848 ఫ్రాన్స్‌లో జరిగిన విప్లవాన్ని అణచివేసి అధికారంలోకి వచ్చిన నెపోలియన్‌-3 ఏడాది తరువాత తనకు తాను ఫ్రెంచ్‌ చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. అతని నిరంకుశ పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. ప్రజల దృష్టిని మళ్లించడానికి నెపోలియన్‌ ప్రష్యాతో (ప్రష్యా అనేది జర్మన్‌ రాజ్యం. 1932లో జర్మనీలో విలీనమైంది) యుద్ధానికి దిగాడు. కానీ ప్రష్యా చేతిలో ఘోరంగా ఓడిపోయి, బంధీ అయ్యాడు. ఈ వార్త విన్న పారిస్‌ నగర ప్రజలు ఆగ్రహంతో తిరుగుబాటు చేశారు. ఫలితంగా రాచరికం స్థానంలో బూర్జువా ''రిపబ్లిక్‌'' ఏర్పడింది. మరోవైపు సెడాన్‌లో నెపోలియన్‌ సైన్యం ఓడిపోవడంతో ప్రష్యా సేనలు పారిస్‌ నగరం వైపు పురోగమించి, సెప్టెంబర్‌ 7వ తేదీన పారిస్‌ను దిగ్బంధించాయి. నగర రక్షణ కోసం పారిస్‌ కార్మికవర్గం ఆయుధాలు చేపట్టింది. ఒకవైపు కార్మికులు పారిస్‌ నగరాన్ని రక్షిస్తుంటే ఫ్రెంచ్‌ బూర్జువా ప్రభుత్వం కార్మికవర్గానికి వ్యతిరేకంగా శత్రు దేశంతో రహస్య ఒప్పందం చేసుకుని వెనువెంటనే ఫ్రాన్స్‌ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిపింది. ఈ ఎన్నికల్లో పచ్చి మితవాద నాయకుడైన అడోల్ఫ్‌ థయర్స్‌ నేతృత్వంలో బూర్జువా ప్రభుత్వం ఏర్పాటయింది. కొత్త ప్రభుత్వం పారిస్‌లో కాకుండా వెర్సయిల్స్‌ నగరంలో కొలువుతీరి అక్కడి నుండి పారిస్‌ను స్వాధీనం చేసుకోడానికి దాడికి దిగింది. పారిస్‌ కార్మికులు దీన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. 1871 ఫిబ్రరిలో నేషనల్‌ గార్డు దళాల కమిటీ పారిస్‌ రక్షణ కోసం పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చింది.
 

                                       1871 మార్చి 18 కార్మికవర్గ విప్లవం

    నేషనల్‌ గార్డు దళాలను నిరాయుధులను చేయడానికి బూర్జువా ప్రభుత్వం ప్రయత్నించడంతో మార్చి 18న విప్లవం ప్రారంభమైంది. థయర్స్‌ నాయకత్వంలోని బూర్జువా ప్రభుత్వం పారిస్‌ విడిచిపెట్టి వెర్సయిల్స్‌ నగరానికి పారిపోయింది. కార్మికవర్గ నేషనల్‌ గార్డులు పారిస్‌ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ విధంగా చరిత్రలో మొట్టమొదటి సారి 1871 మార్చి 18న పారిస్‌ నగరంలో కార్మిక రాజ్యం 'పారిస్‌ కమ్యూన్‌' ఏర్పడింది. నేషనల్‌ గార్డు కేంద్ర కమిటీ పారిస్‌ నగర ప్రభుత్వంగా మారింది. ప్రజలందరికీ ఆయు ధాలు ఇచ్చి నగర రక్షణకు పూనుకోవాలని పిలుపునిచ్చింది. పారిస్‌ కమ్యూన్‌ మండలికి వెంటనే ఎన్నికలు జరిపింది. మార్చి 26న జరిగిన మండలి ఎన్నికల్లో 85 స్థానాలకు గాను కార్మిక, మేధావి వర్గ ప్రతినిధులు మెజారిటీగా ఎన్నికయ్యారు. మార్చి 28న మండలి ప్రభుత్వ పాలనా వ్యవహారాలు చేపట్టింది. అప్పటి నుండి కొత్త ప్రభుత్వానికి 'పారిస్‌ కమ్యూన్‌' అని అధికారిక నామం లభించింది.
   పారిస్‌ కమ్యూన్‌ నగరంలోని పాత సైన్యాన్ని, పోలీసు వ్యవస్థను రద్దు చేసి వాటి స్థానంలో ప్రజా రక్షణ, నగర రక్షణ కర్తవ్యాలను నేషన్‌ గార్డుకు అప్పగించింది. కొత్త కౌన్సిల్‌కు ఎన్నికైన కార్మిక వర్గ ప్రతినిధులే కొత్త ప్రభుత్వ యంత్రాం గంగా మారిపోయారు. ఎన్నికైన ప్రతినిధులు ప్రజల విశ్వాసం పొందే విధంగా పనిచేయకపోతే వెనువెంటనే వారిని ఓటు ద్వారా తొలగించే అధికారం ప్రజలకిచ్చారు. పారిస్‌ కమ్యూన్‌ 72 రోజులు మాత్రమే అధికారంలో ఉంది. ఈ కొద్ది కాలంలోనే అది కార్మికుల విముక్తి కోసం అనేక చర్యలు తీసుకుంది.
 

                                                      కమ్యూన్‌ పతనం

   పారిస్‌లో విప్లవం సందర్భంలో వెర్సయిల్స్‌ పారిపోయిన బూర్జువా ప్రభుత్వం త్వరలోనే కూడదీసుకుని ప్రతీఘాత దాడి ప్రారంభించింది. కమ్యూన్‌ చేసిన అనేక పొరపాట్లు ప్రతీఘాత-విప్లవానికి అవకాశాలు కల్పించాయి. థయర్స్‌ను పారిస్‌ నుండి పారిపోవడానికి అనుమతించడం, అతను తిరిగి శక్తిని కూడదీసుకోడానికి సమయం ఇవ్వడం, ఫ్రెంచ్‌ జాతీయ బ్యాంకులోని అపార ధనరాసులను స్వాధీనం చేసుకుని విప్లవం కోసం వినియోగించుకోలేకపోవడం, అధికారం చేతికి రాగానే భద్రతను పటిష్టం చేసుకోకుండా హడావిడిగా కమ్యూన్‌ కౌన్సిల్‌ ఎన్నికలు జరపడం ఈ పొరపాట్లలో కొన్ని.
    ప్రష్యాతో సంధి చేసుకుని బలం పుంజుకున్న థయర్స్‌ సైన్యం మే 20 పారిస్‌ నగరంపై పెద్ద ఎత్తున దాడి ప్రారంభించి, మే 21 నుండి 28న పారిస్‌ కమ్యూన్‌ పతనం అయ్యేవరకు పారిస్‌ నగరంలోని ప్రతి అంగుళాన్ని రక్షించుకోడానికి కార్మికవర్గం చేసిన పోరాటం చరిత్రలో వీరోచిత, త్యాగపూరిత అధ్యాయంగా నిలిచి పోతుంది. కమ్యూన్‌ మద్దతుదారులు తమ కన్నా అన్ని విధాలా బలమైన శత్రువు నుండి నగరంలోని ప్రతి వీధినీ, ప్రతి ఇంటినీ రక్షించడానికి నగరం మొత్తం బారికేడ్లు నిర్మించారు. నగర రక్షణలో కార్మికవాడల్లోని స్త్రీలు, పిల్లలు కూడా పాల్గొన్నారు. వారం రోజుల పాటు కమ్యూన్‌ మద్దతుదారుల బారికేడ్లను ఛేదించుకుంటూ, దొరికిన వారిని దొరికినట్లు చంపుతూ, ఇళ్లను తగులబెడుతూ అనేక మందిని అరెస్టు చేస్తూ ముందుకు నడిచిన థయర్స్‌ సైన్యం మే 27న పెరె లాచైజ్‌ శ్మశానవాటిక లోని కమ్యూన్‌ మద్దతుదారుల చివరి రక్షణ దుర్గాన్ని కూల్చి వేసింది. మే 28న పారిస్‌ లోని చివరి బారికేడ్‌ కూలిపోవడంతో ప్రతీఘాత-విప్లవం విజయం సాధించింది. ఓడిపోయిన కమ్యూన్‌ మద్దతు దారులను బూర్జువా ప్రభుత్వం అతి దారుణంగా హింసించి చంపేసింది. కార్మిక సైన్యానికి సహకరించారనే అనుమానంతో అనేక మంది మహిళలను, కార్మికుల పిల్లలను కాల్చి చంపారు. 30,000 మంది కమ్యూన్‌ మద్దతు దారులను ఎటువంటి విచారణ లేకుండా కాల్చి చంపారు. 40,000 మందిని అరెస్టు చేసి జైళ్లలో పెట్టారు, లేకుంటే ఫ్రెంచ్‌ వలస దేశాలకు ప్రావాసం పంపారు.
 

                                               అనుభవాలు, గుణపాఠాలు

   పారిస్‌ కమ్యూన్‌ కొద్ది రోజులే మనుగడ సాధించినప్పటికీ భవిష్యత్‌ తరాలకు గొప్ప అనుభవాలు, గుణపాఠాలు అందించింది. కమ్యూన్‌ పతనమైన రెండు రోజుల తరువాత, అంటే మే 30న తొలి ఇంటర్నేషనల్‌ వర్కింగ్‌ మెన్స్‌ (ఫస్ట్‌ ఇంటర్నేషనల్‌) జనరల్‌ కౌన్సిల్‌ సమావేశానికి కారల్‌ మార్క్స్‌ ''పారిస్‌లో అంతర్యుద్ధం'' అనే పత్రం రాస్తూ పారిస్‌ కమ్యూన్‌పై అద్భుతమైన విశ్లేషణ చేశారు. ఒక రాజకీయ పార్టీ లేకుండా, క్రమశిక్షణ గల నిర్మాణం లేకుండా కార్మికవర్గం విజయం సాధించలేదు అని ఆయన విశ్లేషించాడు. మార్క్స్‌ చెప్పిన అనుభవాలను లెనిన్‌ 1917 ఆగస్టులో రాసిన ''రాజ్యము-విప్లవము'' అనే గ్రంథంలో మరింత విపులీకరించి నాటి రష్యా విప్లవ పరిస్థితులకు అన్వయించడానికి ప్రయత్నించాడు. సోషలిస్టు విప్లవాలు ఎలా నడపాలో పారిస్‌ కమ్యూన్‌ అనుభవం ప్రపంచ కార్మికవర్గానికి నేర్పించింది. యూరప్‌ అంతటా కార్మికవర్గ ఉద్యమాలకు కమ్యూన్‌ ఊపునిచ్చింది. రష్యాలో అక్టోబర్‌ విప్లవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో లెనిన్‌కూ, బోల్షివిక్‌ పార్టీకి కమ్యూన్‌ అనుభవాలూ, దాని తప్పిదాల నుండి గుణపాఠాలూ ఎంతగానో తోడ్పడ్డాయి.
   పారిస్‌ కమ్యూన్‌ 72 రోజుల స్వల్ప కాలమే మనుగడ సాగించినా అది అంతం కాలేదు. తరువాత జరిగిన అనేక విప్లవాల్లో-రష్యన్‌ అక్టోబర్‌ విప్లవంలో, ఓడిపోయిన జర్మన్‌ విప్లవంలో, విజయం సాధించిన చైనా, క్యూబా, వియత్నాం, కొరియా విప్లవాల్లో, ప్రపంచవ్యాపితంగా నేటికీ జరుగుతున్న కార్మికవర్గ పోరాటాల్లో జీవించే ఉంది. కమ్యూన్‌ పతనమై 150 సంవత్సరాలు కావచ్చుగాక. కానీ ప్రపంచంలో ఎక్కడెక్కడ ప్రజా విప్లవాలు జరుగుతున్నా అక్కడల్లా పారిస్‌ కమ్యూన్‌ జీవించే ఉంటుంది. భూగోళం మీద సోషలిజం సుస్థిరమయ్యేవరకు విప్లవ పోరాటాలకు మార్గదర్శనం చేస్తూనే ఉంటుంది.

ఎస్‌. వెంకట్రావు

ఎస్‌. వెంకట్రావు