రుణ వాయిదా చెల్లింపు 15 రోజులు ఆలస్యం
ఇంటిని స్వాధీనం చేసుకుంటామని బెదిరింపులతో తల్లడిల్లిన కుటుంబం
ప్రజాశక్తి - మొగల్తూరు
'కుటుంబ యజమాని ఇంటి నిర్మాణానికి తీసుకున్న రుణం వాయిదా చెల్లింపులో 15 రోజులు ఆలస్యమైంది. అంతే రుణమిచ్చిన ప్రయివేటు ఫైనాన్స్ సంస్థ ఉద్యోగులు రంగంలోకి దిగి నేరుగా ఇంటికొచ్చారు. వాయిదా సొమ్ము వెంటనే చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన యజమాని భార్య గుండెపోటుతో శనివారం మృతి చెందింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన యజమాని తల్లి ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రోజు వ్యవధిలో అత్తాకోడళ్లు మృతి చెందడం ఆ ప్రాంతంలో కలకలం సృష్టించింది. ఈ ఘటన మండలంలోని పేరుపాలెం సౌత్‌లోని బెల్లంకొండవారిమెరకలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాలిలాఉన్నాయి.
పేరుపాలెం సౌత్‌లోని బెల్లంకొండవారి మెరకకు చెందిన సుందర ఆంజనేయులు, రవిబాబు తండ్రీ కొడుకులు. రవిబాబు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. రవిబాబుకు భార్య, కుమార్తె (4), కుమారుడు (2) ఉన్నారు. రవిబాబు ఇంటి నిర్మాణానికి ఫుల్ట్రన్ ప్రయివేటు ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.5.50 లక్షలు రుణం తీసుకున్నాడు. ప్రతి నెలా రూ.12,500 రుణ వాయిదా సక్రమంగా చెల్లిస్తున్నాడు. ఈ నెల ఆర్థిక ఇబ్బందుల రీత్యా వాయిదా చెల్లించలేకపోయాడు. దీంతో ఈ నెల 23న ఫుల్ట్రన్ ప్రయివేటు ఫైనాన్స్ సంస్థకు చెందిన ఉద్యోగులు ఇంటికి వచ్చి వెంటనే రుణ వాయిదా చెల్లించకపోతే ఇంటిని స్వాధీనం చేసుకుని, వేలం వేస్తామని భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రవిబాబు భార్య భారతి (24) ఈ నెల 24న తీవ్ర గుండెపోటుకు గురైంది. ఆసుపత్రికి తరలించేలోపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. అనూహ్య ఘటనతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ విషయం చుట్టుపక్కలవారికి, బంధువులకు అందరికీ తెలియడంతో రవిబాబు తల్లి అంజమ్మ (57) తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆదివారం ఉదయం అంతా పనుల్లో ఉండగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో వారు గుర్తించేటప్పటికే ఆమె విగతజీవిగా మారింది. వరుస ఘటనలతో బెల్లంకొండవారి మెరకలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. రోజు వ్యవధిలో కోడలు, అత్త మరణించడం అందరినీ కలిచివేసింది. సమాచారం అందుకున్న నరసాపురం సిఐ వాడవల్లి సురేష్‌బాబు, మొగల్తూరు ఎస్‌ఐ ఎం.వీరబాబు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అంజమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నరసాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుడు రవిబాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఎం.వీరబాబు తెలిపారు.










