
ప్రజాశక్తి-ఉక్కునగరం : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ కుట్రలను తిప్పికొడతామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కో-కన్వీనర్ జె.అయోధ్యరామ్ స్పష్టంచేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద చేపట్టిన దీక్షలు 944వ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరంలో విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్‌ఎంఎస్-1 విభాగ కార్మికులు కూర్చున్నారు. దీక్షలనుద్దేశించి అయోధ్యరామ్ మాట్లాడుతూ, విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కేవలం రూ.10 కోట్లతో 1700 టన్నుల ఆక్సిజన్ తయారవుతుందన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.50 కోట్లు ప్రయివేట్ వారికి చెల్లించి ఆక్సిజన్‌ను వినియోగించుకోవాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్‌ప్లాంట్ 2700 టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తోందని, విస్తరణ అవసరాల నిమిత్తం మరో 1700 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి అవసరమైన ప్లాంట్ నిర్మాణం జరిగిందని తెలిపారు. దీనిని నడపలేరని చెప్పడం ప్రభుత్వ కుట్రకు నిదర్శనమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిపై పూర్తి అధికారం స్టీల్ యాజమాన్యమే కలిగి ఉండాలన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను స్టీల్ యాజమాన్యం అనుసరించడం తగదని, యాజమాన్యం తన వైఖరిని మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధి పరంధామయ్య మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నామని చెప్పారు. దీక్షా శిబిరంలో ఎస్‌ఎంఎస్-1 ప్రతినిధులు విడివి.పూర్ణచంద్రరావు, రమణమూర్తి, ముత్యాలనాయుడు, గుమ్మడి నరేంద్ర, కార్మికులు కూర్చున్నారు.