ప్రజాశక్తి-కలెక్టరేట్ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ చర్యను ఉపసంహరించు కుంటున్నట్లు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రకటించే వరకూ పోరాటం ఆగదని స్టీల్‌ప్లాంట్‌లోని హెచ్‌ఎంఎస్ యూనియన్ అధ్యక్షుడు దొమ్మేటి అప్పారావు స్పష్టంచేశారు. స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ కార్మిక, ప్రజాసంఘాల జెఎసి ఆధ్వర్యాన జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 537వ రోజుకు చేరాయి. ఈ దీక్షల్లో స్టీల్‌ప్లాంట్ హెచ్‌ఎంఎస్ యూనియన్ నాయకులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల ఆస్తులను అప్పనంగా పెట్టుబడిదారులకు కట్టబెడతానంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజా పోరాటాలకు ఎంతటి వారైనా దిగిరాక తప్పదన్నారు. తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తపరిచారు. అక్టోబర్ 2న విశాఖలో పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ఈ దీక్షలలో హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి జి.గణపతిరెడ్డి, నాయకులు జి.సత్యారావు, ఒ.అప్పలరాజు, కె.రమణ, పి.మూర్తి పాల్గొన్నారు.










