Sep 04,2021 06:16

      కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయివేటీకరణ తాండవం చేస్తోంది. జాతి సంపదనంతా కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడితే కానీ కునుకు పట్టదన్నట్టు నయా ఉదారవాద ఉన్మాదాన్ని ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్మడానికి ఒక ప్రత్యేక కార్యాచరణను ఇటీవలే నిస్సిగ్గుగా ప్రకటించిన కేంద్రం.. ఇప్పుడు గ్రామాలపైనా ప్రయివేటు కత్తి వేలాడదీసింది.
      గ్రామ పంచాయితీలు స్వావలంబన సాధించాలంటే తమ పరిధిలో ఉన్న ఆస్తులను అమ్మేసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకోసం ప్రణాళికలు రూపొందించాలని ఒత్తిళ్లకు తెరలేపింది. గ్రామసభలు తప్పనిసరిగా నిర్వహించడం, ఆ సభల్లో 12 కీలకాంశాలు చర్చించాలని సూచించింది. కేంద్రం నుంచి ఆదేశాలు అందిన తర్వాత నిర్వహించే మొట్టమొదటి గ్రామసభలోనే మానిటైజేషన్‌ ప్రక్రియ గురించి చర్చ చేయాలని నిర్దేశించడంలోనే కేంద్రం ఉబలాటమేంటో బోదపడుతుంది. ఆస్తిపన్ను, వృత్తిపన్ను, ఉమ్మడి ఆస్తులను లీజుకివ్వడం, సర్వీసు చార్జీలు విధించడం తదితర నగదీకరణ చర్యలపై నిర్ణయాలు చేయాలని కూడా పేర్కొంది.
      కేంద్రం లెక్కలో 'ఒక మనిషి తన కాళ్లపై తాను నిలబడాలంటే తనను తాను వేరేవాళ్లకు అమ్మేసుకోవాలన్నమాట'. అది బానిస బతుకౌతుందే తప్ప సొంతకాళ్లపై నిలబడటం కాబోదు కదా. పంచాయితీలకు ఉన్న ఊరుమ్మడి ఆస్తులను అమ్మేస్తే ..వాటిని కొనుగోలు చేసిన ప్రయివేటు కంపెనీల సేవలో పునీతమవ్వడమే పంచాయితీల పనిగా మారే ప్రమాదముంది. ఈ పాటి ఇంగితం కేంద్రానికి లేకపోవడం సిగ్గుచేటు. ఊరుమ్మడి ఆస్తులుంటేనే వాటి నిర్వహణ కోసం పంచాయితీల అవసరం ఉంటుంది. ఇక ఆ ఆస్తులనే అమ్మేస్తే పంచాయితీల మనుగడేముంటుంది. ఇక స్వావలంబన ఎక్కడిది? షెడ్యూల్డు, అటవీ ప్రాంతాల్లో ఖనిజాలు, ఇతర వనరులను కొల్లగొట్టేందుకు ఇప్పటికే జిమ్మిక్కులకు పాల్పడుతున్న ప్రయివేటు కంపెనీలకు గ్రామాల్లోనూ కొనుగోళ్లకు వీలు కల్పిస్తే దృతరాష్ట్ర కౌగిలిలో బందీకావడమే అవుతుంది. మహాత్మ గాంధీ 'గ్రామ స్వరాజ్యం' కలలను కంటే మోడీ గ్రామాలను బానిసత్వంలోకి నెడుతున్నారు.
    ఇంతకాలమూ నయా ఉదారవాద విధానాలకు వత్తాసు పలికిన ఆర్థిక వేత్తలు సైతం జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి) పట్ల అభ్యంతరాలను, వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారంటే బిజెపి ప్రభుత్వం ఎంతటి వినాశనానికి తెరదీసిందో అర్థం చేసుకోవచ్చు. బంగారు గుడ్లు పెట్టే బాతును అత్యాశకు పోయి బలి తీసుకున్న కసాయి తరహాలో జాతి సంపదను ఇలా గంపగుత్తగా కార్పొరేట్‌ కంపెనీలకు బలిపెడితే భవిష్యత్‌ తరాలకు మిగిలేదేమిటన్న ఆర్థిక వేత్తల ప్రశ్న సహేతుకమైనదే. అయితే కేంద్రం నుంచి ఈ ప్రశ్నకు సమాధానాన్ని ఆశించలేం. ఎందుకంటే మోడీ సర్కార్‌ దృష్టిలో ప్రభుత్వ ఆస్తులను నిర్వహించాల్సింది వ్యాపారవేత్తలు కాని ప్రభుత్వం కాదుకదా!
పంచాయితీలంటే కేవలం లాభాలు దండుకునేందుకు ఏర్పాటు చేసిన సంస్థలు కాదని, ప్రజలకు సేవలందించేందుకు ఏర్పాటు చేసిన సంస్థలన్న సంగతి మోడీ ప్రభుత్వం మరిచిపోయింది. ఈ నేపథ్యంలో కేంద్రం చెంప చెల్లుమనేలా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్‌ జాతీయ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపి) పట్ల తీవ్ర వ్యతిరేకత తెలిపారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం.
     కేంద్ర వినాశకర ఎత్తుగడలను తుత్తునీయులు చేయాలంటే మిగిలిన రాష్ట్రాలు కూడా ఎన్‌ఎంపిని వ్యతిరేకించాలి. పంచాయితీల స్వావలంబన పేరుతో మోడీ సర్కార్‌ ప్రతిపాదించిన గ్రామాల మానిటైజేషన్‌ విధానాన్ని తిరస్కరించాలి. గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించే రాజ్యాంగ బద్ద బాధ్యత నుండి తప్పుకునే కుతంత్రం కూడా కేంద్ర ప్రతిపాదనలో దాగుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. గ్రామ సచివాలయాలు ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తున్నామంటున్న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం తీరును నిరసించాలి. పంచాయతీరాజ్‌ శాఖకు కేంద్రం పంపిన ప్రతిపాదనలను తిరస్కరించి గ్రామాల్లోని ఉమ్మడి సంపదను పరిరక్షించుకోవాలి. కేంద్ర వినాశకర విధానాలకు వ్యతిరేకంగా విశాల పోరాటాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలి.