పుల్లంపేట : మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రయివేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడిని అరికట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం ఎంఇఒ తిరుమలరావుకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ, ఉపాధ్యక్షులు రమణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12 నుంచి పాఠశాలలో ప్రారంభమయ్యాయని విద్యా హక్కు చట్టం-2009 పాటించకుండా నడుపుతున్న ప్రయివేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబం ధనలు ఉల్లంఘిస్తూ అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. దాదాపు పది సంవత్సరాలు పైగా నేటికీ రేకుల షెడ్లలోనే విద్యార్థులకు చదువులు చెప్పే పరిస్థితి ఉందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల చేత వేలాది రూపాయలు వసూలు చేస్తూ వారి సొంత వ్యాపారాలు చూసు కుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు వివరాలను నోటీసు బోర్డులో ఉంచకుండా నిబంధనలను గాలికొదిలేస్తున్నారని విమ ర్శించారు. పాఠశాల ఆవరణలోనే అధిక ధరలకు పుస్తకాలు, యూనిఫాం ఇతర స్టేషనరీ కూడా అమ్ముతున్నారని అన్నారు. మండల పరిధిలోని అన్ని ప్రయివేట్ పాఠశాలలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఫీజుల దోపిడీని అరికట్టి పేద విద్యార్థుల ఉన్నత చదువుల ఆశయం నెరవేర్చాలన్నారు.










