
ప్రజాశక్తి-కోటవురట్ల:మండలంలో ఎండపల్లి గ్రామం వద్ద అనధికారిక లే అవుట్‌పై స్థానికులు స్పందనలో చేసిన ఫిర్యాదు, ప్రజాశక్తి దినపత్రిక సహా పలు పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు రెవెన్యూ అధికారులు స్పందించారు. ఇటీవల జిల్లా కలెక్టర్ రవి పటాన్ శెట్టి మండలాన్ని సందర్శించిన సందర్భంలో అక్రమ లేఅవుట్ ల పై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా విచారణ చేపడతామని చెప్పారు. ఇందులో భాగంగా శుక్రవారం నర్సీపట్నం రెవిన్యూ డివిజనల్ అధికారి వెంకట జయరాం సదరు లేఅవుట్ పై విచారణ ప్రారంభించారు. లేఅవుట్‌ను పరిశీలించడంతో పాటు పరిసర ప్రాంతాల వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. లేఅవుట్ ఏర్పాటు చేసిన సర్వే నెంబర్లు, ప్ప్రైవేటు, అనాధీనం, జరాయితి భూమి, వివరాలు సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు శుక్రవారం మండల రెవెన్యూ, మండల పరిషత్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దారు జానకమ్మ, ఈవోపిఆర్‌డి ప్రేమ్ సాగర్, డిప్యూటీ తహసిల్దార్ సోమశేఖర్ పాల్గొన్నారు.