Jun 20,2023 21:18

విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ


ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌
కార్పొరేట్‌, ప్రయివేట్‌ పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు అమ్ముడుపోయారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహ సర్వేపల్లి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో కార్పొరేట్‌, ప్రయివేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పాఠ్యపుస్తకాల పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. విద్యాశాఖ అధికారులు పాఠశాలల యాజమాన్యాలకు అమ్ముడుపోయారని ఆరోపించారు. రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి, పీలేరు, మదనపల్లె, ప్రాంతాలలో పాఠశాలలు నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతూ పాఠ్యపుస్తకాలు పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి వేలాది రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. విద్యార్థి సంఘాలుగా అనేక మార్లు పిర్యాదులు చేసినా ఎటువంటి విచారణ, చర్యలు చేపట్టలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు జగనన్న విద్యా కానుక పేరుతో ప్రభుత్వం టెండర్‌ ద్వారా ఒక్కో విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, వర్క్‌ బుక్కులు, కుట్టు కూలీతో సహా మూడు జతల యూనిఫామ్‌, ఒక జత బూట్లు, సాక్సులు, బెల్టు, స్కూల్‌ బ్యాగ్‌ తో పాటు, డిక్షనరీ ఇలా అన్నిటికీ కలిపి కేవలం మొత్తం రూ.2,400 ఖర్చు చేస్తుందని., అదే కార్పొరేట్‌, ప్రయివేట్‌ పాఠశాలల్లో వారు ఇచ్చే 7, 8 పుస్తకాలకే రూ.6,000 నుండి రూ.10 వేలు వసూలు చేస్తున్నారని అన్నారు. ఫీజులు, డొనేషన్ల రూపంలో తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు కార్పొరేట్‌, ప్రయివేట్‌ పాఠశాలల విషయంలో మామూళ్లు తీసుకొని అనుమతులు ఇస్తున్నారని, అందుకే ప్రతి ఏటా నియోజవర్గ కేంద్రాలలో అనేక కార్పొరేట్‌, పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. గుర్తింపు లేని పాఠశాలల దగ్గర నుంచి వేలాది రూపాయలు అక్రమంగా వసూలు చేశారని, అందువల్లనే గుర్తింపు లేని పాఠశాలల వివరాలు ప్రకటించలేదన్నారు. ఇప్పటికైనా స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని, తనిఖీ సమయంలో విద్యార్థి సంఘాలను అనుమతించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు హరి, శశికుమార్‌ పాల్గొన్నారు.