ప్రజాశక్తి - పాలకొండ రూరల్ : పట్టణంలోని పలు ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీలో భాగంగా వాటి పని తీరును జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి(డిఐఒ) డాక్టర్ టి.జగన్మోహనరావు తన వైద్య బృందంతో కలిసి సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ మేరకు ఆయన శ్రీ చిన్నబాబు మదర్, చైల్డ్ కేర్ ఆసుపత్రి, శ్రీ గాయత్రి చిల్డ్రన్ కేర్ క్లినిక్, డాక్టర్ మాధవరావు క్లినిక్, శ్రీ మణికంఠ లాబొరేటరీలో రోజువారీ నిర్వహిస్తున్న ఒపి రికార్డులు, లాబ్ నిర్వహణ, మందులు నిర్వహణ రికార్డులు, మరుగుదొడ్లు నిర్వహణను పరిశీలించారు. స్కానింగ్ యంత్రాలను పరిశీలించారు. బయోమెడికల్ వేస్ట్ నిర్వహణ పక్కాగా ఉండాలని, చేతుల పరిశుభ్రత, పిల్లలు, గర్భిణీలు, రోగుల ఆరోగ్య జాగ్రత్తలను సూచించే పోస్టర్లు విధిగా ఉంచాలని, ఒపి రికార్డుల వివరాలు స్పష్టంగా ఉండాలని ఆదేశించారు. అలాగే అగ్ని నిరోధక భద్రత పరికరాలు సరైన ప్రదేశంలో ఉంచాలన్నారు. నోటిఫైడ్ వ్యాధులు గుర్తించిన వెంటనే వైద్య శాఖ సూచించిన ఐహెచ్‌ఐపి పోర్టల్‌లో తక్షణమే నమోదు చేయాలన్నారు. అలాగే అక్కడి రోగులతో జగన్మోహనరావు ముఖాముఖిగా మాట్లాడి ఏ అనారోగ్య సమస్యలతో వచ్చారో అడిగి తెలుసుకొని ప్రిస్క్రిప్షన్ పరిశీలించారు. అనంతరం 4వ వార్డులో సీజనల్ వ్యాధుల దృష్ట్యా వైద్య సిబ్బంది నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డెమో వై. యోగీశ్వరరెడ్డి, సూపర్ వైజర్ జయగౌడ్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










