
ప్రజాశక్తి-మధురవాడ : వ్యవసాయం నుంచి పారిశ్రామిక రంగం వరకు ప్రతి రంగంలోనూ పర్యావరణహిత సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యత పెరుగుతోందని, ఈ నేపథ్యంలో భవిష్యత్తులో గ్రీన్ జాబ్స్, హరిత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరిశ్రమలకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ సైన్స్ పర్యావరణ శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో శనివారం జరిగిన వర్క్ షాప్‌లో నిపుణులు అభిప్రాయాలు వెల్లడించారు. వర్క్ షాప్‌ను గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కెఎస్.కృష్ణ ప్రారంభించి మాట్లాడారు. పెరుగుతున్న పర్యావరణ సమస్యల కారణంగా పరిశ్రమలు, ఔషధ రంగం, వ్యవసాయ రంగం హరిత సాంకేతిక పరిజ్ఞానం వైపు దృష్టి సారిస్తోందన్నారు. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఈ మార్పు భవిష్యత్తులో పర్యావరణ నిపుణులకు విస్తృత ఉపాధి మార్గాలతో పాటు స్వయంగా పరిశ్రమల స్థాపించే అవకాశాలను కల్పిస్తోందని అభిప్రాయపడ్డారు.
గీతం పర్యావరణ శాస్త్ర విభాగం సీనియర్ ప్రొఫెసర్ ఎన్.శ్రీనివాస్ మాట్లాడుతూ, గ్రీన్ టెక్నాలజీ స్టార్టప్‌లు, ప్రత్యామ్నాయ ఇందన వనరులు, సర్క్యులర్ ఎకానమీ, సహజ వనరుల నిర్వహణ వంటివి నూతన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు. పట్టణ వ్యవసాయం, మిద్దె పంటలు కొత్త తరం వ్యవసాయ నిపుణులను ఆర్థికంగా ఆకర్షిస్తున్నాయని తెలిపారు. పర్యావరణ శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె.సురేష్ కుమార్ వాయు కాలుష్యం పెరగడానికి గల కారణాలను విశ్లేషించారు. దేశంలో నీటి కాలుష్య తీవ్రతపై ప్రసంగించిన పర్యావరణ శాస్త్ర విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎమ్.కిరణ్మయి రెడ్డి 21 శాతం వ్యాధులకు నీటి నాణ్యతాలోపాలే కారణమన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె.వేదవతి, రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ అనీమా సునీల్ దధిచి, పర్యావరణ శాస్త్ర విభాగం అధిపతి డాక్టర్ సరిత, వర్క్ షాప్ కన్వీనర్ డాక్టర్ విడిఎన్.కుమార్ అబ్బరాజు తదితరులు ప్రసంగించారు.