పెరిగిపోతున్న కాలుష్యాన్ని చూసి, ఆ పాఠశాల సిబ్బంది కలత చెందారు. తమవంతుగా ఎలాగైనా పర్యావరణాన్ని పరిరక్షించాలి అనుకున్నారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూనే, మొదట వివిధ రకాల వెదురును క్యాంపస్‌లో నాటడానికి ప్రోత్సహించారు. అంతటితో ఆగకుండా సేంద్రీయ వ్యవసాయం, వ్యవసాయ శాఖ సహాయంతో 'నేచర్ క్లబ్' సభ్యుల నేతృత్వంలో వ్యవసాయం, మూలికా తోటలు, సేంద్రీయ కూరగాయలను పండించడం మొదలెట్టారు. ఇంకా ఆక్వాసాగు చేస్తూ ఎన్నో పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. అది మరెక్కడో కాదు కేరళలోని కూనమ్మవులోని 'చవర దర్శన్ సిఎంఐ పబ్లిక్ స్కూల్'. అసలా పాఠశాల విద్యార్థులు ఏమి చేస్తున్నారో తెలుసుకుందాం...
'దాదాపు ఏడేళ్ల క్రితం, 'ఫాదర్ పౌలోస్ కిడంగన్' మా పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా చేరారు. ఈ రోజు మా పాఠశాల ఎందరికో ఆదర్శంగా ఉండటానికి ఆయనే కారణం. ఆయన నిజమైన ప్రకృతి ప్రేమికుడు. క్యాంపస్‌లో వివిధ రకాల వెదురును నాటడానికి మొదట ఆయనే చొరవ తీసుకున్నారు. తర్వాత రెండు చెరువుల్లో, ఒక చెరువులో ఆక్వాసాగు చేసేలా చర్యలు తీసుకున్నారు. అప్పట్లోనే వరిసాగు, కూరగాయలు, సేంద్రీయ వ్యవసాయం కొంచెంగా చేసేవాళ్లం. ఫాదర్ పౌలోస్ పదవీ విరమణ తర్వాత ఆయన స్థానంలో ''ఫాదర్ టామీ కొచెలంజికల్'' నియమితులయ్యారు. ఆయన మాజీ ప్రిన్సిపాల్‌వలే ప్రకృతిని ప్రేమించే వ్యక్తి కావడంతో మా పనులు ఏమీ ఆగలేదు' అంటున్నారు ఆ పాఠశాల హిందీ ఉపాధ్యాయురాలు, నేచర్ క్లబ్ కో-ఆర్డినేటర్ అనిత శశికుమార్.
ఒక్కోసారి క్లాసులూ వెదురుతోటలోనే..
పాఠశాలలో ప్రస్తుతం అరెకరం విస్తీర్ణంలో వెదురు తోటను పండిస్తున్నారు. ఇందులో అనేక ప్రాంతాల నుంచి సేకరించిన 34 రకాల వెదురులు ఉంటాయి. 'కొత్తగా ఎవరైనా మా వెదురు తోటను సందర్శించినప్పుడు, అక్కడి వాతావరణం వారికెంతో నచ్చిందని చెబుతారు. ఇతర మొక్కలతో పోల్చినప్పుడు వాతావరణంలో 30 శాతం ఎక్కువ ఆక్సిజన్‌ను వెదురు విడుదల చేస్తుంది. అలాగే ఎక్కువ కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహిస్తుంది. కాబట్టే మా విద్యార్థులు రోజులో ఎక్కువ సమయం ఆ తోటలోనే గడుపుతారు' అంటున్నారు ఫాదర్ టామీ.
'కొన్నిసార్లు మేము వెదురు తోటలో తరగతులు, యోగా సెషన్‌ను, సమావేశాలను నిర్వహిస్తాము. వెదురుతోట సమీపంలో కోళ్లు, బాతులు, మేకలు, కుక్కలు, కుందేళ్లతో కూడిన చిన్న పౌల్ట్రీ ఫారం ఉంది. ఫాదర్ టామీకి జంతువులంటే చాలా ప్రేమ. ఆయన చొరవతోనే క్యాంపస్‌లో జంతువులను పెంచగలుగుతున్నాం. పిల్లలూ వాటిపై చాలా ఇష్టాన్ని పెంచుకున్నారు. ఈ మధ్య మా విద్యార్థి ఒకరు పర్షియన్ పిల్లిని పౌల్ట్రీకి విరాళంగా ఇచ్చాడు. మా పాఠశాలలో సేంద్రీయ వ్యవసాయం చేస్తాం. మా విద్యార్థులే కూరగాయలు, వరి, అనేక రకాల ఔషధ మొక్కలు పెంచుతారు. అందుకుగాను మేం ఎలాంటి రసాయన ఎరువులు, పురుగుమందులను ఉపయోగించము. ఏడేళ్లుగా ''ఉమ'' అనే వరి రకాన్ని పండిస్తున్నాం. దాని కోత తర్వాత పాలకూర సాగు చేశాం. ప్రత్యేక విత్తనాలు తెప్పించి బచ్చలికూర, టమోటా, బెండకాయ, మిరపలాంటి కూరగాయలను రెండెకరాల్లో సాగు చేస్తున్నాం. గతేడాది 500 కిలోల కూరగాయలను పండించాం. వాటిని మా క్యాంపస్‌లోనే 'ఎకో షాప్' ద్వారా విక్రయిస్తాం. ఇంకా మా విద్యార్థులు సముద్రపు బాస్, స్వోర్డ్ ఫిష్, టిలాపియాలాంటి వివిధ రకాల చేపలనూ పెంచుతున్నారు. ఫాదర్ టామీ చొరవతో రెండు చెరువులను శుభ్రం చేయించారు. ప్రస్తుతం మా దగ్గర ఐదు వేల చేపలున్నాయి. వాటినీ మా ఎకో షాప్ ద్వారా విక్రయిస్తాం. కొన్నిసార్లు పిల్లల తల్లిదండ్రులకు, సిబ్బందికి ఉచితంగా ఇస్తాం' అంటున్నారు అనిత.
పిల్లలే దుకాణాన్ని నడుపుతారు
'మా ఉత్పత్తులన్నీ సేంద్రీయమైనవి. పూర్తిగా విద్యార్థుల పర్యవేక్షణలో, క్యాంపస్ లోపలే దుకాణాన్ని నిర్వహిస్తారు. వారికి ఒక ధరల జాబితాను అందిస్తాము. దానిని వారు అనుసరిస్తారు. పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులు కొనుగోలు చేస్తారు. విక్రయాల ద్వారా సేకరించిన డబ్బును పాఠశాల అవసరాలకు ఉపయోగిస్తాం. విద్యార్థులు వ్యవసాయం చేయడం వల్ల మరింత బాధ్యత పెరుగుతుంది. విత్తనాలు నాటినప్పటి నుంచి, పంట చేతికొచ్చే వరకు పడిన శ్రమపై ఒక అవగాహన ఉంటుంది' అంటున్నారు ఫాదర్ టామీ. 'విద్యార్థులు పాఠశాలలోనే కాదు, ఇంటి దగ్గరా తోట ఏర్పాటు చేసుకునేందుకు విత్తనాలు పంపిణీ చేస్తున్నాం. ప్రస్తుతం చాలామంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇంటి డాబాలపై వ్యవసాయం చేస్తున్నారు. పాఠశాల లోపల ఎల్‌ఇడీ బల్బులను ఉపయోగించి, విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. అలాగే సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సోలార్ లైట్లు వినియోగిస్తున్నాము' అంటున్నారు వైస్ ప్రిన్సిపల్ అనీలా అలెగ్జాండర్. ఇప్పటికే ఈ పాఠశాలకు మనోరమ వంటి మీడియా సంస్థలతోపాటు, స్థానిక పంచాయితీ నుంచి అనేక అవార్డులు లభించాయి.