ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు
ప్లాస్టిక్ నియంత్రణకు చర్యలు తీసుకోని అధికారులు
ప్రజాశక్తి - మండవల్లి
పాలిథిన్ పర్యావరణానికి పెనుముప్పుగా మారింది. ప్రకృతి ఒడిలోని జీవరాసుల పెరుగుదలను, మనుగడను శాసిస్తుంది. ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించే విధంగా చైతన్యం తీసుకురావడంలో అధికారులు విఫలమవ్వడంతో దాని వినియోగం మరింత పెరిగింది. ప్లాస్టిక్ అణువులు తాగునీటి వనరులతో కలిసిపోవడంతో వాటిని సేవించిన ప్రజలు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారు. మనిషికి మట్టికి మధ్య ప్లాస్టిక్ అడ్డుగోడలా మారి భవిష్యత్తు తరాల మనుగడను అంధకారంలోకి నెట్టేస్తుంది.
మండవల్లి మండలంలో పాలిథిన్ వినియోగం భారీ స్థాయిలో కొనసాగుతుంది. ఏం కొనాలన్నా, తినాలన్నా, ఏది పట్టుకు వెళ్లాలన్నా ప్లాస్టిక్ లేనిదే పని సాగని పరిస్థితి నెలకొంది. ప్లాస్టిక్‌తో మానవాళికి పొంచి ఉన్న ప్రమాదంపై అప్పటి కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కృష్ణాజిల్లాని ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నేను సైతం కృష్ణమ్మ శుద్ధిలో కార్యక్రమాన్ని చేపట్టి ప్లాస్టిక్ ఏరువేతకు 2019లోనే చర్యలు చేపట్టారు. కోవిడ్ అనంతరం 2022లో రాష్ట్ర ప్రభుత్వం ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం మోపి పాలిథిన్ వినియోగాన్ని నియంత్రించే విధంగా చర్యలకు శ్రీకారం చుట్టింది. ప్రజలను భాగస్వామ్యం చేసి ప్లాస్టిక్ నియంత్రణకు కృషి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రచారానికే పరిమితమైన అధికారులు నియంత్రణను గాలికి వదిలేయడంతో మండవల్లి మండలంలో ప్లాస్టిక్ వినియోగానికి హద్దు అదుపు లేకుండా పోయింది. అధికారుల్లో నెలకొన్న నిర్లక్ష్యంతో ప్లాస్టిక్‌ను నియంత్రించడంలో ఆశించినంత దిశగా అడుగు ముందుకు పడలేదు. తోపుడు బండ్ల దగ్గర నుంచి హోటళ్లు, మాంసం దుకాణాలు, కిరాణా షాపుల్లో పాలిథిన్‌ను విపరీతంగా వినియోగిస్తున్నారు. దీంతో రహదారుల వెంబడి కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరిగిపోయాయి. నీటి ప్రవాహానికి అడ్డుపడుతుంది. కాలువల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వాటి అణువులు నీటిలో కలిసిపోవడంతో ఆ నీటిని సేవించిన జంతువులతో పాటు జలచరరాశులు వాటి మనుగడను కోల్పోతున్నాయి. ఆ జంతువుల మాంసాన్ని, చేపలను తిన్న ప్రజలు అంతుచిక్కని వ్యాధులకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి ప్లాస్టిక్ వినియోగంపై చర్యలు తీసుకుని వ్యాధుల బారిన పడకుండా భవిష్యత్ తరాలను కాపాడాలని ప్రజలు ముక్తకంఠంతో వేడుకుంటున్నారు. దీనిపై ఇన్‌ఛార్జి ఎంపిడిఒ పి.మల్లేశ్వరిని వివరణ కోరగా ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించే విధంగా చర్యలు తీసుకుంటానన్నారు. మండవల్లిని ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దడానికి తన వంతు కృషి చేస్తానని ఆమె తెలిపారు.
ప్లాస్టిక్ ఎంతో ప్రమాదం
ప్రొఫెసర్ సుధాబత్తుల విజరుకుమార్
సమస్త జీవరాసుల మనుగడకు ప్లాస్టిక్ ఎంతో ప్రమాదకరం. అవగాహన పెంచుకుని నివారించకపోతే పెద్ద విధ్వంసాన్ని చవిచూడాల్సి వస్తుంది. ప్రతిరోజు పీల్చేగాలి, తినే పదార్థాలు, తాగే నీటి ద్వారా ప్లాస్టిక్ అణువులు మానవ శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి. అంతేకాకుండా ప్లాస్టిక్ ఉత్పత్తులపై ఉండే రసాయనలు తీవ్రమైన హార్మోన్ సంబంధిత క్యాన్సర్‌ను, అంధత్వాన్ని, నాడీ వ్యవస్థ లోపాలతో పాటు మతిమరుపును కలుగజేస్తుంది. రోడ్లపై పక్కన పడవేస్తున్న ప్లాస్టిక్‌ను తిన్న పశువులు అవి కడుపులో జీర్ణం కాక మృత్యువాత పడుతున్న సంఘటనలూ ఉన్నాయి. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించుకోకుండా విచ్చలవిడిగా వినియోగిస్తూ వాటిని ఎక్కడబడితే అక్కడ కాల్చేయడంతో వాతావరణంలో కాలుష్యం ఏర్పడి ప్రకృ వనరులు కూడా పాడైపోతున్నాయి. ప్లాస్టిక్ భూతం నుంచి భావితరాలను రక్షించుకోవడానికి ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ప్లాస్టిక్ వినియోగాన్ని వదిలేసినప్పుడే అది సాధ్యమవుతుంది.










