ప్రజాశక్తి - గుంటూరు లీగల్ : పర్యావరణం విధ్వంసమై విపరీత పరిణామాలకు దారి తీస్తున్న నేపథ్యంలో పర్యవరణ సమతుల్యత దెబ్బతినకుండా దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని అభ్యుతయ రచయిత, ప్రకృతి కవి, తాత్వికులు జయరాజు అన్నారు. ప్రకృతి పరిరక్షణలో న్యాయవాదులు, న్యాయూర్తులు కీలక భూమిక పోషించాలని కోరారు. ప్రకృతి పర్యావరణం అంశంపై గుంటూరు బార్ అసోసియేషన్ సౌజన్యంతో అసోసియేషన్ అవరణలో శుక్రవారం సదస్సు నిర్వహించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ (ఐఎఎల్) ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కెవికె సురేష్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన జయరాజ్ మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం వల్ల అనేక జీవులు అంతరించిపోతున్నాయని, అనేక పక్షులు, సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయని చెప్పారు. ఎండలు విపరీతంగా పెరిగాయని, కాలుష్యం పెరిగి భూమి విషతుల్యమైందని అన్నారు. పరిస్థితులు విషమించకమునుపే సమాజం మేల్కొనాలని, పర్యావరణ పరిరక్షణ బాధ్యత ప్రజలు, ప్రభుత్వాలపై ఉందని అన్నారు. ఎత్తయని మేడలు, అందమైన కారులు ఇవ్వలేకున్నా కనీసం భవిష్యత్ తరాలు బతికే అవకాశం ఇవ్వాలనే సందేశంతో పలు గేయాలు ఆలపించారు. తొలుత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జయరాజు, తదితరులు పూలమాలలేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఐలు రాష్ట్ర కార్యదర్శి నర్రా శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంపర శ్రీనివాసరావు, ఐఎఎల్ జిల్లా అధ్యక్షులు చెరుకూరి సత్యనారాయణ, జాషువా కల్చరల్ సెంటర్ కార్యదర్శి పి.వి.రమణ, బార్ అసోసియేషన్ కార్యదర్శి వంశీకృష్ణ, న్యాయవాదులు శేషగిరి, వెంకటరావు, శాంతకుమార్, చుక్కపల్లి రమేష్, బ్రహ్మేశ్వరరావు పాల్గొన్నారు.










