Oct 19,2023 21:44

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పర్యావరణ వేత్తలు

ప్రజాశక్తి-హిందూపురం : పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పర్యావరణ వేత్తలు అన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పర్యావరణ వేత్తలు భాస్కర్‌ రెడ్డి, ఒపిడిఆర్‌ శ్రీనివాసులు, గంగిరెడ్డి, ధనాపురం వెంట్రామిరెడ్డి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా గత కొంత కాలంగా ఎలాంటి అనుమతులు లేకుండా కలప మాఫియా అటవిశాఖ అధికారులతో కలిసి పచ్చని చెట్లను కూల్చివేస్తోందన్నారు. ఈ విషయాన్ని అన్ని అధారాలతో సహా స్థానిక అటవీశాఖ అధికారి నుంచి జిల్లా అటవీశాఖ అధికారి వరకు, స్థానిక తహశీల్దార్‌ నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఏ ఒక్కరు చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈనేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక కార్యచరణ రూపొందించామన్నారు. గ్రామ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి కలప అక్రమ రవాణ చేసే వారిని అడ్డుకోవడంతో పాటు వాహనాలతో పాటు కలపను అటవీశాఖ అధికారులకు అప్పగిస్తామన్నారు. అప్పటికి వారిపై అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకోక పోతే చెట్లను తాము రక్షించుకుంటామన్నారు. ఈ సమావేశంలో పర్యావరణ వేత్తలు ఉమర్‌ ఫారూఖ్‌ ఖాన్‌, జగదీష్‌, శ్రీధర్‌, హరిలాల్‌ నాయక్‌ పాల్గొన్నారు.