పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటండి
జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటి సంరక్షించాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ పిలుపునిచ్చారు. వన మహౌత్సవంలో భాగంగా శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, కలెక్టర్ సతీమణి తమీమ్ అన్సారియాలు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. జిల్లా అంతటా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పచ్చదనం పెంపొందించేందుకు ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలని ఫారెస్ట్ అధికారులకు సూచించారు. మొక్కల పెంపకాన్ని ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. పచ్చదనం పెరిగినప్పుడే గాలిలో ఆక్సిజన్ పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో డ్వామా పిడి రామచంద్ర రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖాధికారి నాగరాజు, డిఎఫ్‌ఓ ఎన్డికె ప్రసాద్, ఎంపీడీవో సుగుణ తదితరులు పాల్గొన్నారు.










