ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: జిల్లాలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పిలుపు నిచ్చారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సూర్యలంక వద్ద జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, బాపట్ల పార్లమెంటు సభ్యులు నందిగం సురేష్, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మడ అడవుల అభివృద్ధి మత్స్యకారుల జీవితానికి భరోసా అన్నారు. తుఫాను వచ్చినప్పుడు మడ అడవులు తీవ్రతను తగ్గిస్తాయన్నారు. తీరప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధికి నిధులు ఉన్నాయన్నారు. పర్యావరణానికి హాని లేకుండా ప్రతి ఒక్కరూ జీవనాన్ని కొనసాగించాలన్నారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు సురేష్ మాట్లాడుతూ జిల్లాలో మొక్కలు పెంచి ప్రతి ఒక్కరూ ఆరోగ్యానికి కాపాడుకోవాలని అన్నారు. మొక్కలు పెంచడం వల్ల ఆరోగ్యం బాగుంటుందన్నారు. మొక్కలు నాటి వాటి బాధ్యతను కూడా చేపట్టాలన్నారు. బాపట్ల తీర ప్రాంతంలో టూరిజం అభివృద్ధికి తన వంతు సహకరిస్తామని ఆయన అన్నారు. బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్లలో సూర్యలంక ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సూచించారు. సూర్యలంక ప్రాంతంలో ఎకో టూరిజం ప్రాంతంగా తయారు చేయడానికి డిపిఆర్‌లు తయారు చేయాలని అధికారులను కోరారు. బాపట్లలో అటవీ సంపదను కాపాడుకుంటూ టూరిజంను అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో అటవీశాఖ గుంటూరు రేంజ్ చీఫ్ కంజర్వేటర్ వై శ్రీనివాసులరెడ్డి, భారత్ ప్రభుత్వ అటవీశాఖ ప్రతినిధి బాలాజీ, బాపట్ల జిల్లా అటవీశాఖ అధికారి ఎల్ భీమయ్య, రేపల్లె డివిజనల్ అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.
వేటపాలెం: అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వేటపాలెం గ్రామంలో పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంత భారత్ క్యాష్స్ ప్రొడక్ట్స్‌లోని కార్మికులతో పర్యావరణ దినోత్సవం యొక్క విశిష్టతను, పర్యావరణంపై అవగాహన కలగచేస్తు సంఘం అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు మాట్లాడారు. మొక్కలను నాటి వాతావరణ సమతౌల్యాన్ని కాపాడి, ఉష్ణోగ్రత తగ్గుదలకు దోహదకారి అయ్యి, ఇందుమూలంగా వర్షాలు మెండుగా కురిసేందుకు, వ్యవసాయం అభివృద్ధి చెందేందుకు దోహదపడే విధంగా ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని కోరారు. భూమి చల్లబడి జల సంపద సమృద్ధిగా ఉండును ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి భూమిలో త్వరితంగా కలిసిపోయే గుణం కలిగి ఉన్న గుడ్డ సంచులను, మట్టి, జనుము వస్తువులను వాడాలన్నారు. ఇంధనాన్ని పొదుపుగా వినియో గించేందుకు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మొక్కలను విధిగా పర్యవేక్షించవలసిన బాధ్యత ఉందని చెప్పారు. సంఘ అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల సంఘం కార్యదర్శి సుంకర వెంకటలక్ష్మీ ప్రసాద్, గుడుమూటి శేఖర్ బాబు, అశోక్, షేక్ ఖాదర్, వి లక్ష్మణస్వామి, ప్రత్తి కృష్ణ సాయి రఘు, మల్లికార్జున్, పెనుగొండ చరణ్, పూల శ్రీనివాసరావు, రావి మస్తాన్‌రెడ్డి, కార్మికులు అక్కల మస్తానమ్మ, సునీత, బక్క సీతారావమ్మ, షేక్ గుల్జరా, మున్నీ, సిహెచ్ పద్మ, బొగ్గుల జ్యోతి, సుజాత, నాయుడు భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మొక్కల పరిరక్షణకు, మొక్కల పెంపకానికి, వాతావరణ పరిరక్షణకు కంకణం కట్టుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో అనంత భారత్ కాష్యు వారు తయారు చేయించిన గుడ్డ సంచులను పంపిణీ చేశారు.
బాపట్ల రూరల్: ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్‌బాషా అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని ఆయన ఛాంబర్‌లో విద్యార్థులతో ఆయన మాట్లాడారు. చెట్లను పెంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరూ తీసుకోవాలని అన్నారు. పర్యావరణ పరిరక్షణ దినోత్సవంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఆయన అభినందించారు. ప్లాస్టిక్ కవర్ల వినియోగం తగ్గించాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని మరుగుదొడ్లను వినియోగించుకోవాలన్నారు. దోమలకు ఆవాస కేంద్రాలైన మురుగు గుంటలు, చెత్తాచెదారం లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.










