
ప్రజాశక్తి - కాళ్ల
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.జగపతిరాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆజాద్‌కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా మేరా మట్టి - మేరా భారత్ కార్యక్రమం పెదఅమిరం గ్రామ పంచాయతీతో కలిసి కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విభాగం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని మట్టిని కాలుష్యం కోరల నుంచి కాపాడి ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ప్రతి ఒక్కరూ దేశభక్తి స్ఫూర్తితో మొక్కలు నాటాలన్నారు. ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల పాలకవర్గం సభ్యులు సాగి సత్య ప్రతీకవర్మ, పెద అమిరం గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు, కళాశాల వైస్ ప్రిన్సిపల్ కెవి.మురళీకృష్ణంరాజు, ఉప సర్పంచి జవ్వాది కిషోర్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆర్.కృష్ణ చైతన్య, విద్యార్థులు పెద్ద ఎత్తున పెదఅమిరం పంచాయతీ చెరువు చుట్టూ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ ఎం.జగపతిరాజు మాట్లాడుతూ ప్రతి భారతీయుడు దేశ సంపదను ప్రకృతి వరం ఇచ్చిన మట్టి, నీటిని, పర్యావరణాన్ని కాపాడి భావితరాలకు సారవంతమైన భూమిని, నీటిని అందించాలని కోరారు. పెదఅమిరం గ్రామ సర్పంచి డొక్కు సోమేశ్వరరావు, ఉపసర్పంచి జవ్వాది కిషోర్ మాట్లాడుతూ పెదఅమిరం గ్రామ పంచాయతీని ఆదర్శంగా తీర్చిదిద్దడంలో ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాల సాంకేతిక సహకారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌కెఆర్ విద్యార్థులతో పాటు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.